Friday, January 22, 2010

ఉత్తర అమెరికా ఆటో షో





ప్రతి సంవత్సరం జనవరి రెండు, మూడు వారాల్లో డెట్రాయిట్ కొబో హాల్లో ఆటో షో జరుగుతుంది. ఉత్తర అమెరికాకే చెందినవి కాకుండా ఆసియా,యూరప్ ఖండాలకు చెందిన కార్లని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రపంచంకంతా కావలసిన కార్లు ఇంతకు ముందు డెట్రాయిట్టులోనే తయారయ్యాయంటే అది అతిశయోక్తి కాదేమో! వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఫోర్డ్, జనరల్ మోటార్స్ ఇంకా క్రైస్లర్ కార్ల కంపెనీలకి డెట్రాయిట్ పుట్టినిల్లు. మొదట్లో మూడు కార్ల కంపెనీలు మాత్రమే ఆటో షోలో పాల్గొనేవి. 1987 నుండి కొంతమంది ముందు చూపు కలిగిన ఆటో డీలర్ల ప్రతిపాదన ప్రకారం అమెరికాకి చెందిన కార్లే కాకుండా మిగతా దేశాలకి చెందిన కార్లు కూడా పాల్గొనేటట్లు ఏర్పాట్లు జరిగాయి.


ఆటో షో వలన వినియోగదారుడికి మార్కెట్లో దొరుకుతున్న, దొరకబోతున్న కార్ల గురించి మంచి అవగాహన వస్తుంది. ఆటో షోలో ఒక్కొక్క కార్ కంపెనీకి కొంత స్థలం కేటాయిస్తారు. స్థలంలో కంపెనీకి చెందిన చిన్న కారు, మీడియం సైజు కారు, పెద్ద కారు, విలాసవంతమయిన కారు ఇంకా పెద్ద ట్రక్కులు కూడా ప్రదర్శిస్తారు. ఇపుడు మార్కెట్లో ఉన్నవే కాకుండా ముందు, ముందు మార్కెట్లోకి వచ్చే కార్లు కుడా షోలో ఉండడం విశేషం!



డెబ్బైవేలచదరపు అడుగులు ఉన్న కోబో హాలులో ఆటోషో కన్నుల పండుగగా జరుగుతుంది. మిరుమిట్లు గొలిపే కాంతిలో మిలమిలా మెరిసే కార్లు మనల్ని మైమరిపిస్తూ ఉంటాయి. కార్ల పక్కన నిలబడి వయ్యారాలు పోతూ ఉన్న మోడల్స్ కార్ల విశిష్టత గురించి మనకి వివరిస్తూ ఉంటారు. కారు కంపెనీలు కారుకి ఉన్న సేఫ్టీ ఫీచర్స్, విలాసవంతమయిన సౌకర్యాల గురించి వీడియోలు ప్రదర్శిస్తూ ఉంటారు. కారు ఇంజిన్, మిగతా మెకానికల్ విడి భాగాలు కూడా ప్రదర్శనలో భాగమే. ప్రతి కారులో మనం ఎక్కి, దిగడానికి వీలు ఉంటుంది. అంతే కాకుండా కారులోని సదుపాయాలు పరిశీలించడం కూడా షోలో ఒక భాగం. ఫెరారి,లంబోర్గినీ లాంటి పెద్ద కార్లని మాత్రం దూరం నుండి చూసి ఆనందపడాల్సిందే. ప్రఖ్యాతి గాంచిన ఫోర్డ్ మస్టాంగ్, క్రైస్లర్ కి చెందిన జీప్, జనరల్ మోటార్స్ చెందిన కామెరూ లాంటి స్పోర్ట్స్ కార్ల చుట్టూ అందరూ గుమిగూడడం ఇక్కడ మామూలే. తమకి నచ్చిన కారులో కూర్చుని కానీ, కారు బయట నిలబడి కానీ ఫోటోకి దిగడంలో అందరూ బిజీగా ఉంటారు షోలో.


తమ కంపెనీకి చెందిన కార్ల గురించి వినియోగదారుడికి వివరించడానికి ఆటో షో ఒక మంచి అవకాశం. మార్కెట్లోకి రాబోతున్న కొత్త కారుని షోలో ప్రదర్శిస్తూ వినియోగదారుడి మనసు దోచుకునే ప్రయత్నాలు షోలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇక మునుపు వీటిని మార్కెట్లోకి పెట్టచ్చేమో అన్న కాన్సెప్ట్ కార్లు అందరినీ ఆకర్షిస్తాయి. మనిషి ఊహకి కూడా అందని విధంగా ఉన్నటువంటి కార్లని చూసి మనం ముక్కు మీద వేలు వేసుకోవడం మాత్రం ఖాయం!


సంవత్సరం విడులవుతున్న ఫోర్డ్ ఫియస్టా ఈసారి పెద్ద అట్రాక్షన్ అయింది. అలాగే అద్భుతమయిన ఫ్యుయల్ ఎకానమీతో బరిలో ఉన్న 2010 కార్ ఆఫ్ ఇయర్ ఫోర్డ్ ఫ్యూషన్ కూడా షోలో అందరినీ ఆకర్షించింది. గత సంవత్సరం నుండి ప్రభుత్వం ఆధీనంలో ఉన్న జనరల్ మోటార్స్ ఈసారి ఆటో షోలొ ఒక మోస్తరు కార్లు, ట్రక్కులు తప్ప పెద్దగా కనపడలేదు. క్రైస్లర్ తో కొత్తగా చేతులు కలిపిన ఫియట్ కంపెనీకి చెందిన ఫియట్ 500 కూడా అందరినీ ఆకర్షించింది. చిన్న ఫియట్ కార్లు ఇంకా మార్కెట్టు లోకి రాలేదు, అవి ఎలా క్రైస్లర్ కంపెనీని ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడేస్తాయో చూడాలి. ఇపుడు మార్కెట్లో నంబర్ 1 గా నిలిచిన టయోటా కూడా కొత్త కార్లని బాగనే ప్రదర్శించింది. టయోటా లగ్సరీ బ్రాండ్ అయిన లెక్సస్ కూడా కొత్త కార్లతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలాగే హొండా, ఆక్యురా కంపెనీకి చెందిన కార్లు నలుగురినీ బాగా ఆకర్షించాయి. గత సంవత్సరంలాగే ఈసారి కూడా నిసాన్, ఇంఫినిటీ కార్లు షో లో పాల్గొనలేదు. ఎప్పటిలాగే బి.ఎం.డబ్ల్యు, మెర్సిడెజ్, ఔడి కార్లు అందరినీ ఆకట్టుకున్నాయి. మెర్సిడెజ్ కి చెందిన కొత్త కారు సేఫ్టీ, ఇంజినీరింగ్ విషయాలపై చూపిన వీడియో ఆసక్తికరంగా సాగింది. మధ్యనే జాగ్వార్, లాండ్ రోవర్ కంపెనీని కొన్న టాటా మోటార్స్ కొత్త నానో కోసం వెతికితే ఎక్కడా కనబడలేదు. జాగ్వార్, లాండ్ రోవర్ కొత్త కార్లు మాత్రం దర్శనమిచ్చాయి. కాలిఫోర్నియానికి చెందిన టెస్లా ఎలెక్ట్రిక్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుందరమయిన డిజైనుతో ఆకర్షణీయమయిన మైలేజితో టెస్లా కారు అందరినీ తన వైపు తిప్పుకుంది. నాలుగు గంటలు అవిశ్రాంతంగా తిరిగి మాకు బాగా నచ్చిన కార్లని గుర్తు తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టాము.




మీ కోసం ఇక్కడ కొన్ని వీడియోలు ఉంచాను, చూడండి.












































4 comments:

Unknown said...

ముందుగా మిమ్మల్ని అభినందించాలి. విషయాలు ఎలా రాయలొ మీ ధగ్గర నేర్చుకుని తీరాలి.మీ బ్లాగు చూస్తె మీరే మా ముందర వున్నారేమొ అని పినిపిస్తుంది. కదనంలొ మీకు మీరే.మీ రాతలు లాగే మీ కదిలె బొమ్మలూ బాగున్నాఈ. మీకు ఎన్ని వీర తాల్లు వేయాలి?

రాంపిల్ల

శ్రీ said...

థాంక్స్ రాం ప్రసాద్ గారు.

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు, శ్రీ. చక్కగా అన్ని చోట్లా విడియో కూడా తీశారే!
నేను గురువారం సాయంత్రం వెళ్ళాను. నేను చేరే సమయానికి హాల్లో ఏదో అగ్నిప్రమాద సూచన కనబడి, ప్రదర్శన తాత్కాలికంగా మూసేశారు. గంటన్నర వృధా కాగా ఏదో రెండు గంటల్లో హడావుడీగా చూసి బయటాపడ్డాము. రెండు జీయెం వాహనాల మీద మా కంపెనీ చక్రాల మెరుపులు చూశారా? నేనుకూడా నా అనుభవం గురించి రాశాను గానీ, మీర్రాసింది చదివాక నాది పోస్టబుద్ధి కావట్లేదు :)

శ్రీ said...

థాంక్స్ కొత్తపాళీ గారు.

అక్కడ చూసిందే కాకుండా కొంచెం చరిత్ర కూడా రాద్దామని ప్రయత్నించి రాసా.

మీ పోస్టు చూసాను, మీ శైలిలో బాగా రాసారు.