Monday, February 23, 2009

"స్లమ్‌డాగ్" కి ఆస్కార్ అవార్డుల పెంట

నిన్న రాత్రి టీవీలో ఆస్కార్ అవార్డ్లు ప్రకటిస్తూ ఉంటే "స్లమ్‌డాగ్ మిలియనీర్" సినీయూనిట్ ఆనందం అంతా, ఇంతా కాదు. దీని ముందు క్రిటిక్స్, గొల్డెన్ గ్లోబ్ అవార్డులు గెల్చుకున్నట్టే అందరూ ఊహించినట్టు ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకుంది స్లమ్‌డాగ్ !


"Every dog has its day!" అంటారు! నిజమే ! !

ఈ టపాకి టైటిల్ ఏది పెడతామా అని అలోచిస్తూ ఉంటే పెద్దగా కష్టపడకుండానే నా బుర్రకి తట్టేసింది. ఈ సినిమా పై అసలు చర్చ జరిగిందో, లేదో కానీ సినిమాలో చూపించిన "పెంట" పై మాత్రం వీర లెవల్లో జరిగింది.రసూల్, రెహమాన్ ఇద్దరూ ఆస్కార్ అవార్డు అందుకుని భారతీయులని గర్వపడేలా చేసారు. రెహమాన్ సంగీత దర్శకుడిగా "రోజా" సినిమాతో ప్రవేశం చేసినప్పటినుండీ సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. రసూల్ గురించి సాధారణ సినీ అభిమాని అయిన నాకు ముందుగా తెలియలేదు. అవార్డు వచ్చిన తర్వాత అతను పలు విజయవంతమయిన సినిమాలకు పని చేసాడని తెలిసి సంతోషం వేసింది.కాలాస్త్రిలో మహా శివరాత్రి వైభవంగా జరుగుతున్నాయని పత్రికలు, మా కుటుంబ సభ్యులు చెపుతూ ఉన్నారు. ఈసారి శివరాత్రి విశేషం ఏమిటంటే మా మేన కోడళ్ళు వినీల, చందనలు శివుడి గుడిలో కొన్ని భక్తి పాటలు పాడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇంతకు ముందు తిరుపతిలో కొన్ని అన్నమయ్య పాటలు కుడా చాలా బాగా పాడారు. నాకు ఫోటొలు దొరకగానే నా బ్లాగులో తప్పక పెడుతాను.


పోయిన శుక్రవారం నుండి మా ఊర్లో "సిద్ధం" సినిమా ఆడుతుంది. విడుదలయిన మొదటివారం న్యూజెర్శీలో అంతంత మాత్రం ప్రేక్షకులు వచ్చారంట. రెండవవారం బాక్సు ఖాళీగ ఉంటుందని మా డిస్ట్రిబ్యూటర్ డెట్రాయిట్ కి పంపాడు. సినిమాని ఎలా చెడగొట్టాడూ అని చాలా ఆతృతగా ఉండి శనివారం విపరీతంగా మంచు పడుతున్నా తెగించి సినిమాకి బయలుదేరాను. ఊహించినట్టే సినిమాకి ఎవరూ రాలేదు. నేను ఎపుడూ కూర్చునే కుర్చీలో కూర్చుని సినిమా చూస్తూ ఉన్నాను. సినిమా స్లోగా ఎదో మళయాళం సినిమా చూస్తున్నట్టుగా ఉంది. ఒక 10 నిముషాలు కుడా అవలేదు, ఉన్నట్టుండి తెరపై చిత్రం మాయం! సినిమా హాలు మేనేజర్ కి విషయం చెప్తే "సినిమా టిక్కెట్టు ఎవరూ కొనలేదు, అందుకే సినిమా ఆపేసా" అన్నాడు. పండుగాడు జెల్ల కొట్టకుండానే నా మైండు బ్లాకయ్యింది!
ఈ ఆర్ధిక మాంద్యం నాకు సినిమా చూసే దౌర్భాగ్యానికి నోచుకోకుండా చేసింది.

14 comments:

పరిమళం said...

""స్లమ్‌డాగ్" కి ఆస్కార్ అవార్డుల పెంట"!!:) :)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

భారతదేశానికున్న ఒక చిఱుపార్శ్వాన్ని విపరీతంగా ఉద్ద్యోతించి మనల్ని ప్రపంచదేశాల దృష్టిలో Slumdogs గా నిరూపించి ఆనందిద్దామనే వారి సృష్టి ఈ సినిమా. ఇందులో వారు చూపించదల్చుకొన్న నిజమైన స్లమ్ డాగ్ ఇండియానే. "ఏదో అభివృద్ధి సాధించేస్తున్నామని తెగ సంబరపడిపోకండిరా వెధవ ఇండియన్ డాగుల్లారా ? మీరెప్పటికీ మా దృష్టిలో స్లమ్ డాగ్సే ! మీరలాగే ఉండాలి" అని ఈ సినిమా తీసినవాళ్ళ ఆంతర్యం. లేకపోతే అంత గొప్ప కళాఖండం అని గొప్పలు చెప్పుకుంటున్నదానికి అలాంటి నీచ అసభ్యప్పేరు ఉద్దేశపూర్వకంగా నిర్ణయించరు. ఇండియాని హీనపఱుస్తూ తీసే ప్రతిసినిమాకి తెల్లవాళ్ళ సంస్థలు అవార్డులిస్తాయి. అదీ తెల్లవాళ్ళు తీస్తేనే !

ఎంత అందమైన శరీరానికైనా ఒక మర్మాంగమూ, ఒక ఆసనద్వారమూ ఉంటాయి. అలాగే ప్రతిదేశంలోను పేదఱికమూ, దాని చుట్టూ నేరప్రపంచమూ ఉంటాయి. రహస్యాంగాల్ని ఛాయాచిత్రం తీసి చట్రం కట్టి వీథిగుమ్మంలో వ్రేలాడదీసి ఆనందించడం లాంటిదే Slumdog Millionaire లాంటి సినిమాలు తియ్యడం కూడా !

మనవాళ్ళకి సిగ్గులేదు. దానికి అవార్డులొచ్చాయని చంకలు గుద్దుకోవడానికి ! ఇంతాచేసి అది భారతీయ సినిమా కాదు. దాని నిర్మాణంలో కొద్దిమంది భారతీయులు పాలుపంచుకున్నారంతే ! ఏ.ఆర్.రెహ్మాన్ కి ఆస్కార్ అంటారా ? అది ఆయన వ్యక్తిగత వ్యాసంగ (కెరియర్) విజయంగా చూస్తాను. ఆయనకి ఆస్కారొస్తే ఆయన గిరాకీ, రేటు పెఱుగుతాయి. ఆయనింకా ధనికుడవుతాడు. దేశానికేం ఒరుగుతుంది ?

నాకు ఆస్కార్ అవార్డుల మీద ఉన్న ఆ కాస్తపాటి గౌరవం కూడా నశించిపోయింది, ఇందులో తెల్లవాళ్ళ వలసపరిపాలనా దృక్పథమూ, జాత్యహంకారకోణమూ నగ్నంగా బయటపడ్డాక ! మీరన్నట్లు ఇది కేవలం ఆస్కార్ పెంట మాత్రమే !

రవి said...

తాడేపల్లి గారు,

బాగా చెప్పారు. ఓ ఆశావహ దృక్పథాన్ని ప్రతిబింబించేట్లుగా సినిమా తీస్తున్నాము అన్న ముసుగులో, దేశాన్ని కించపరుస్తూ తీసిన సినిమా ఇది (నాకు అనిపించినది). ఆస్కార్ అవార్డ్ ఏమీ గీటురాయి కాదు, ప్రతిభను నిర్ణయించటానికి.

శ్రీ గారు, "సిద్ధం" లాంటి సినిమాలకు కూడా మీరు సిద్ధమయారంటే....మీకు హేట్స్ ఆఫ్ చెప్పాల్సిందే!

తెలుగు అభిమాని said...

రెహమాన్ బాణీలు పాడుకోటానికి అనువుగా ఉండవు. కానీ ఆర్కెస్ట్రేషన్ లో ఆయన గ్రేట్. బాణీ కట్టడంలో ఇళయరాజా తరువాతే ఎవరైనా. రాజా బాణీ కట్టి ఆ పాటకు రహమాన్ వాయిద్య సమ్మేళనం కూర్చితే అద్భుతంగా ఉంటుంది. స్లం డాగ్ పాటలకు కాదు కానీ రోజా , కండుకొండేన్ సినిమాలకు ఇవ్వాలి. రెహమాన్ ఇన్నేళ్ళ కౄషికి లభించిన గుర్తింపుగా భావించవచ్చు. జయహో పాట అంత గొప్పగా ఏమీ లేదు.

netizen నెటిజన్ said...

@తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం: "కళాతపస్వి" విశ్వనాద్ ఒక సినిమా తీసాడనుకుందాం అందులో ఒక కళాకారుడి గా ఒక మంగళంపల్లి బాల మురళీ కృష్ణ కో, ఒక రవిశంకర్ కో, ఒక వెంపటి సత్యంకో, విదేశి బాష లో తీసిన ఒక చిత్రాల వర్గంలో - వారికి "అస్కార్" పురస్కారం వచ్చిందనుకుందాం, అప్పుడు అది వారి వ్యక్తిగత మైన విజయమేగా?
వారికి ఆస్కారొస్తే గిరాకీ, రేటు పెఱుగుతాయి.వారింకా ధనికుడవుతాడు. దేశానికేం ఒరుగుతుంది ?

శ్రీ said...

@ పరిమళం, --)

@ తాడేపల్లి, బాగా చెప్పారు. ఇక్కడ టీవీల్లో ఎపుడు ఇండియా గురించి మాట్లాడుతున్నా రోడ్ల మీద నడిచే ఎద్దుల బండ్లు, మురికి వాడలు తప్పకుండా చూపిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇదొక జబ్బు. మీరు రెహమాన్ గురించి అన్నది నిజమే! అతను భవిష్యత్తులో హాలీవుడ్ కి పని చేయడానికి మార్గం సుగమవ్వచ్చు ఈ సినిమాతో. ఇప్పటికే మకాం లండన్ దాకా మార్చాడు, ఇంకొన్ని సముద్రాలు దాటితే కీర్తి,డబ్బు తోడవుతాయి.

@ రవి, నాకు ఫ్లాపయిన సినిమాలంటే చాలా సరదా రవి గారు. రిలాక్సుగా పోస్ట్ మార్టం చేయచ్చు. నేను సిద్ధం కి ముందు హోమం కుడా చూసాను.

@ తెలుగు అభిమాని, రోజా, బొంబాయి, దిల్ సే లాంటి జనరంజమయిన సినిమాలకి మంచి అవార్డులే వచ్చాయి రెహమాన్ కి. జయ్ హో పాట మనకి మామూలుగానే ఉంది, వీళ్ళకి ఈ సినిమా పాట కొత్త కదా!

@ నెటిజెన్, రెహామాన్ కి ఇది వ్యక్తిగత విజయమే! ఈ మధ్య ఒక ఆంగ్ల సినిమాకి రెహమాన్ బాంక్ గ్రౌండ్ మ్యూసిక్ అందించాడు. రెహమాన్ కి మార్కెట్ పెరిగుతుంది ఈ అవకాశంతో.

సుదర్శన్ said...

స్వదేశీ ముసుగులో మీరు మాట్లాడే భావజాలం చూస్తుంటే జాలేస్తోంది. నిజాయితీగా చెప్పండి, అసలు మొత్తం సినిమా ట్రాక్ ఎవరైనా విన్నారా? మొత్తం పదమూడు ట్రాకులు? ఎంతసేపూ వాణ్ణి చూసి ఏడవటమే తప్ప మీలో ఎంతమంది ఆదూర్, మృణాల్ సేన్ సినిమాలు ఎగబడి చూస్తారు? హైదరాబాదులో ఫిల్మోత్సవ్ అనిపెట్టి ఊరికే చూడరా బాబూ అంటే చూసే దిక్కుండదు.

