Friday, July 8, 2011

Laila's Birthday (2008)




పాలస్తీనాలో జడ్జిగా పని చేసే అబూ లైలా కూతురుకి ఈ రోజు పుట్టినరోజు. ఉదయాన్నే లైలాని స్కూలులో దింపి తన అఫీసుకి బయలుదేరేముందు అబూ పెళ్ళాం, కూతురు పుట్టిన రోజు గుర్తు చేసి సాయంత్రం తొందరగా రమ్మంటుంది. ఈ రోజంతా అబూ ఎలా గడిపాడు అన్నదే సినిమా.  


పాలస్తీనాలో రాజకీయ పరిస్థుతుల వలన అప్పటివరకు జడ్జిగా పని చేసినా అతనికి జడ్జి పోస్టింగ్ ఉండదు. అఫీసుకి ఎపుడు వెళ్ళినా "రేపు రా,మళ్ళీ రా" అని తిప్పి పంపుతూ ఉంటారు. టాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అబూ జడ్జి కాబట్టి సాదా,సీదా టాక్సీ డ్రైవరు కాకుండా జడ్జి తరగా బట్టలు వేసుకుని పద్దతిగా టాక్సీ నడుపుతూ ఉంటాడు.    


ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకుడికి సీట్ బెల్ట్ వేసుకోమంటాడు. అలాగే వెనక సీట్లో కూర్చుని సిగెరెట్ కాలుస్తుంటే అతనికి క్లాసు పీకుతాడు. ఇలా ఎక్కిన ప్రతి కస్టమరుతో ఎదో రకంగా గొడవ జరుగుతూనే సాగుతుంది ఆ రోజంతా. భద్రత లేని స్థలాలకి ఇతని టాక్సీ వెళ్ళదు, అలాగే ఇంటర్నెట్ కాఫే లో కూర్చోవడం కంటే టాక్సీలో ప్రియురాలితో సరదాగా వెళ్దామనుకుంటే వాళ్ళని దించేస్తాడు. ఈ గొడవలు అన్నీ తెగ్గొట్టి సాయంత్రం పుట్టిన రోజుకి ఇంటికి చేరుకుంతాడా, లేదా అని మనకి మాత్రం చాలా అత్రుత కలుగుతూ ఉంటుంది.


అక్కడి సామాజిక పరిస్థితులు సామాన్య ప్రజానీకానికి ఎలా ఇబ్బంది కలిగిస్తుందో మనకి చూపించడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా. అలాగే జడ్జి హోదాలో ఉన్న ఒక వ్యక్తి క్రమశిక్షణ తప్పుతున్న సామాన్య ప్రజలని అదుపులో పెట్టడానికి పడే తపన కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఒక సన్నివేశంలో అబూ కోపం పట్టలేక పబ్లిక్ మైకు తీసుకుని అదుపు తప్పిన ట్రాఫిక్ ని సరి చెయ్యడంలో అతని నిస్పృహ మనకి బాగా కనిపిస్తుంది.   


ఈ సినిమాకి ఫజర్, సింగపూర్, సెయింట్ లూయీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్సులో అవార్డులు వచ్చాయి. అబూ లైలాగా చేసిన మొహమ్మద్ బక్రీ చాలా సహజంగా చేసాడు. నడి వయసులో, మంచి హోదాలో ఉండే జడ్జిగా మొహంలో ఎపుడూ ఒకే రకమయిన సీరియస్ ఫేస్ ని సినిమా అంతా కంటిన్యూ చేస్తాడు.

3 comments:

Rajendra Devarapalli said...

చాలా ఆసక్తికరంగా ఉంది కథ,జడ్జీ స్థాయి వ్యక్తి జీవనాధారం కోసం టాక్సీ నడపటమా???అదే మనకయితే
యెప్పుడో మొగలాయీలు,ఆంగ్లేయుల టైంలో కోర్టులో సెనక్కాయలు అమ్ముకున్నా ఆ గోరోజనం తగ్గక యింకా
మాస్థాయికి తగ్గ ఉద్యోగం వస్తేనే చేస్తాం ,లేదంటే సమాజాన్ని తిడుతూసెటైర్లు వేస్తూ ఉంటాంలేదా పస్తులతో మాడి
చస్తాం తప్ప మరొకపని అంటే ఉద్యోగం చెయ్యమనే సమాజంలో బతుకుతున్న నాలాంటివాళ్ళకు ఈ కథాంశం కాస్త
విచిత్రంగానే ఉంది.ఇలాంటి సినిమాలు భారతదేశంలో తీయరు,చూద్దామన్నా దొరకవు,అందులోనూ
విశాఖపట్నం లాంటి మారుమూల ప్రాంతాల్లో అస్సలు దొరకవు.కాబట్టి అధ్యక్షా అవి ఎక్కడ లభిస్తాయో
చెప్పాలని డిమాండ్ చేస్తున్నా....

మురళి said...

అచ్చంగా నేను చెప్పాలనుకున్న రెండు మాటలు అదే అర్ధం వచ్చేలా రాజేంద్ర కుమార్ గారు చెప్పేశారు.. నా డిమాండ్ కూడా డిటో..

శ్రీ said...

డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటే ఎక్కడయినా, ఏ పనయినా చేసుకోవచ్చు. మన దగ్గర వాడి పని, వీడి పని అని నిర్ణయించుకోవడం వల్ల మనకు ఆ నామోషీ. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, అతని మానేజర్ ఆరు నెలలు సాఫ్టువేరులో పని చేసి మిగతా ఆరు నెలలు టాక్సీ నడుపుతాడట. అది అతనికి హాబీ కూడా.

ఇక ఈ సినిమా నేను నెట్ ఫ్లిక్సులో చూసాను. మంచి అవార్డులు వచ్చిన సినిమాలు మనం ఇందులో వెతుక్కుని చూసుకోవచ్చు.