Friday, July 31, 2009

ఇంకా రాలేదు బాక్సు - మగధీర

స్థలం: డెట్రాయిట్
సమయం: మధ్యాహ్నం 4 దాటింది

మగధీర సినిమా రిలీజ్ అయ్యి 24 గంటలు దాటింది. ఎపుడూ ఇండియాకంటే ముందు చూస్తామని చంకలు గుద్దుకునే వాళ్ళం,ఈసారి ఆ అదృష్టానికి నోచుకోలేదు. మా ఊళ్ళో గురువారం రాత్రికే మొదటి ఆట పడాల్సింది,బాక్సులు రాక ఈరోజుకి పోస్ట్ పోన్ చేసారు. ఈరోజు మధ్యాహ్నం 2:30కి టిక్కెట్టు కొనుక్కుని హాలు లోకి వెళ్తే నేను తప్ప ఇంకెవరూ లేరు యధా ప్రకారం! నిజమే,అందరూ ఆఫీసులో పని చేసుకుంటారు,నెనొక్కడినే వరలక్ష్మి వ్రతం అని సెలవు పెట్టి ఇంట్లో మా అవిడ చేత తిట్లు తింటూ కూర్చున్నా. 3:30 కి సినిమా మొదలవ్వాలి, సినిమా హాలులో వేసే ఆడ్స్ చూస్తూ కూర్చున్నా. 3:35 అయ్యింది,ఎంతకీ సినిమా వెయ్యడం లేదు!ఏమిటి వీడి సంగతి? అని బయటకి వచ్చి చూస్తే లాబీలో పెద్ద గోల! బాక్సు రాకుండానే టిక్కెట్లు ఎలా అమ్ముతావు? అని. మేనేజర్ ఏమీ సమాధానమియ్యకుండా సిగరెట్టు వెలిగించుకోవడానికి బయటకి వచ్చాడు. ఒక్కడినే లోపల కూర్చుని సినిమా ఎపుడు మొదలవుతుందా? అని ఎదురుచూసిన నా అమాయకత్వానికి జాలేసింది.


బాక్సు కోసం ఆరా తీస్తే న్యూజెర్సీలో అపుడే ఏ ఊరికి ఏ బాక్సు పంపాలో రెడీ చేసుకుంటున్నరంట! ఈ బాక్సులు సర్దుకోవడం భలే సరదాగా ఉంటుంది. మామూలుగా బాక్సు తీసుకురావడానికి మనిషి వెళ్ళక్కరలేదు. డిస్ట్రిబ్యూటర్ కార్గోలో బాక్సు వేసేస్తే కొన్ని గంటల్లో మన ఊరికి వచ్చేస్తుంది. ఇండియా నుండి బాక్సులు రావాలంటే ఒక మనిషి 7,8 బాక్సులు తీసుకువస్తాడు. ఇలా వచ్చేటపుడు న్యూజెర్సీ కానీ, షికాగో కానీ వస్తారు. దిగాక కస్టంస్ క్లియర్ చేసుకుని డబ్బాలన్నీ సర్దుకుని ఒక్కొక్క ఊరికి వేస్తారు. డబ్బాలు ఎందుకు సర్దాలంటే కొన్ని రీల్సు సూట్ కేసులో వేసుకుంటారు. డబ్బాలు ఎందుకు సర్దాలంటే కొన్ని రీల్సు సూట్ కేసులో వేసుకుంటారు. అవన్నీ తీసి ఒక్కో డబ్బాలో అన్ని రీల్ బాక్సులు పెట్టి, సినిమా పోస్టర్లు, డీ.టీ.ఎస్ డిస్కులు పెట్టి మూసేస్తారు.


ఇపుడే స్నేహితుడు కాల్ చేసి చెప్పాడు, బాక్సు వచ్చిందని! నేను సినిమా చూసి బ్లాగుతాను.

5 comments:

Raju Sykam said...

చూసిన వెంటనే ...ఇక్కడ రివ్యూ రాయండి. వెయిట్ చేస్తుంటా.

మురళి said...

ఇండియాలో అనుకున్న టైం కే విడుదలయ్యింది.. మరి అక్కడ లేట్ ఎందుకయ్యిందో.. 'వరలక్ష్మి వ్రతం' అని సెలవు :-) :-) .. మీ బ్లాగు కొత్త డిజైన్ బాగుందండీ..

కొత్త పాళీ said...

ha ha ha.
వరలక్ష్మి వ్రతం రోజున మొగుణ్ణి తిట్టడం మహాపాపం .. నేను చెప్పానని చెప్పండి మీ శ్రీమతికి!! పోనీ నెక్స్టియర్ కైనా పనికొస్తుందేమో?

శరత్ 'కాలమ్' said...

హి హి. నేనయితే అప్పుడప్పుడూ ఆఫీసు ఎగ్గొట్టడానికి మా ఆవిడకి సిక్కనో లేక మా చుట్టం ఎవడో పోయాడనో బొంకు/బంకు తుంటాను.

మీలాగే తిట్లు తినడం షరా మామూలే. ఇల్లు కంటే ఆఫీసే పదిలం అని అర్జంటుగా జ్ఞానోదయం అవుతుంది కానీ ఏం లాభం - అప్పటికే ఆఫీసు ఎగ్గొట్టేసాము కదా.

శ్రీ said...

@ రాజు, రాత్రి చూసాను, కాసేపయ్యాక రివ్యూ రాస్తాను.

@ మురళి,గురువారం సాయంత్రానికి రావల్సిన బాక్సు శుక్రవారం సాయంత్రానికి వచ్చింది. ఇండియాలో పంపేటప్పుడే లేట్ అయిందట. మీకు బ్లాగు టెంప్లేట్ నచ్చినందుకు సంతోషం!

@ కొత్తపాళీ, పాపం అంటే తిట్టదేమో? ట్రై చేస్తాను.

@ శరత్, హ హ హా