Friday, February 6, 2009

అమెరికాలో అరిటాకులు

2006 లో అనుకుంటా. తేది సరిగ్గా గుర్తు లేదు కానీ నెల మాత్రం ఫిబ్రవరి లేకపోతే మార్చి అయిఉండచ్చు. డెట్రాయిట్లో ఇంకా చలి కాలమే అపుడు. ఎప్పటిలాగే వారాంతం కుంభమేళా పెట్టుకున్నాం. శుక్రవారం ఆఫీసు అయిపోగానే ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఇంక్స్టర్ బయలుదేరాను. మా ఆవిడ ఊర్లో లేదు, "నో నాగమణీ! ఎంజాయ్" అని మనస్సు ఉరకలు వేస్తుంది.




మా ఇంటి నుండి ఇంక్స్టర్ కి 20 నుండి 30 నిముషాలు పడుతుంది ట్రాఫిక్ ని బట్టి. కొంచెం ముందే వచ్చినట్టున్నాను జనం పల్చగా ఉన్నారు. ఉన్న వాళ్ళతో కబుర్లు మాట్లాడుతూ ఉండగా ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టారు. కుంభమేళా లో బాచిలర్స్ కి మాత్రమే అనుమతి, ప్రతిసారీ ఎదో ఒక అజెండా ఉంటుంది. ఎవరిదయినా పుట్టినరోజు కావచ్చు,కొత్త ప్రాజెక్టు పేరుతో ఊరు వదిలిపోవడం కారణం కావచ్చు, లేకపోతే ఎవరీయినా పెళ్ళి కుదిరి ఉండవచ్చు. ఇలా ఎదో ఒక అజెండాతో వారంతం కుంభమేళా జరుగుతూ ఉంటాయి మా దగ్గర. ఆరోజు అజెండా నాకు గుర్తు లేదు, ఎప్పటిలాగే కబుర్లు గల గలా నడిచాయ్. ద్రవంతో నిండిన గ్లాసులు మత్తుగా ఒకరినొకరు పలకరించుకున్నాయ్. బిరియానీ బాక్సులు బద్దలయ్యాయి.




మాములుగా అయితే రాత్రి పూట ఇంటికి వెళ్ళకుండా అక్కడే పడుకునేవాడిని. కొన్ని సార్లు రాత్రి పూటే ఇంటికి వెళ్ళిన సంఘటనలు కుడా లేకపోలేవు. ఆరోజు ఇంటికి వెళ్దామనిపించి, అందరికీ టాటా చెప్పి ఇంటి బయటకి వచ్చా. ఇంటి నుండి ముప్పయ్ నుండి నలభై అడుగులు వేస్తే నా కారు చేరుకోవచ్చు. అపుడు సమయం అర్ధరాత్రి దాటి 2 గంటలయ్యింది. కారెక్కి ఇంజిన్ ఆన్ చేసి కూర్చున్నా, చలి కాలం కాబట్టి విండోస్ మూసి ఉన్నాయి. ఇంక 5,10 సెకండ్లు ఉంటే కారుని రివర్స్ గేరు వేసి ఉండేవాడిని. కారుకి దగ్గరలో నా వెనక వైపు ఎదో ఆకారం కదిలినట్టు అనిపించేసరికి పక్కకు తిరిగా. ఎవరో కొత్త మనిషి విండోని చిన్నగా తట్టాడు. ఏదో అడుగుతున్నాడేమో అని విండోని కిందకు రోల్ చేసా. ఏమయిందో నాకు తెలిసేలోపల ఎక్కడనుండి తీసాడో గుర్తు లేదు తుపాకీ తీసి నా పొట్టకి ఎడమవైపు ఆనించాడు ఆ సచ్చినోడు. నేను కూర్చున్నవాడిని అలాగే ఉండి పోయాను. సూపర్ స్టార్ కృష్ణ అయితే వాడి మణికట్టు మీద సుతారంగా ఒక దెబ్బ తీసి వాడి చేతిలోని రివాల్వర్ ఠక్కున లాక్కునేవాడు. కాకపోతే ఆ సమయంలో నాకు సూపర్ స్టార్ గుర్తుకు రాలేదు. అతని వయస్సు 20, 30 మధ్యలో ఉండచ్చు, నీట్ గానే ఉన్నాడు. చీకట్లో ముఖం సరిగ్గా కనపడడం లేదు. అతనే మెల్లగా "డబ్బులివ్వు" అని తుపాకీని గుచ్చాడు. కదిలితే కాలుస్తాను,నిలబడితే తోసేస్తాను అని పెద్ద డైలాగులు ఏమీ చెప్పడం లేదు. లక్కీగా నా వాలెట్లో $40 డాలర్లున్నాయి. వాలెట్ తీసి డబ్బులిచ్చా. డబ్బులతో పాటూ వాలెట్ కుడా తీసుకున్నాడు. "ఉంగరాలు, చైను లాంటివి ఏమన్నా ఉన్నాయా" అని అడిగాడు. మనకి ఇటువంటివి లేకపోయేసరికి "ఓకె" అని కారు ఆపమన్నాడు. కారు కీస్, సెల్ ఫోను తీసుకుని ఎలా వచ్చాడో అలా చీకట్లోకి మాయమయ్యాడు.



ఆ అగంతకుడు తుపాకీతో బెదిరించి మాట్లాడున్నపుడు నా ఊహంతా "తుపాకీతో పొట్టలో కాలిస్తే ఎలాగా?" అని అలోచిస్తూ ఉన్నా. బాగా నొప్పి పుడటాదేమో? హాస్పిటల్ వరకు కారులో వెళ్ళగలనా? దగ్గరలో ఏ హాస్పిటల్ కి వెళ్ళాలో? హాస్పిటల్ కెళ్ళే దారిలోనే సృహ కోల్పోతానేమో? ఇలా సాగున్నాయి నా అలోచనలు. వాడిని ఎదురిద్దామన్న అలోచన నాకస్సలు తట్టేలేదు, అదే నా ప్రాణాన్ని కాపాడిందేమో?





వాడు చీకట్లోకి కలిసిపోయిన రెండు,మూడు నిముషాలకి కానీ నేను మామూలు మనిషవలేదు. కారు దిగి చుట్టూ చూసి ఇంట్లోకి పరిగెత్తా. ఇందాకే పోయాడూ? అపుడే తిరిగొచ్చాడూ? అని అందరూ నావైపు చూసారు. నేను వణుకుతున్న గొంతుతో "వాడు నాకు తుపాకీ పెట్టాడు,డబ్బులు,వాలెట్,సెల్ ఫోనూ తీసుకెళ్ళాడు" అని అరిచి చెప్పా అందరితో. ఒకరిద్దరు బయటకెళ్ళి చూసారు, కొంత మంది ఫోన్ ఇచ్చి 911 కాల్ చెయ్యమన్నారు. 911 కాల్ చేసి చెప్పా,పోలీసులు ఇంకొక 10 నిముషాల్లో అక్కడకొస్తామన్నారు. ఈలోపల క్రిడిట్ కార్డ్లకి కాల్ చేసి విషయం చెప్పా. పోయిన సెల్ ఫోనుకి చేస్తే వాయిస్ మెయిలుకి వెళ్తుంది.






పది నిముషాలలోపే పోలీసు వచ్చాడు, కారులో ఉండి వివరాలు రాసుకున్నాడు. ఎటువంటి తుపాకీ పెట్టాడు? అని నన్ను ప్రశ్నించాడు. మనకేం తెలుసు? వాడి వైపు శూన్యంలో చూస్తూ ఉండేసరికి పోలీసుకి విషయం అర్ధమయ్యి తన తుపాకీ తీసి చూపించాడు. "ఇలాంటిదా?" అని రెండు సార్లు తిప్పించి మళ్ళించి చూపించాడు. అలాంటిదే! అవునన్నాను. "ఓ! ఇది ఆటోమాటిక్" అని తాపీగా ఎదో రాసుకున్నాడు. "యు ఆర్ వెరీ లక్కీ! హీ డిడ్ నాట్ షూట్ యూ!!" అని నవ్వాడు. అప్పటివరకు చలిలో నవ్వుతున్న నాకు ఇంకా భయమేసింది. పోలీసు తన ఫోన్ నంబరిచ్చి ఇటువంటి కేసులు ఇక్కడ చాలా కామన్ అని వెళ్ళిపోయాడు. అలా ఆరోజు నేను బతికి బట్టకట్టాను.





ఈ మధ్య వరుసగా అమెరికాలో తెలుగు వాళ్ళ మీద జరుగుతున్న దారుణాలు చూసి కొన్ని జాగ్రత్తలు చెపుదామని నాకు జరిగిన సంఘటన మీతో పంచుకున్నాను. ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించండి. మీకు తెలిసినవారికి ఈ సమాచారం తెలియజేయండి.





  1. మొదటగా గుర్తు పెట్టుకోవలసిన విషయం "తెలియని వ్యక్తి అర్ధరాత్రి మన కారు దగ్గరకి కేనీ, ఇంటికి కానీ వస్తే తెలుపు తీయకూడదు. ఇది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. పోలీసులు కుడా ఇదే చెప్పారు.

  2. మీరు తిరుగుతున్న ఏరియా అంత సేఫ్టీ కాదంటే ఒంటరిగా ప్రయాణించద్దండి. రాత్రి పూట ప్రయాణాలు మానుకోండి. జనాలు లేని చోట ఒంటరిగా నడవవద్దండి.

  3. మీ ఇంటి ముందు, కారు ముందు ఎవరన్నా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకి కాల్ చేయండి.

  4. ఖర్మ కాలి ఎవడన్నా మనకి తగిలి తుపాకీతో బెదిరిస్తే వాడు అడిగినవన్నీ ఏమాత్రం సందేహించకుండా ఇచ్చేయండి. వాడితో పెనుగులాట ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. అది మన ప్రాణాన్ని తీయడానికి దారితీయచ్చు.

  5. వాలెట్ లో కొంచెం డబ్బులు ఉండేలా పెట్టుకోండి. అగంతకుడికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాడి పాటికి వాడు పోతాడు.

  6. మీరు ఉంటున్న ఏరియా ఎటువంటిది తెలుసుకోవాలంటే మన లోకల్ పొలీస్ స్టేషన్ కి కాల్ చేసి కనుక్కోండి. మీరున్న ఏరియాకి నేర చరిత్ర బాగా ఉందంటే తక్షణమే ఇల్లు ఖాళీ చేసి సేఫ్ అయిన ఏరియాకి మారిపోండి.


అమెరికాలో తుపాకులు అంగడికెళ్ళి చాలా సులభంగా కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండడం వల్ల తుపాకీలతో కాల్చుకోవడం ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి. తుపాకుల నియంత్రణ చట్టాలని తేవాలని కొంత మంది ప్రజలు, మా ప్రాణాలు కాపడుకోవడానికి తుపాకులు అవసరమని కొంతమంది ప్రజలు గొగ్గోలు పెడుతూనే ఉన్నారు. పిల్లలకు స్కూలు నుండే ఇటువంటి వాటి గురించి చెప్పి తగు జాగ్రత్తలు పాటించడం అలవాటు చేపిస్తారు. సప్త సముద్రాలు దాటి వచ్చిన మనలాంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా. అరిటాకు ముల్లు మీద పడ్డా అరిటాకుకే దెబ్బ!



----------------------------------- సర్వేజనా సుఖినోభవంతు! ---------------------------------------

13 comments:

Anonymous said...

Thanks for sharing ur experience and for the thoughtful tips.

Anil Dasari said...

ఆర్ధిక మాంద్యం మూలాన ఇటువంటివి ఎక్కువవుతున్నాయి. మరో ఉపయుక్తమైన సలహా: మీ కారుకి కీ-లెస్ ఎంట్రీ ఉంటే, దూరం నుండే ఒకసారి పానిక్ బటన్ నొక్కండి. ఆగంతకులెవరన్నా కారు చాటున ఉంటే ఉలికిపడి పారిపోయే అవకాశముంటుంది.

రానారె said...

Wow! థ్రిల్లర్ సినిమా చూసినట్టుగా వుంది!! ఖాళీ వాలెట్‌తో తిరగడం, తెలిసికూడా నేను చేస్తున్న పెద్ద తప్పు.

వెంటనే నేను కూడా మీలాగే $40 వాలెట్‌లో పెట్టుకోవాలి. :-)

శ్రీ said...

You very welcome Anonymous.

మంచి సలహా ఇచ్చారు అబ్రకదబ్ర గారు, గుర్తుంచుకుంటాను.

నెనర్లు రానారె గారు. వాలెట్ ఖాళీగా ఉన్నపుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి.

రామ said...

మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. మీరు ఈ సంఘటన లో క్షేమం గా బయట పడినందుకు చాలా సంతోషించాను. మా మిత్రులందరికీ మీ పోస్ట్ ని ఈమెయిలు గా పంపించాను. కీడెంచి మేలెంచడం మంచిది ఎప్పుడూ.

Naga said...

నా వాలెట్టు కూడా ఖాళీగా ఉండటమే ఎక్కువ. వామ్మో..

కొత్త పాళీ said...

