Saturday, July 31, 2010

టొరంటో తెలుగు వాహిని కబుర్లు

టొరంటో లోని తెలుగువాహినితో మా పరిచయం గత రెండు సంవత్సరాలు డెట్రాయిట్ లిటరరీ క్లబ్ నిర్వహించిన రెండు కార్యక్రమాల ద్వారా కలిగింది. ఒకసారి మా పుస్తక సమావేశాలకి మీరందరూ తప్పక రావాలని పిలవగా గత శనివారం వీలు చూసుకుని మా ఊరు నుండి బయలుదేరాం. ఉదయం 10 గంటలకి అందరూ ఒక చోట కలిసి కాసేపు కబుర్లారగించి 3 కార్లలో బయలుదేరాం. కెనడా ఇమ్మిగ్రేషన్ లో నన్ను మాత్రమే ప్రశ్నించి వదిలేసారు, ఏమిటో అందరికీ నాతో కబుర్లు చెప్పాలని తహ తహ! ఉదయం నుండి కురుస్తున్న చిరు జల్లు కాకుండా అపుడపుడూ కుండపోత వర్షం మధ్యలో కారు నడుపుకుంటూ మధ్యాహ్నం సమావేశానికి చేరుకున్నాం.


సమోసాలు, మిరపకాయ బజ్జీలు, టీతో కార్యక్రమం మొదలయింది. మా ఊర్లో అందరం లైబ్రరీ కి చెందిన ఒక మీటింగ్ రూములో కలుస్తూ ఉంటాం, ఇక్కడేమో అందరూ ఒక్కో సమావేశం ఒక్కొకరి ఇంట్లో జరుపుతున్నారష! అందరి పరిచయాల తర్వాత శ్రీకృష్ణ దేవరాయులు రచించిన ఆముక్త మాల్యదలో కొన్ని పద్యాలని శ్రీ రాం వక్కలంక గారు చదివి వినిపించారు. మా క్లబ్బులో నేను ఈ పుస్తకం చదివేటపుడు పద్యాలు అర్ధం కాక తాత్పర్యాలు చూసుకుంటూ బాగా ఇబ్బంది పడ్డాను. రాం వక్కలంక గారు పుస్తక సారాంశం వినిపించి మమ్మలందరినీ ఆనందింపజేసారు.


కొద్ది విరామం తర్వాత శ్రీపాద శాస్త్రి గారు రాసిన అరికాళ్ళ కింద మంటలు పుస్తకం మీద వేడిగా చర్చ జరిగింది. ఈ కథ చదవడానికి చాలా కష్ట పడ్డాను, కథ అంతా మాటలే! ఎవరు ఏది మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు, ఒక రెండు,
మూడు సార్లు వెనక్కి, ముందుకీ చదవాల్సి వచ్చింది. కథ రచయిత ద్వారా కాకుండా ఇలా సంభాషణల ద్వారా చెప్పించడం ఒక ప్రత్యేకత! చిన్న వయసులోనే విధవగా మారిన తోబుట్టువుతో ఇంటి పనులు చేపించుకుంటూ ఆమె మనస్సుకి కష్టం కలిగించేలా ప్రవర్తిస్తూ ఆమె అరికాళ్ళ కింద మంటల్లా తయారవుతారనమాట అందరూ. ఈ మంటల నుండి తప్పించుకోవాలని ఇంట్లోంచి పారిపోవడం, ఒక రిక్షావాడు ఆమెని వీరేశలింగం తోటకి తీసుకుపోవడంతో కథ ముగుస్తుంది. చివరలో జట్కా వాడు "నా కూతురు కూడా విధవే! మళ్ళీ పెళ్ళి చెయ్యాలని తోటకి తీసుకువెడుతుంటే కొంతమంది అడ్డుకున్నారు" అని. ఆ రోజుల్లో వితంతు వివాహాల సమస్య వైదిక బ్రాహ్మణులకే కానీ మిగతా వాళ్ళకి కాదుట!


