Friday, June 10, 2011

సబాహ్ - ఒక ప్రేమ కథ




నెట్ ఫ్లిక్సులో సినిమాలకోసం తిరుగుతూ ఉంటే ఈ సినిమా కనిపించింది. ఇది ఒక సిరియా ముస్లిం యువతి ప్రేమ కథ! సినిమా గురించి నెట్ ఫ్లిక్సులో ఇచ్చిన వివరాలు చూసి ఆసక్తి కొద్దీ సినిమా చూసాను.




కథలోకొస్తే సిరియా నుండి వచ్చి టొరంటోలో స్థిరపడిన ఒక ముస్లిం కుటుంబంకి చెందిన సబాహ్ ఈ సినిమా కథానాయకురాలు. సబాహ్ తండ్రి నుండి సంక్రమించిన వ్యాపారాన్ని అన్న మాజిడ్ చూసుకుంటూ ఉంటాడు. నలభై ఏళ్ళ సబాహ్ ఇంట్లో తల్లికి తోడుగా ఉంటుంది. అనుకోకుండా సబాహ్ కి ఈత కొలనులో కెనెడియన్ స్టీఫెన్ తో పరిచయం కలుగుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమకి దారి తీస్తుంది. స్టీఫెన్ తో ప్రేమాయణం ముందుకు జరగడానికి సబాహ్ ముస్లిం సంప్రదాయం అడ్డొస్తుంది, ఎందుకంటే స్టీఫెన్ ముస్లిం కాదు కాబట్టి.


నలభై ఏళ్ళొచ్చినా అన్న నీడలో బతకాల్సి రావడం సబాహ్ కి నచ్చదు. తన సంప్రదాయం తగట్టు బట్టలు కట్టుకోవడం, తన అభిప్రాయాలకు అంత అవకాశం లేకపోవడం సబాహ్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈత క్లబ్బులో నలుగురిలో ఈత కొట్టాల్సి వచ్చినపుడు బెరుకు, బెరుకుగా టవలు చుట్టుకుని నీళ్ళల్లోకి దిగడం ఇవన్నీ ఆమె పరిథిని మనకి తెలుపుతూ ఉంటాయి. అదే కొలనులో ఈత కొట్టడానికి వచ్చిన కెనేడియన్ టవల్ విసురుగా పడేసి నీళ్ళలోకి దూకడం  మనకి చూపించి ఇద్దరి కల్చర్లో తేడాలు చూపిస్తాడు దర్శకుడు.


సబాహ్ తో చాటు మాటు ప్రేమాయణం సాగించలేక అసహనం ప్రదర్శిస్తాడు స్టీఫెన్.

"నీకు నచ్చినట్టు నువ్వు ఉండలేక పోతున్నావు. దానికోసం నువ్వు ఏం చేస్తున్నావు?" అని ప్రశ్నిస్తాడు.

ఇక అప్పటి నుండి సబాహ్ కి కుటుంబంకి మధ్యన జరిగే సంఘర్షణ మనల్ని కూడా అలోచింపజేసేదిగా బాగుంటుంది.


వేరే మతం వాడిని పెళ్ళి చేసుకోవడం కాన్సెప్ట్ వాళ్ళకే కాదు, మనకి కూడా కామన్ కాబట్టి కథ మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. పరువు, కుటుంబ గౌరవం అని సబాహ్ ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా సమస్యని సామరస్యంగా పరిష్కరించడంతో ఒక ఫీల్ గూడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. విశేషమేమిటంటే ఇరవై రోజుల్లో ఈ సినిమా తీసేసారట!


No comments: