Tuesday, June 2, 2009

పిల్లలు గోర్లు కొరికే అలవాటు మానడం ఎలా?


ఈ మధ్య దియ కొత్తగా గోర్లు కొరకడం నేర్చుకుంది. చేతులు, కాళ్ళు ఇలా ఏవి పడితే అవి నోట్లో పెట్టుకుంటూ ఉంది. గోర్లు బాగా పెరిగాయేమో? అని చూస్తే అన్ని వేళ్ళకి శుభ్రంగా ట్రిం చేసి ఉన్నాయి. గోర్లు కొరకవద్దని నా చేతులు అడ్డుగా పెడితే నా గోర్లు కూడా నవ్వుతూ కొరికేస్తుంది. ఈ పాడు అలవాటుని మానిపించడం ఎలా ? అని పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోకుండా గూగుల్ కి వెళ్ళి చూసాను. దియ లాగే మీ అమ్మాయి,అబ్బాయికి కూడా గోర్లు కొరికే అలవాటు ఉంటే ఈ కింది విషయం చదవండి.



గోర్లు కొరకడం, బొటనవేలు చీకడం, జుట్టుతో ఆడుకోవడం లాంటివి తమ సౌకర్యం కోసం చేసుకున్న అలవాటు. రెండు నుండి మూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలలో ఈ అలవాటుని మానిపించడం చాలా కష్టం. పిల్లలకి 5 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు తల్లిదండ్రులు ఇటువంటి అలవాట్ల మీద ఆందోళన చెందడం అనవసరం. గోర్లు కొరికేటపుడు పిల్లల మీద అరవడం పెద్దగా ఉపయోగపడదు.


          1. పిల్లల మీద అరవడం వల్ల ఈ అలవాటు తగ్గడం కాకుండా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. పిల్లలు కొత్త ఆరోగ్యకరమయిన అలవాట్లని ప్రయత్నిస్తూ ఉంటే వాటిని ప్రోత్సహించండి.

          2. ఏ సందర్భాల్లో పిల్లలు ఇటువంటి పనులు చేస్తున్నారో గమనించి ఆ సమయంలో వాళ్ళని వేరే పనిలో ఉంచడానికి ప్రయత్నిచండి. ఉదాహరణకి పిల్లలు ఖాళీ సమయంలో గోర్లు కొరుకుతూ ఉంటే వాళ్ళతో ఏదో ఒక ఆట ఆడండి. ఇలా వాళ్ళని చెడు అలవాటు నుండి డైవర్ట్ చెయ్యచ్చు.

          3. ఈ వయసులో పిల్లలు "మమ్మల్ని గమనించండి" అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. గోర్లు కొరికేటపుడు మనం తిట్టామనుకోండి, దాని వాళ్ళు ఆటగా తీసుకోవడానికి అవకాశం ఉంది". దీనివల్ల ఈ అలవాటు తగ్గకపోగా ఇంక పెరగచ్చు.

          4. చాలా మంది డాక్టర్ల సలహా ఏమిటంటే "అలిసి పోయినప్పుడు, బోరు కొట్టినపుడు పిల్లలు ఇటువంటివి చేస్తున్నపుడు వాళ్ళని దగ్గరకు తీసుకుని వాళ్ళతో కలిసి ఆడుకోండి.


          "ఈ సోదంతా ఎందుకు? రెండు దెబ్బలేస్తే పోతుంది కదా" అనుకోకుండా పిల్లల దగ్గర కొంచెం ఓపికగా ఉండండి.

          14 comments:

          teresa said...

          Good!

          చిలమకూరు విజయమోహన్ said...

          గోళ్ళు కొరికే పెద్దవాళ్ళున్నారు నాలాంటివారు.ఎలా మానాలో చెబుదురూ కాస్త... :)

          Anil Dasari said...

          @విజయమోహన్:

          పెద్దోళ్లకైతే వేళ్లు కత్తిరించేస్తే సరి ;-)

          చిలమకూరు విజయమోహన్ said...

          అబ్రకదబ్ర గారూ,
          మీరు మరీనూ.... :)

          శ్రీ said...

          @ థెరెసా, నెనర్లు

          @ చిలమకూరు విజయమోహన్, మీరు ఏ సందర్భంలో కొరుకుతారో చెప్పండి. బోరు కొట్టినపుడు కొరికితే ఎదో ఒక వ్యాపకం పెట్టుకోండి.

          @ అబ్రకదబ్ర, --)

          హరే కృష్ణ said...

          శ్రీ గారు, గంగూలి అంత విజవంతమైన కెప్టెన్ ఎలా అయ్యాడు ద్రవిడ్ ఎందుకు కాలేదు గోళ్ళు కోరికే వాళ్ళు మహానుభావులు అవుతారు.. విజయ్,రికీ పాంటింగ్, నేను ,గంగూలీ లాగా
          అబ్రకదబ్ర గారు గంగూలీ వెళ్ళు నరికేస్తారా న్యాయమేనా ఇది మీకు :)

          హరే కృష్ణ said...

          కొరకడానికి గోళ్ళు అయ్యాక పెద్దల గోళ్ళు కూడా వాళ్ళ నోట్లో పెట్టాలని నా మనవి

          రవి said...

          నాకూ ఈ అలవాటు ఉంది.

          గోళ్ళు కొరకడం ఆ వ్యక్తి "మానసికంగా బాగా దెబ్బ తిని ఉండడాన్ని" సూచిస్తుందని హెచ్ ఆర్ వారు ఘోషిస్తారు. వాళ్ళు ఆ మాట అన్నప్పటి నుంచీ, వాళ్ళ మీద ప్రతీకార జ్వాలతో రగిలిపోయి, మరింతగా గోళ్ళు కొరుకుతున్నాను. (నాకు ఆ వ్యక్తిత్వ పాఠాలు అసాలు నప్పవు)

          మురళి said...

          'అభద్రతా భావం..' కొంతవరకూ నిజమేనండి.. నాకు టీనేజ్ లో ఈ అలవాటు బాగా ఉండేది.. ఎంతగా అంటే పక్కవాళ్ళు చెబుతుంటే తప్ప గోళ్ళు కొరుకుతున్నానన్న విషయం నాకు తెలిసేది కాదు.. కొంచం కష్టపడి పూర్తిగా మానగాలిగాను. పిల్లల విషయం పట్టించుకోనవసరం లేదు.. శ్రీ గారు అన్నట్టు ఇది వంశ పారంపర్యంగా వచ్చే అలవాటట.. ఫోటోల్లో మీ దియా అచ్చం మీలాగే ఉంది కూడాను :):)

          నాగప్రసాద్ said...

          గోళ్ళు కొరికే అలవాటు నాక్కూడా ఉండేది. ఈ మధ్యే అంటే February 2009 లో మానేయగలిగాను.

          ఎలా మానగలిగానంటే, అంతకుముందు December 2008 లో ఒకసారి నాకు మా ఫ్రెండుకు మధ్య గోళ్ళు కొరికే టాపిక్ వచ్చింది. అప్పుడు మా మధ్య జరిగిన మాటల సందర్భంలో మా ఫ్రెండుకు కూడా గోళ్ళు కొరికే అలవాటు ఉండేదని వాడు మానేశాడని చెప్పాడు.

          గోళ్ళలో విషం కూడా ఉంటుందని అన్నాడు. విషమెక్కడుందిరా నా గోళ్ళు ఇంత నీటుగా ఉంటేను అని నేనంటే వాడు దానికి సమాధానంగా విషం అంటే సీసం లాంటివి మన గోళ్ళలో ఉండే అవకాశం ఉందని, ఇంకా ఈ సీసం ఈ మధ్యకాలంలో వాడుతున్న కల్తీ పెయింటుల వల్ల గాని ఇంకా ఇతర మార్గాల ద్వారా గాని మన గోళ్ళలో కొచ్చి చేరుతుంది అని చెప్పాడు.

          దెబ్బకు భయపడిపోయి నేను అప్పట్నించి ఎలాగైనా గోళ్ళు కొరకడం మానేయాలని గాఠ్ఠిగ నిర్ణయించుకొన్నాను. మొదట్లో చాలా ప్రయత్నం చేశాను. కాని మానడం చేతకాలేదు. ఇక లాభం లేదనికొని, అప్పడు ఎలాగూ నేను ఖాళీగానే ఉండటంతో, కూడలి, జల్లెడ, ఇంకా ఇతర తెలుగుసైట్లు ఓపెన్ చేసి ఎప్పుడైతే గోళ్ళు కొరికించుకోవడానికి చెయ్యి నోటికాడికి వెళుతుందో, వెంటనే తేరుకొని ఇప్పుడు కాదు ఈ టపా చదివిన తర్వాత కొరుకుతా అని చెప్పి బలవంతంగా ఆపేసేవాణ్ణి.

          ఆవిధంగా ప్రతీసారి ఇప్పుడు కాదు ఈ టపా చదివిన తర్వాత అని చెప్పుకుంటూ బలవంతంగా ఆపుకుంటూ మొత్తానికి పూర్తిగా మానడానికి మూడు నెలలు పట్టింది.

          దీనివల్ల అప్పట్లో చెత్త టపాలని కూడా వదలకుండా చదవాల్సివచ్చింది. :((((

          శ్రీ said...

          @ హరేకృష్ణ, కింద మురళి గారు చెప్పినట్టు అభద్రతా భావం ఉన్నట్టుంది గంగూలి కి. గంగూలి కి ఈ అలవాటు లేకుంటే ఇంక మంచి కేప్టెన్ అయి ఉండేవాడేమో?

          @ రవి, మీరు ప్రతీకారం చల్లారితే మీ అలవాటు కూడా మానేస్తారని అనుకుంటున్నాను.

          @ మురళి, దియ నాలాగే ఉన్నా ఈ అలవాటు మాత్రం మా ఆవిడ నుండి వచ్చింది.

          @ నాగ ప్రసాద్, ఒక అలవాటుని మానాలంటే ఇంకొక మంచి అలవాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు బాగా నిరూపించారు. మీ వలన కూడలికి,జల్లెడకి,తెలుగు బ్లాగులకి బాగా మేలు జరిగిందనుకుంటున్నాను.

          Bhãskar Rãmarãju said...

          గోళ్ళు కొరకడం కాల్సియం మరియూ మెగ్నీసియం డెఫిషియన్సి అని విన్నా. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే పదార్ధాలు తింటే సరి

          Anonymous said...

          మంచి విషయాలు చెప్పారు ! థాంక్ యూ !

          శ్రీ said...

          @ భాస్కర్ రామరాజు, మా అమ్మాయి పాలు బాగనే తాగుతుంది. మెగ్నీసియం విషయం కొంచెం పరిశోధిస్తా!

          @ అనానిమస్, సంతోషం!