Saturday, July 10, 2010

తెలుగు సినిమా స్వర్ణ యుగం





జూన్ నెలలో పుస్తకం చదవడం జరిగింది. మనకి నచ్చిన సినిమాలు కొన్ని దీనిలో ఉండడం, ఇంకా తెర వెనుక సంగతుల గురించి రాయడంతో పుస్తకం కొన్ని కొత్త విషయాలను పరిచయం చేసింది. 1950, 60 మధ్యలో విడుదలయినటువంటి మల్లీశ్వరి, జయభేరి, దొంగ రాముడు, పాతాళ భైరవి, దేవదాసు, బంగారు పాప, మాయాబజార్ ఇంకా విప్రనారాయణ సినిమా గరించి పుస్తకంలో రాసారు రచయిత రమణారెడ్డి గారు. స్వర్ణయుగమని ఆ పది సంవత్సరాలలో విడుదలయిన సినిమాలే ఎందుకు తీసుకున్నారో? ఇంకా మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమా కూడా ఈ పుస్తకంలో పెడదామనుకున్నా కానీ పుస్తకం లావయిపోయి ఎవరూ చదవరేమోనని రచయిత గారు ముందు మాటలో చెప్పారు.





ఈ పుస్తకం చదువుతున్న సందర్భంగా మల్లీశ్వరి సినిమా చూడాలని పుస్తక క్లబ్బు వారు తీర్మానించారు. సరే, మనకి మూవీ క్లబ్బు ఎలాగూ ఉంది కదా అని ఒక గురువారం కష్టపడి మల్లీశ్వరి సినిమా చూసాం. భానుమతి అంటే మా అమ్మకి బాగా ఇష్టం! చిన్నప్పటి నుండీ ఈ సినిమాలో పాటలు విన్నాను కానీ సినిమా ఎపుడూ చూడలేదు. బీ.ఎన్.రెడ్డి గారు అద్భుతంగా తీసారు ఈ సినిమాని. ఈ సినిమా పుట్టు పూర్వోత్తరాల గురించి పుస్తకంలో ముందే చదివి ఉండడం వలన ఇంకొంచెం ఎక్కువ అనుభూతిని పొందాను. భోరున వర్షం కురిసినప్పుడు రాయలు వారు, అల్లసాని పెద్దన ఒక సత్రంలో బస చేస్తారు. ఉదయాన్నే గుర్రమెక్కి వెళ్తుంటే దుమ్ము లెయ్యడం ఎంత మాత్రం సమంజసం? అని ప్రశ్నించారు మా పుస్తక క్లబ్బు మెంబరు. ఈ ప్రశ్నని ఇంతకు ముందు మన రాస్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా లేవనెత్తారష! పద్మసాలీలకి మగ్గాలుంటాయి కానీ ఎద్దుల బండి ఎక్కడ నుండి వస్తాయని ఇంకొకరు అనుమానం వ్యక్తపరిచారు. పద్మసాలీలు మగ్గాలు నెయ్యడమే కాదు, బట్టలు అమ్మడం కూడా చేస్తారు కదా!






సత్రంలో అన్నగారు ఒక సందర్భంలో చెప్తారు "మా మామ దగ్గర 100 మగ్గాలు ఉన్నాయి" అని.




"100 మగ్గాలు ఉన్న ఆసామి కొన్ని ఎకరాలు పొలం కొని వ్యవసాయం చేసి ఉండచ్చు కదా!" అని నేను సర్ది చెప్పాను.




ఇక దేవదాసు సినిమాకి వస్తే సినిమాని రచయిత పెద్దగా ఇష్టపడలేదు అని తెలుస్తుంది. నాకయితే దేవదాసు సినిమా బాగా ఇష్టం, రచయితతో చాలా దగ్గర ఏకీభవించలేకపోయాను. పాతాళ భైరవి, మాయాబజార్ సినిమాల గురించి మంచి విషయాలు పరిచయం చేసారు. మాయాబజార్ ఇంకా చాలా సినిమాలకి పని చేసిన చాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే గురించి మంచి వివరాలు అందించారు ఈ పుస్తకంలో. బీ.ఎన్ రెడ్డి అన్ని సినిమాల్లో పాత్రలను ఎలా పరిచయం చేస్తాడూ? అన్న విషయాన్ని బాగా ఉత్సాహంగా వివరించారు. రచయిత కూడా కడప జిల్లానే కాబట్టి బీ.ఎన్.రెడ్డి గురించి చాలానే విషయాలు చర్చించారు.


బంగారు పాప సినిమా గురించి మనం ఎపుడూ పెద్దగా వినలేదు, ఈ సినిమా విశేషాలు చదివాక సినిమా చూడాలనిపిస్తుంది. మా ఇంట్లో జయభేరి సినిమా కూడా ఉంది కానీ, ఇప్పటికి నాలుగు సార్లు చూద్దామని ప్రయత్నించి మధ్యలోనే గుర్రు పెట్టాను. జయబేరిలో ఒక రాగం గురించి "సంగీతంలో ప్రవేశం పెద్దగా లేకుండానే విమర్శించేస్తున్నాను" అని అన్నారు. తరువాత ఎవరో సమీక్షకుడు సరి చేసారని చెప్పారు. పుస్తకం అచ్చు వేసే ముందే ఇటువంటి చిన్న విషయాలు ఎవరితోనయినా చర్చించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.


2 comments:

Raja Yenugu said...

"The Way Home" really it's very nice and heart touching movie. Lot of scenes talks about human life. grand mother character is amazing. very thanks to introduced this movie to your fans

శ్రీ said...

Iam glad you liked it.