Friday, March 12, 2010

కోతికొమ్మచ్చి


కొన్ని రోజుల ముందు యాహూలో ఉత్తరాలు చూసుకుంటూ ఉంటే ఒక "కోతికొమ్మచ్చి" అన్న సబ్జెక్టు కనిపించింది. తెరిచి చూస్తే ముళ్ళపూడి రమణ గారి ఆత్మ కథని ఆడియో పుస్తకం లాగా విడుదల చేసారట. "భలే ఉంది, మీరూ కొనుక్కోండి" అని రాసారు. లింకు నొక్కి కోతికొమ్మచ్చి సైటుకి వెళ్ళి కొని సాంపిల్స్ విన్నాను. మన బాలు గారి స్వరంలో ముళ్ళపూడి రమణ గారి ఆత్మ కథ చక్కగా ఉంది. ఇక పూర్తి కథ కొనేద్దామని ప్లాస్టిక్ కార్డుని రెపరెప లాడించాను. ఆడియో డౌన్లోడ్ చేసుకుని సీడీలొకి కాల్చి వినడం మొదలు పెట్టా.



కథ బాలు గొంతులో వింటూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంది. రమణ గారి కథల్లో లాగా అతని నిజ జీవితంలో ఎక్కడా హాస్యం కనపడలేదు. అతని కథల్లో బుడుగుని చూస్తే ఇక ఈయన నిజ జీవితంలో ఎంత అల్లరో అనుకున్న నాకు చాలా ఆశ్చర్యం కలిగించేలా ఆత్మ కథ సాగింది. ధవళేశ్వరం నుండి చెన్నపట్నం వరకు రమణ గారు,అతనితో పాటు అమ్మ,అమ్మమ్మల జీవన పోరాటం స్పూర్తిదాయకంలా ఉంది.



ఆకలి రుచి కథలో దబ్బ కాయ, వేడి అన్నం అంటూ ఉంటే నోరు ఊరక మానదు. ఆ రోజుల్లో అంటే పాపం తడలో రమణ గారికి భోజనం దొరకలేదు కానీ ఇపుడు రోడ్డు పక్కన చాలా హోటళ్ళు ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే కల్కి ఆశ్రమం కూడా కనపడుతుంది.



ఈ కథలో నాకు నచ్చిన చిన్న విషయం ఏమిటంటే ప్రతి కథలో కానీ, వ్యాసంలో కానీ "ఫలాన మాట ఎవరో చెప్పారు" అని చేతులు కడిగేసుకుంటారు. ఇక్కడ అలా కాకుండా ప్రతి మాటని "ఈ గురువు గారు ఇలా అన్నారు, ఆ గురువు గారు అలా అన్నారు" అని చెప్తూ వచ్చారు.



మొదటి భాగంతో రమణ గారి అమ్మ విషయాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం కోతికొమ్మచ్చి మొదటి భాగం మాత్రమే అందుబాటులో ఉంది. రెండవ భాగం ఆడియో మీద పని జరుగుతూ ఉన్నదని రమణ గారి కుమార్తె (అనుకుంటా) అనూ చెప్పారు. "అది పూర్తి అవగానే నాకు కబురు చెయ్యండి " అని చెప్పగానే "ఓ..అలాగే" అని అన్నారు. ఆత్మ కథని ఆడియో సీడీగా మార్చి అనూ గారు చాలా మంచి పని చేసారు. ఇపుడు యూత్ కి తెలుగు చదవడం రాదు కాబట్టి కనీసం వినిపించడం ద్వారా వాళ్ళ జీవితాలని తాకిన వాళ్ళవుతాం.




1 comment:

Prasad Samantapudi said...

కోతికొమ్మచ్చి అంటూ ఇలా సింపిల్ గా బ్లాగితే కుదరదు. అర్జంటుగా కలుసుకుని తెగ మాట్లాడేసుకోవాలి. :-)