Monday, June 28, 2010

పోయిన వారం ఏమయిందంటే...


క్రితం మంగళవారం నేను మరచిపోలేని రోజు. మా అఫీసులో మధుమేహ వ్యాధి మీద పరిశోధన కోసం బైకర్స్ అందరం డబ్బు పోగేసాం. గడచిన అయిదు సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ తంతులో ఈసారి నేను కూడా భాగం పంచుకున్నా. ఇంచుమించు 42 బైకర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదంగా జరిగింది. మా అఫీసు హెడ్ క్వార్టర్స్ దగ్గర అందరం కలిసి, కాసేపు అందరితో ముచ్చటించి ప్రయాణానికి తయారయ్యాం. ఎనిమిది మంది ఒక సమూహంగా చేరి ఒకరి తర్వాత ఒకరుగా అందరం బయలుదేరాం. బాగా దారి తెలిసిన చోదకుడు నాయకత్వం వహించగా కొత్తగా నడిపే వాళ్ళు మధ్యలో ఉండేట్టుగా చూసుకున్నాం. మొత్తం ప్రయాణం ఒక నలభై మైళ్ళు ఉంటుంది, దారి పొడుగునా పచ్చని చెట్లు, అక్కడక్కడా సెలయేళ్ళతో ప్రయాణం అద్భుతంగా సాగింది.


నేను ఒక రెండు నెలల నుండి ఇదే మార్గంలో నడుపుతూ ఉండేవాడిని కాబట్టి మనకి దారంతా కొట్టిన పిండయింది. ప్రతి సంవత్సరం దారిలో ఎవరో ఒకరు తప్పి పోవడం జరుగుతూ ఉండడం అనవాయితీ అట. కానీ ఈసారి అలా కాకుండా అందరూ గమ్యం చేరుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేసాం. సుమారు ఒక ఇరవై మైళ్ళు ప్రయాణించాక దారికి అడ్డంగా పోలీసు వచ్చి అందరినీ ఆపాడు. ఏమయిందో తెలియదు, అందరం బైకులు ఆపి ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటుంటే పోలీసు వచ్చి "కొంచెం ముందు ఒక ఆక్సిడెంట్ అయింది, ఒక అయిదు నిముషాలు ఇక్కడ వేచి ఉండండి" అని మాకు సమాచారం అందించాడు. అయిదు నిముషాల తర్వాత అందరూ కదిలి ఒక గంటసేపు ప్రయాణించి జూకీ సరస్సు చేరుకున్నాం.


జూకి సరస్సు ఒడ్డునే ఉన్న బారులో కబుర్ల మధ్య భోజన కార్యక్రమాలు ముగించాం. ఒక గంట సేపు కబుర్లతో కడుపు నింపి ఇంటి ముఖం పట్టాను. మా ఇంటి వైపుగా వెళ్తున్న రెండు జంటలతో మళ్ళీ ఒక అరగంట ప్రయాణం సాగించి ఇంటికి చేరుకున్నాను. మొత్తానికి అందరం కలిసి బాగనే డబ్బు పోగేసాం.


మా ప్రయాణం వీడియోలు ఇక్కడ చూడండి.