Saturday, June 18, 2011

ట్రావెలర్స్ అండ్ మెజీషియన్స్గత సంవత్సరం మా మూవీ క్లబ్బులో కొన్ని సినిమాలు చూసాం. మా క్లబ్బు పాత వేగులు చూస్తూ ఉంటే ఈ సినిమా కనిపించింది. నెట్ ఫ్లిక్సులో వెతికితే తీగ దొరికింది, ఇక డొంకంతా లాగాను. ఈ సినిమా సమీక్ష మా స్నేహితుడు ఇంతకు ముందు నవతరంగంలో రాసాడు. భూటాన్ లో పూర్తిగా తీసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా దర్శకుడు బౌద్ధ మతానికి చెందిన ఒక లామా. అందుకే సినిమా అధ్యాత్మిక చింతనకి సంబంధించిన లోతైన మాటలతో నిండి ఉంటుంది.  

ఆరు ముక్కల కథ
డాండప్ భూటాన్ లో ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వోద్యోగం చేస్తూ ఉంటాడు. అందమయిన గ్రామం, అత్మీయులయిన మనుషుల మధ్య ఉన్నా డాండప్ కి తన ఊరు వదిలి అమెరికాకి వెళ్ళాలని కోరిక. వీలు చూసుకుని ఒక రోజు అమెరికాకి బయలుదేరుదామని నిర్ణయించుకుంటాడు. ఆ చిన్న వూరికి రోజుకొక బస్సు ఉంటుంది, ఆరోజు ఎక్కవలసిన బస్సు కాస్తా మిస్ అవుతుంది. కాలి నడకన రోడ్డు మీద నడుస్తూ దారిన పోయే కార్లు, జీపులని ఆపుతూ ఉంటాడు. అతనికి తోడు పట్నంలో ఆపిల్ పండ్లు అమ్ముకోవడానికి బస్సు కోసం చూస్తూ ఉన్న ఒక చిన్న పాటి రైతు కూలీ ఉంటాడు. సాయంత్రానికి వీళ్ళిద్దరితో పాటు మూడో వ్యక్తి తోడవుతాడు. ఈ మూడవ వ్యక్తి బౌద్ధ మతానికి చెందిన ఒక సాధువు. డాండప్ అమెరికా కోరిక తెలుసుకుని తోటి ప్రయాణికులకి దారి పొడుగునా కథ చెపుతూ ఉంటాడు. కథ ముగిసేసరికి అందరూ గమ్యంకి చేరువవడంతో సినిమా ముగుస్తుంది.   

నాకేం నచ్చింది     

భూటాన్ మంచి సుందర ప్రదేశం! చుట్టూ కొండలు, ఆ కొండలపైన తెల్ల తెల్లని మంచు, సెలయేళ్ళతో సినిమా చాలా అందంగా ఉంటుంది. కొండల అంచుల మీదుగా ఘాట్ రోడ్ చూస్తూ ఉంటే మన మనస్సు హిమాలయాల అంచులదాకా వెళ్ళిపోతుంది. ప్రతి షాట్ ఒక అద్భుతమయిన గ్రీటింగ్ కార్డ్ లాగా ఉండి పోతుంది. కొండల కింద పారుతున్న స్వచ్చమయిన నీళ్ళు చూస్తుంటే మనమే భూటాన్ అంతా తిరుగుతున్నట్టు ఒక కలలా ఉంటుంది. ఎప్పటికయినా భూటాన్ కి వెళ్ళాలని మనకి అనిపించకుండా ఉండదు.  

సాధువు చెప్పిన కథలో పడుచు పెళ్ళాం (డేకీ), ముసలి మొగుడు, మాజిక్ నేర్చుకుంటున్న ఒక యువకుడు మధ్య జరిగే సంఘటనలు చాలా బాగుంటాయి. ఈ కథ మనిషి కోరికల గురించి మనల్ని అలోచింపజేసే విధంగా నడుస్తుంది. సాధువు డాండప్ ని ప్రశ్నలతో కవ్వించడం సరదాగా ఉంటుంది. మెజీషియన్ కథలో డేకీ చాలా అందంగా ఉంటుంది. అలాగే డాండప్ కి తారసపడే పంతొమ్మిదేళ్ళ సోనం కూడా చాలా బాగుంటుంది.

డాండప్ ప్రయాణం మధ్యలో సాధువు మెజీషియన్ కథ చెపుతూ ఉంటాడు కదా! ఒక షాట్ లో డాండప్ రోడ్ మీద వెళ్తున్న ఒక జీపుని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ జీపు నడిపే ఆమె మెజీషియన్ కథలో డేకీ. ఇది డాండప్ కి తెలియదు, మనకి మాత్రమే తెలియజేస్తాడు దర్శకుడు.  అక్కడ మెజీషియన్ కోరిక, ఇక్కడ డాండప్ వూరు చేరాలన్న కోరిక తీర్చేది డేకీనే అని మనకి గుర్తు చేయడం అనుకుంటా. వీలు చేసుకుని తప్పక చూడండి.

2 comments:

మురళి said...

ఈ సినిమా గురించి నవతరంగంలో చదివిన జ్ఞాపకం... డిస్క్ దొరికితే చూస్తానండీ..

శ్రీ said...

అవును, మొన్న నవతరంగంలో వెతికితే కనపడలేదు.

సినిమా తప్పకుండా చూడండి.