చల్లని పానీయంతో వేడి చర్చలు ఆర్పాలని తెలుగు వాహిని చేసిన ప్రయత్నం ఫలించింది. శ్రీ ఆరుద్ర గారు రాసిన సమగ్ర ఆంధ్ర సాహితీ చరిత్రని శ్రీ రామ్మూర్తి  గారు పరిచయం చెయ్యడంతో ఇంకొక అంశం మొదలయింది. తెలుగు లిపికి చెందిన పరిశోధనలు, శిలా ఫలకాల గురించి చాలా ఆశ్చర్యకరమయిన విషయాలను వివరించారు. సమయాభావం వల్ల పుస్తక పరిచయంతో తెలుగువాహిని కార్యక్రమం ముగిసింది. చెవులూరించే వంటకాలతో భోజన కార్యక్రమాలు, కబుర్లు ముగిసాయి. గడచిన మాసం కొత్తపాళీగారి ప్రోత్సాహంతో కొంతమంది సభ్యులు బ్లాగులు వ్రాయడం మొదలుపెట్టారు, మీరు కూడా ఒక సారి చూసి వారిని ప్రోత్సహించండి. భుక్తాయాసంతో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చర్చలని మళ్ళీ కారులో కొనసాగిస్తూ ఇంటి ముఖం పట్టాం.


8 comments:

శరత్ కాలమ్ said...

ఏం టొరొంటో బ్లాగర్లో ఏమిటో. ఎప్పుడు అటువైపు వెళ్ళినా ఎవరయినా బ్లాగులోకవాసులు వున్నారా, మీకు వీలయితే కలుస్తాను అని బ్లాగ్ముఖంగా ప్రకటించినా ఎవరూ స్పందించరు. ఇప్పుడు ఆ బ్లాగుని అంతమంది బ్లాగర్లు నిర్వహిస్తున్నారని తెలిసి విస్మయం కలిగింది.

శ్రీ said...

మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి

కొత్త పాళీ said...

శ్రీ, టొరాంటోవారి సామూహిక బ్లాగుని పరిచయం చేసినందుకు నెనర్లు. ఈ సమావేశానికి కూడా వద్దాము అనుకున్నాను గాని ఆ సమయానికే వేరే ముఖ్యమైన పని ఉండి రాలేకపోయాను
బైదవే .. చవులూరించే .. చెవులు కాదు :)

శ్రీ said...

మీరు కూడా ఉంటే సరదాగా ఉండేది.

పొరపాటుకి క్షమించండి.

చవులూరించే అంటే అర్ధం ఏమిటి ?

శ్రీ said...

సాహితీ మిత్రులతో చర్చించాక "చవులూరించే" కి అర్ధం తెలిసింది.

కొత్త పాళీ said...

అర్ధం తెలిసింది గదా! గుడ్!
మీ బ్లాగులో పాత టపాల జాబితా కనబడేట్టు (నెలలవారీగా) ఒక విడ్జెటు తగిలించండి. గత ఏడాది టపాకోసం వెదకబోయి భంగపడ్డాను!

శ్రీ said...

మీరు కోరిన విధంగా పాత (ఉస్కు) టపాలు కనపేడేటట్లు చేసాను.

సత్యం పోతంశెట్టి said...

శ్రీ గారూ,
మీరు చెప్పినట్లుగానే మన టొరాంటో తెలుగువాహిని సమావేశం గురించి బ్లాగినందుకు చాలా సంతోషం! Traffic resources లో మీ టపా నుండి కొంత traffic రావడంతో ఆ లింకు పట్టుకొని ఇక్కడికి రాగలిగాను. కృతఙ్ఞతలు.
అన్నట్లు, చవులూరించే అనే పదం బదులుగా నోరూరించే అనే పదం వాడితే నాలాంటి సామాన్యులకు కూడా వీజీగా ఉంటుందేమో...

@శరత్ గారూ,
మా బ్లాగింగ్ ప్రయత్నాలన్నీ గత రెండు మూడు వారాల క్రితమే మొదలయ్యాయండీ. మా తెలుగువాహిని సభ్యులను బ్లాగ్ రీడర్స్ కమ్ బ్లాగర్స్ గా మార్చడానికీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను! వారినుండి మీరు ఆశించే స్థాయిలో స్పందన లభించడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చు. (బహుశా, తెలుగువాహిని బ్లాగే కెనడా తొలి తెలుగు బ్లాగు అయినా ఆశ్చర్య పోనవసరం లేదేమో!).

@కొత్త పాళీ గారూ,
మీ ప్రోత్సాహానికి ఎప్పటిలానే కృతఙ్ఞతలు.