Friday, June 17, 2011

అనుసూయ - చలం




ఈ అనుసూయ పుస్తకంలో రెండు పెద్ద కథలు. ఒకటి అనుసూయ, రెండోది చుక్కమ్మ. ముందు అనుసూయ గురించి మాట్లాడుకుని తరువాత చుక్కమ్మ దగ్గరకెళ్దాం.


అనుసూయ తోడు లేని ఆడది. భర్తని కోల్పోయి అత్తింట్లో,పుట్టింట్లో తల దాచుకుని ఉంటుంది. అటు అత్తిల్లు, ఇటు పుట్టిల్లు ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అత్తింటికి వస్తూ పోతున్న డాక్టరు ప్రకాశరావు అనుసూయకి మాయమాటలు చెప్పి వాడుకుంటూ ఉంటాడు.ఏ తోడూ లేక చివరికి దొరికిన ప్రకాశరావునే ప్రేమిస్తూ ఉంటుంది పిచ్చి అనుసూయ. అనుసూయ ఒక పిల్లవాడిని పెంచుకుంటూ ఉంటుంది. చివరికి వాడు కూడా ఈమెని తిడుతూ ఉంటాడు. మామగాడు కూడా అనుసూయపై కన్నేసి ఆమెని లోబరుచుకుందామని చూస్తూ ఉంటాడు.


మొగుడుని పోగొట్టుకున్న తోడు లేని ఆడది ఆ సమాజంలో ఎలా బాధలు పడుతుంది అన్న విషయాన్ని చలం బాగా చూపించాడు ఈ పుస్తకంలో. ఈ పుస్తకం చదివిన తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన "అరికాళ్ళ కింద మంటలు" గుర్తుకు వచ్చింది. ఇద్దరి కథల్లో ముగింపు వేరు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం కథ ఎలా ముగిసింది కాదు, అనుసూయ పడే కష్టాలని అర్ధం చేసుకుంటే రచయితగా చలం సఫలమయినట్టే అని నా బ్లాగాభిప్రాయం!


మామూలుగా మనందరికి తెలిసిన పేరు, వాడే పేరు అనసూయ. అనసూయ కాకుండా అనుసూయ అని ఎందుకు పెట్టాడో నాకు అర్ధం అవలేదు. నాకు వచ్చిన పుస్తకం మీద కూడా "అన" మీద "అను" అని స్టికర్ అంటించి పంపారు. అంతకు ముందే అనసూయ అన్న నవల ఉందేమో? లేకపోతే అనుసూయ అని కూడా ఇంతకు ముందు పిలిచేవాళ్ళా ?


ముందే చెప్పినట్టు ఇపుడు చుక్కమ్మ దగ్గరకొద్దాం. ఈ కథలో చుక్కమ్మకి మొగుడు సీనయ్య, పిల్లలు ఉంటారు. సీనయ్య ఎవరితోనో గొడవ పడి జైలుకి వెళ్తాడు. చుక్కమ్మ ఒక్కటే పొలం పనులు చేస్తూ పిల్లలకి తిండి పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా సాగుతున్న చుక్కమ్మ జీవితంలో ఒక రోజు సర్వభద్రం తారసపడుతాడు. చుక్కమ్మ పరిస్థితులు చూసి సర్వభద్రం జాలిపడి ఆమెకి తోడుగా కొన్ని రోజులు  ఉంటాడు. పొలం పనులలో చుక్కమ్మకి సహాయం చేస్తూ ఆమెకి దగ్గరవుతాడు.  ఏ ఆధారం లేని చుక్కమ్మ, సర్వభద్రం చూపిస్తున్న జాలికి కరిగి అతన్ని సంతోషపెడుతుంది. సీనయ్య జైలు నుండి ఇంటికి తిరిగివచ్చే సమయం దగ్గర పడడంతో చుక్కమ్మ కోరగా సర్వభద్రం ఆమెని విడిచి తన వూరు వెళ్ళిపోతాడు. సర్వభద్రానికి చుక్కమ్మ అంటే ఇష్టం పెరుగుతూ ఉంటుంది. మొగుడినీ, పిల్లలినీ వదిలేసి తన దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాడు.  


సీనయ్య జైలు నుండి తిరిగి వచ్చినా చుక్కమ్మ జీవితం బాగుపడదు. అప్పులతో ఇల్లు గుల్ల అయ్యి మళ్ళీ సర్వభద్రం దగ్గరకొస్తుంది. సర్వభద్రానికి పొలం కాగితాలు ఇచ్చి దానికి బదులు కొంత డబ్బులు అప్పు తీసుకుని తెలంగాణలో తక్కువ కొస్తున్న పొలాలను కొందామని చుక్కమ్మ నిశ్చయించు కుంటుంది. సర్వభద్రం చుక్కమ్మకి అప్పు ఇచ్చాడా? చుక్కమ్మ సీనయ్యని, పిల్లలని వదిలేసి సర్వభద్రం దగ్గరకి వెళ్ళిపోయిందా? వీటి మీద కథ నడిచి మన కళ్ళు తడిపి బరువుగా ముగుస్తుంది. 


ఈ రెండు కథలు ఒకే దారిలో నడుస్తుంది. అనుసూయకి ప్రకాశరావు, చుక్కమ్మకి సర్వభద్రం కొంతవరకు అండగా నిలుస్తారు. ఇందులో స్వార్ధం ఉంది, కొంచెం జాలి ఉంది. అనుసూయ కంటే చుక్కమ్మ జీవితం కొంతలో కొంత మెరుగు. 

No comments: