Tuesday, May 3, 2011

బెంచి కబుర్లు - 1





ఆరు నెలలు అమ్మ చేతి వంట, అత్తగారి ఆదరణ, పెళ్ళాం పరాచికాలు, అక్క, చెళ్ళెళ్ళ ఆప్యాయత, కూతురు ముదిగారం అనుభవించి ఇపుడు అమెరికాలో బెంచి మీద కూర్చుని సూళ్ళూరుపేట, నెల్లూరు, కాలాస్త్రి, చెన్నై, హన్మ కొండ, ఫిలిం నగరు విశేషాలు  ఎం.టీ.ఆర్ సాంబారు మిక్సులు కలుపుకుంటూ నెమరు వేసుకుంటున్నా.  నెల్లూరు ఆదర్శ్ లాడ్జిలో కూర్చుని కోమల విలాస్ లో తిన్న దోశలు యాద్ కొస్తున్నాయి ! నమస్తే గ్రాసరీస్ కి వెళ్ళి దోశ బాటర్ తెచ్చుకుని పెనం వేడి చేసుకుని పోసుకోవాలి.  




జెట్ లాగ్ ఈరోజుతో ఎగిరిపోయింది! అతలాకుతలమయిన ఆర్ధిక, ఉద్యోగ సంబంధాలను పునాదులని ఒకసారి కదిపి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.   కొత్త ఉద్యోగాలు చూస్తే బాగనే ఉన్నాయి. పుంజుకుంటున్న వ్యాపారాలు రా, రమ్మని పిలుస్తున్నాయి. ముందుగా ఒక ఉద్యోగంలో చేరి వీలు చూసుకుని లాభసాటిగా ఉన్న చిన్న వ్యాపారాల గురించి అలోచించాలి. అప్పటివరకు బెంచి మీద కూర్చుని రోజంతా ఎలా గడపాలో అలోచించాలి. 




ఉదయం స్నానం చెయ్యగానే అంతకు ముందు కొనుక్కున్న పుస్తకం ఒకటి దొరికింది. ఇందులో ఒక పది, పదిహేను కథలు ఉన్నట్టున్నాయి. భారతదేశంలో కూడా ఈ ఆరు నెలల్లో సంవత్సరం రోజులు చదవాల్సిన కథలు చదివేసా. ఈ బెంచిలో ఉన్నపుడే బాకీ ఉన్న పుస్తకాలని పిప్పి చేసి నా రుణం తీర్చుకుంటా. అలాగే మిస్ అయిన పాత, కొత్త సినిమాల మీద కూడా ఒక కన్నేసి రోజుకొకటి అన్న ప్రాతిపదిక మీద  సింగిల్ విండో పధకాన్ని అమలు చెయ్యాలి. కొత్తగా తీసినటువంటి ఏ భాషా చిత్రమయినా ఆదరించాలి! అంటే అటువంటి సినిమాలు ఏమున్నాయో నాకు చూపించమని గూగులమ్మని ముని వేళ్ళతో ప్రార్ధించాలి.  




ఆరు నెలల తర్వాత నిన్న రెండు చక్రాల బండిని కదిలిస్తే మొండికేసింది. దాని గొడవేమిటో? పాత పెట్రోలు బయటకి లాగాలో, లేకపొతే బండిని తోసి అదిలించాలో ముందు, ముందు చూడాలి. ఇంకా పూర్తి ఎండాకాలం రాకుండా ఆకాశం ముసుగుతన్ని పడుకుంది. ఈ ఎండాకాలానికి మహాబలిపురంలో కొనుక్కున్న సౌత్ ఆఫ్రికా బండానాతో నేను ముందుగానే తయారయి వచ్చా.
ఎండలు మండకముందే నా గుర్రాలని కదిలించాలి.  



5 comments:

శరత్ కాలమ్ said...

:)

Prasad Samantapudi said...

welcome back!

శ్రీ said...

Thanks to both!

cbrao said...

మా ఇంటికి (ముందుగా చెప్పి) రండి.
సి.బి.రావు, హైదరాబాదు.

శ్రీ said...

@ సీ.బీ.రావు గారికి, ఈసారి వీలవలేదండీ. డెట్రాయిట్ కి వచ్చేసాను.

@ కొత్తపాళీ, థాంక్స్.