Saturday, December 19, 2009

ప్రయాణం - 2


మీరు మొదటి భాగం చదివి ఉంటే వోకే! లేకపోతే ఇక్కడ చదివి రెండో భాగం కి రండి.


ఏర్ పోర్టు లోనే కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకి నడిచా.బయట చాలా బస్సులు నిలబడి ఉన్నాయి.అక్కడే నిలబడి ఉన్న ఒక బస్సులో ఎక్కి నా టిక్కెట్టు చూపించా, అతను వెనక్కి చెయ్యి చూపించి అక్కడ ఆగి ఉన్న ఎర్ర బస్సులోకి ఎక్కమన్నాడు.అతను చెప్పినట్టే ఎర్ర బస్సులోకి ఎక్కి డ్రైవరుకి నా టిక్కెట్టు ఇచ్చా.టిక్కెట్టు నన్నే స్కాన్ చేసుకోమని చెప్పాడు. అలాగే చేసి బస్సు పైకి ఎక్కి ముందు సీట్లో కూర్చున్నా, ఇది డబుల్ డెక్కర్ బస్సు లెండి. ఒక పది నిముషాలకి బస్సు కదిలింది. డ్రైవరే టూర్ గైడు కూడా అనమాట, మనకి టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి చెపుతూ ఉంటాడు.


డ్రైవరు మంచి సరదా మనిషి,ఎదేదో చెప్పి నవ్వుతున్నాడు. నాకు ఐరిష్ యాస కొత్త కాబట్టి నేను పెద్దగా నవ్వలేకపొయ్యాను. ఏమిటో ఐరిష్ కామెడీ! అర్ధమయితే కానీ నవ్వలేం!! అనుకుని నేను రోడ్ మీద దృష్టి పెట్టాను. టూరు అంతా కాలేజీ,చర్చ్,కోర్ట్,ప్రైం మినిష్టర్ బిల్డింగ్స్ మీద సాగింది. టూరులో చెప్పుకోదగింది గిన్నిస్ బీర్ బ్రూయరీ, కొన్ని వందల సంవత్సరాలుగా ఐరిష్ చరిత్రలో భాగంగా ఈ బీరు ఉండిపోయింది. గిన్నిస్ స్టోర్ హోసులో బ్రూయరీ గురించి ఒక చిన్న టూర్ సరదాగా జరిగింది. అక్కడ ఏ బార్లో చూసిన అందరి దగ్గరా ఇవే బీర్లు! మంచి దేశ భక్తులు కదా!


ప్రతి స్టాపులో మనం దిగి అక్కడ కాసేపు తిరిగి మళ్ళీ ఇంకొక టూరు బస్సులో ఎక్కచ్చు.అలా మధ్య మధ్యలో దిగుతూ నా టూరు ముగిసింది. నేను ఎక్కిన బస్సు, టూరు వివరాలు ఇక్కడ చూడచ్చు. సిటీ మధ్యలో టూరు మొదలయ్యి మళ్ళీ అక్కడకి వచ్చి ఆగిపోతుంది. అక్కడ దిగి తిన్నాను. అందరూ క్రిస్మస్ షాపింగ్ చేసి మధ్యలో రెస్టారెంటులో తినడానికి ఆగుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో 3,4 సంచులు ఉన్నాయి. నేను కూడా కాసేపు షాపులు ఎక్కి, దిగి టైం పాస్ చేసాను. ఇంకా చాలా సమయం ఉండేసరికి మళ్ళీ టూరు బస్సు ఎక్కాను. సిటీ మధ్యలో ఒక పెద్ద స్టీల్ స్తూపం ఉంటుంది, తల ఎత్తి చూస్తూ ఉంటే దాని చివర ఆకాశాన్ని పొడిచినట్టు మనకి అనిపిస్తుంది.


టూరు అయిపోగానే ఏర్ పోర్టుకి వెళ్ళే బస్సు ఎక్కి, ఏర్ పోర్టు చేరుకున్నా.అప్పటికి నాకు చెక్-ఇన్ అవడానికి సమయం దగ్గర పడింది. బోర్డింగ్ పాసు తీసుకోవడానికి లైనులో నిలబడ్డా,ఇంతలో నా పేరు అనౌన్స్ చేసి ఎక్కడ ఉన్నా అర్జెంటుగా ఏర్ వేస్ వాళ్ళని కలవాలని చెప్పారు. ఏమిటబ్బా? అని నేను కౌంటరు దగ్గరకెళ్ళి కలిసా.

"మీ లగేజ్ మాకు ఇంతవరకు రాలేదు,మీరు హైదరాబాదు దిగేసరికి మీ లగేజ్ మీతో రాకపోవచ్చు" అని కౌంటరి (కౌంటరులో ఉన్న సుందరి) విచారం వెలిబుచ్చింది.

"పెద్దగా పనికివచ్చేవి ఎమీ లేవులే" అని నాలో నేను గొణిగి "అలాగా" అని ఆశ్చర్యం బుచ్చాను.

"హైదరాబాదులో దిగగానే కంప్లైంటు రాసి వెళ్ళండి" అని కౌంటరి చెప్పింది.

నేను బోర్డింగ్ పాసు తీసుకుని ఒక గంట తర్వాత విమానం ఎక్కాను.

అప్పటి వరకు నేను ఒక మాదిరిగా ఉన్న డెల్టా, చాలా నాసి రకంగా ఉన్న అమెరికన్ విమానాల్లో వచ్చాను. డబ్లిన్ నుండి అబు ధాబి వరకు ఇతిహాడ్ ఏర్ లైన్సులో అనమాట. విమానం ఎక్కగానే కళ్ళు చెదిరాయి, 2009 సంవత్సరానికి ఇది బెస్టు ఏర్ లైన్సట! మన పెట్రోలు డబ్బులన్నీ కనిపిస్తున్నాయి. ఎకానమీ లోనే కాళ్ళు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ ఇచ్చారు.ప్రతి సీట్ కి టీవీ ఉంది. అందులో తమిళ్,హిందీ,మళయాళం సినిమాలు నడుస్తున్నాయి. భోజనాలు కూడా బాగనే పెట్టారు. డబ్లిన్ నుండి ఒక 8 గంటలు ప్రయాణం చేసి అబు ధాబికి ఉదయం 7 గంటలకు దిగాను. ఏర్ పోర్టు కూడా కళ్ళు చెదిరేలా ఉంది.

ఇక్కడి విషయాలు మళ్ళీ ఇంకొక టపాలో రాస్తా.


2 comments:

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

కాళాస్త్రికి వచ్చేశారా? భల్లే
సామానెట్ట పోగొట్టారు ఆఎతిమతం ఎదవలు. ఆసామానేదో దొరికేదాకా ఆకౌంటరికి కొంటెతనం చూపియ్యొచ్చు గదబ్బా.

శ్రీ said...

రేపు కాలాస్త్రికి వస్తున్నాను.నేను చికాగోలో విమానం ఆఖరి నిముషములో ఎక్కాను,నేను రాననుకుని లగేజీ లోపల పెట్టలేదనుకుంటా.ఈ పోగొట్టుకోవడంలో నాకు కూడా షేరు ఉంది!