మీరు చాలా అనుభవజ్ఞులన్నమాట :)
సారీ, అతి దారుణమైన అనుభవాన్ని ట్రివియలైజ్ చెయ్యడం నా ఉద్దేశం కాదు. అటువంటి సందర్భాల్లో వీరోచిత ప్రదర్శనలేమీ లేకుండా వాడు చెప్పింది చెయ్యడమే బెటరు. 99% ఇటువంటి సంఘటనల్లో వాడు ఏదో అందిన డబ్బు, బంగారం దోచుకుపోదాం అని మాత్రమే చూస్తారు.
ఫిలడెల్ఫియా నగరం చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న రోజుల్లో నేనక్కడ చదువుకున్నాను. అర్ధరాత్రీ అపరాత్రీ యూనివర్సిటీనించి ఇంటికి తిరిగొస్తూ ఉండేవాళ్ళం. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురుకి ఇటువంటి అనుభవాలయ్యాయి. ఏదో అదృష్టంవల్ల నాకైతే కాలేదు. మీరు చెప్పిన జాగ్రత్తలు బాగున్నాయి.

శ్రీ said...

సంతోషం రామ.

ముందు జాగ్రత్త కోసం కొంత డబ్బులు ఉంచుకోండి నాగన్న.

నెనర్లు కొత్తపాళీ గారు.

సుజాత వేల్పూరి said...

అమ్మో, ఎందుకైనా మంచిది కనీసం 100 డాలర్లకు తక్కువ కాకుండా వాలెట్ లో పెట్టుకుని తిరగండి బాబూ! వాడికి నలభయ్యో, యాభయ్యో డాలర్లు చాలకపోతేనో! మనకు కరాటేలు వగైరాలు వచ్చినా, అలాంటి పరిస్థితిలో అవి మనకు వచ్చన్న సంగతి సమయానికి గుర్తు రావద్దూ! మా ఫ్రెండ్ ఒకడు ఇలాగే సమయానికి తనకు బ్లాక్ బెల్టున్న సంగతి మర్చిపోయాడు. అంతా జాగ్రత్తగా ఉండండి, రోజూ టీవీ 9 వాడు ఏదో ఒక చావు కబురు తెస్తూనే ఉంటాడు అమెరికా నుంచి!


చదువుతుంటేనే టెర్రర్ పుడుతోంది గుండెల్లో!

రానారె said...

శ్రీగారూ,

ఇప్పుడే నా మిత్రుడొకరికి చదివి వినిపించాను. చివరలో ముల్లు, అరిటాకు, సర్వేజనా... తో ముగించాను. మహానుభావుడు అంటూ మీకు నమస్తే చెప్పాడు. నేను పగలబడి నవ్వాను. మావాడు సీరియస్ గా మొహం మార్చేసి, 'చాలా ఇంపార్టెంట్ మామా' అన్నాడు. ఆ తరువాత ఒక నిముషానికి మళ్లీ, 'ఇది మనవాళ్లందరికీ ఫార్వర్డ్ చెయ్యి, అసలే మనోళ్లు చురుకైన కుర్రోళ్లు ఖ్‌ఖామెడీగా' అన్నాడు.

రానారె said...

ఇప్పుడు ... చాలా లేటుగా నాకిప్పుడు అర్థమయింది .. ఈ టైటిల్ ఎందుకుపెట్టారో!! :-)))))

Rajendra Devarapalli said...

మా(కుటుంబసభ్యులందరి)అభిమాన దియా తాజాఛాయాచిత్రానికి గాను ధన్యవాదాలు.:)

శ్రీ said...

కొంచెం ఎక్కువే డబ్బులు పెట్టుకుంటాం లేండి సుజాత గారు.ఆ అనుభవం వల్ల కొన్ని పరిసరాల్లో జాగ్రత్తగానే తిరుగుతున్నాం.

మీ కుర్రాళ్ళతో సమాచారాన్ని పంచుకున్నందుకు సంతోషం రానారె గారు. టైటిల్ కొంచెం విడమరిచి "అమెరికాలో అరిటాకులు మన జీవితాలు" అని రాద్దామనుకున్నా, ముగింపుతో ఎలాగు లింకు పెట్టాము కదా అని తీసేసా.

హమ్మయ్యా! రాజేంద్ర గారు, మీరు దియా తాజా చిత్రాన్ని ఎపుడు చూస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాం. దియా మీకందరికీ థాంక్స్ చెప్పమంటుంది.