Thursday, December 30, 2010

కాలాస్త్రిలో కబుర్లు - 1

కాలాస్త్రికి వచ్చి ఇంచుమించు రెండు నెలలు కావస్తుంది. బంధు మిత్రులు, స్నేహితుల పలకరింపులతో పులకరింతలు బాగనే సాగుతుంది. ఈసారి పర్యటనలో నాకు 6వ తరగతి నుండి లెక్కలు చెప్పిన మా అయ్యవారిని కలిసాను.గురువు గారు నన్ను చూసి చాలా సంతోషించారు. నెల్లూరులో మా దోస్తుగాడు పెట్టిన కుటీర పరిశ్రమ చాలా బాగుంది. పదిమందికి ఇంత తిండి పెట్టగలిగినందుకు చిన్ననాటి స్నేహితుడిగా గర్వపడ్డాను.


ప్రతిసారి లాగే కైలాసం నుండి వైకుంఠ దర్శనం నానా తిప్పలు పడి రెండు సార్లు పూర్తి చేసాను.జనాలు లేకపొయినా లాగేయడం టీటీడీ ఉద్యోగుల అలవాటు.వాళ్ళు లాగకపోయినా జనాలు తోసుకుపోవడం కూడా అందోళన కలిగించింది.


ఈ తోసే జనాలు శ్రీశ్రీకి విపరీత అభిమానులేమో...'పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం తొక్కేసి...' అంటూ సందడిగా తొక్కారు.


ఈసారి అనుకోకుండా శబరిమళ ప్రయాణం కూడా కుదిరింది. ఎరుమేళిలో దిగి అర్ధరాత్రి మాల ధరించి కన్నెసామిగా నాట్యం చేసాను. మొదటిసారి మాల వేసుకునే వాళ్ళని కన్నెస్వామి అంటారని నాకు మొన్ననే తెలిసింది. అర్ధరాత్రి ఎరుమేళిలో,పంబలో మునుగుతూ ఉంటే అద్భుతమయిన అనుభూతి కలిగింది.చెప్పులు లేకుండా కొండ ఎక్కుతుంటే అయ్యప్ప దిగి వచ్చాడు.


అయ్యప్ప దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటపుడు మధురైలో ఆగి మధుర మీనాక్షి దర్శనం చేసుకున్నాం.అద్భుతమయిన గుడి మధుర మీనాక్షి గుడి. గుడి లోపలి భాగం కొంత కాళహస్తి గుడిలాగా అనిపించింది. ఆ మధ్య కాలాస్త్రిలో పడిపోయిన గోపురం గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలిసాయి. ఆ  గోపురం కింద పునాది ఉట్టి మట్టే అట! బలవంతమయిన ఏనుగుల చేత ఇసుకని తొక్కించి దానిమీద గోపురం కట్టేసారు. చుట్టుపక్క కట్టడాల నుండి వచ్చే మురుగు నీరు ఈ ఇసుకని కదిలించడం, గోపురానికి మరమ్మత్తు చేసేటపుడు సరయిన జాగ్రత్తలు తీసుకోకపోవడం మా గోపురం కూలడానికి కారణ భూతాలయ్యాయి.


ఈసారి తెలంగాణలో రెండు పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ఇక్కడ ఆచార వ్యవహారాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెళ్ళి రోజు ముందు దావత్ మంచి సరదాగా ఉన్నాయి.


మాటల్లోనే 2010 కూడా సెలవు తీసుకోడానికి సిద్ధమయింది. ఈ సంవత్సరంలో నేను తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలకు 2011 శుభప్రదం అవుతుందని ఆశిస్తూ మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.


వచ్చేవారం పాపికొండలు ప్రయాణం చేద్దామనుకుంటున్నాను, ఆ విశేషాలతో మళ్ళీ కలుస్తాను.

3 comments:

kannaji e said...

మీకు నవ ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు

http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/

శ్రీ said...

థాంక్స్ కన్నాజీ!

GKK said...

'చెప్పులు లేకుండా కొండ ఎక్కుతుంటే అయ్యప్ప దిగి వచ్చాడు.'

sidhuisms లాగా ఇలాంటి వాక్యాలు భలే సృష్టిస్తారు మీరు. you have a natural sense of humour. i like it.