Sunday, December 13, 2009

ప్రయాణం - 1


అనుకున్నట్టుగా శుక్రవారం నా ప్రపంచ యాత్ర మొదలయింది. ప్రపంచ యాత్ర అంటే పెద్దగా ఏమీ లేదు, డెట్రాయిట్ నుండి కాలాస్త్రికి రావడానికి మద్యలో రెందు, మూడు చోట్ల ఆగుతున్నా. నా అనుభవాలు ఇంకా ఆవిరవకముందే బ్లాగేద్దామని అబుధాబి నుండి బ్లాగుతున్నా.డెట్రాయిట్లో 5.15 కి బయలుదేరాల్సిన విమానం ఒక అరగంట లేటుగా బయలుదేరింది. చికాగో వరకే కాబట్టి చిన్న విమానమే ఎక్కా. మా ఊరు నుండి చికాగో వెళ్ళాలంటే విమానంలో నలభై నిముషాలు,కారులో వెళ్తే 5 గంటలు పడుతుంది. చికాగో దిగాక నా విమానం ఎక్కాలంటే ఇంకొక టెర్మినల్ కి వెళ్ళాలి. ఇంకో టెర్మినల్ వెళ్ళాలంటే అక్కడే తిరుగుతున్న రైలు ఎక్కి నా టెర్మినల్ కి వెళ్ళి మళ్ళీ చెక్ ఇన్ అయ్యాను. నేను వెళ్ళేసరికి బోర్డింగ్ అయిపోయింది. అక్కడే నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే టెర్మినల్ లో పని చేసే ఒకతను అటుగా వచ్చి నన్ను లోపలకి పంపాడు. నేను వెళ్ళిన కాసేపటికి విమానం బయలుదేరింది.


ఈ పెద్ద విమానం చికాగో నుండి డబ్లిన్ వెళ్తుంది. తమాషా ఏమిటంటే మళ్ళీ తిరిగి డెట్రాయిట్ మీదుగా బయలుదేరింది విమానం. ఈ మాత్రానికి నేను డెట్రాయిట్లో ఎక్కి ఉండే వాడిని కాదా అనిపించింది, కాకపొతే విమానం డెట్రాయిట్లో ఆగలేదనుకోండి! నేను విమానం లొ చివర ఎక్కా కదా,నన్ను మొదట్లోనే కూర్చోపెట్టారు. నా వరుసలో నేనొక్కడినే! పెట్టింది తిని, తాగి కాసేపు టీవీ,పుస్తకాలు, లాప్ టాప్ చూస్తూ కాలం గడిపా. నేను పెద్ద ఆజానుబాహుడిని కాదు కాబట్టి నా వరుసలో రెండు దిండ్లు వేసుకుని పడుకున్నా. విమానంలో అలా పడుకుంటే మబ్బుల్లో వుయ్యాల వేసుకుని ఊగినట్టు ఫీల్ అవుతూ గురక మొదలుపెట్టా.


ఉదయం డబ్లిన్ వచ్చేముందు కొంచెం టిఫిన్ పెట్టి కూర్చొపెట్టారు. శనివారం ఉదయం డబ్లిన్ లో దిగింది విమానం. మనకి మళ్ళీ ఇంకొక విమానం ఎక్కాలంటే 12 గంటలు ఉంది. అందుకే డబ్లిన్లో ట్రాన్సిట్ వీసా తీసుకుందామని ఇమ్మిగ్రేషన్ వైపు వెళ్ళా.


నా టికెట్ చూసి ఇమ్మిగ్రషన్ ఆఫీసర్ "చాలా పెద్ద ప్రయాణం" అన్నాడు.


నేను "అవును, ఆన్ లైనులో బుక్ చేసా" అని చెప్పా.


"నాకు డబ్లిన్ చూడాలని ఉంది, ట్రాన్సిట్ వీసా ఇస్తారా" అన్నాను.


"అలాగే" అని నాకు 24 గంటలు డబ్లిన్ లో ఉండడానికి ట్రాన్సిట్ వీసా ఇచ్చాడు.కాసేపు ఫ్రెష్ అయ్యి టూరిస్టు వివరాల కొరకు డబ్లిన్ టూరిజం కి వెళ్ళి కాసేపు ముచ్చటించా. ఏర్ పోర్టు నుండి పికప్, డ్రాపు ఉండేలా రోజంతా బస్సులో తిరగడానికి ఒక పాసు కొనుక్కున్నా. సిటీ టూరు కి ఇంకొక టికెట్ కొనుక్కున్నా.
డబ్లిన్ వివరాలు నేను ఇంకొక టపాలో వివరంగా రాస్తాను.

2 comments:

పరిమళం said...

శ్రీగారూ !శుభ యాత్ర !

శ్రీ said...

థాంక్స్ పరిమళం గారు