చూడబోతే ఇండియా పెంట రంగు చూసి తబ్బిబ్బై ఆస్కార్ ఇచ్చారనేట్లున్నారే? పెంట రంగు మనుషుల రంగుతో నిమిత్తం లేకుండా ఒకటే కలర్. సో దానికి అవార్డులు ఇవ్వరు. సిటీ బస్సుల్లో, రైళ్ళల్లో విచ్చలవిడిగా కనపడే పెంటని ముక్కు మూసుకుని తప్పించుకుంటూ ఈనాటికీ ప్రయాణాలు చేసే మన జీవనాన్ని స్వదేశీ ముసుగులో దాచేసి, వేరే వాణ్ణి తిట్టండి.

అదీ అమెరికాలో పిజ్జాలు తిని, కోకులు తాగి, సకల సౌఖ్యాలు అనుభవించినవాడు ఆస్కార్, అమెరికాని తిట్టి ఇండియా పెంటని ఇండియాలో తప్ప మరెక్కడా చూడకూడదంటూ గొంతెత్తి అరిస్తే ఇంకా గుర్తింపు.

జై హో, జై హో నా సోదర భారతీయుల్లారా..

cbrao said...

Comments and discussion are adding value to this article and this comment is for getting feed.

హరి said...

సగానికెక్కువగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న భారతీయులు మీకు చిరు పార్శ్వంగా కనపడుతున్నారు. కేవలం పెంట చూపిస్తేనే భారతీయ సినిమాకి అవార్డులు వస్తాయనడం వాస్తవ విరుద్ధం. 'గాంధీ' లో ఏ పెంట ఉందని అన్ని ఆస్కార్లు ఇచ్చారు? 'ఫీడ్' పొందడానికి ఇక్కడే వ్రాయనవసరం లేదు. కావాలంటే స్వంత బ్లాగులు సృష్టించుకునే వెసులుబాటు అదృష్ట వశాత్తు ఇంకా ఉంది.

శ్రీ said...

@ సుదర్శన్, మీ అభిప్రాయాన్ని అందించినందుకు నెనర్లు.

@ సీబీ రావు, నెనర్లు. ఆర్టికల్ కి కామెంట్లు, చర్చలూ ఇడ్లీ పక్కన చట్నీల్లాంటివి. రెండూ కలిస్తేనే పొట్టకి ఆనందం!

అబ్రకదబ్ర said...

ఎవడికో ఆస్కారొస్తే దేశానికేం ఒరిగింది అనే వాళ్లే మొన్నటిదాకా వాటికి విలువిచ్చారట! ఇదో రకం ఆక్సీమొరాన్.

@నెటిజన్,హరి,సుదర్శన్:

బాగా చెప్పారు.

కత్తి మహేష్ కుమార్ said...

@తాడేపల్లి: అసలు మీరు ఈ సినిమా చూశారా?

జీడిపప్పు said...

తాడేపల్లి గారు, సినిమా తీసిపారేవలసినది కాదు. ఒకప్పుడు "భద్రం కొడుకో" అనే సినిమా వచ్చింది గుర్తుందా? అలాంటిదే ఇది. కాకపోతే ఒకట్రెండు సీన్లు బాగోవు. పిల్లలుగా ఉన్నపుడు చూపించింది బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం పక్కా మసాలా ఫాంటసీ సినిమా. తెలుగులో విజయేంద్రవర్మకు ఏమీ తీసిపోదు. మామూలు సినిమానే కాకపోతే అనవసరపు ఆస్కార్లు ఎక్కువ అయ్యాయి అంతే. ఒకసారి చూడవచ్చు.

శ్రీ said...

కామెంట్లు రాసిన హరి, అబ్రకదబ్ర, మహేష్ మరియు జీడిపప్పు గారికి నెనర్లు.