Thursday, August 25, 2011

అన్నా హజారే


ఇందుగలడందు లేడని సందేహము వలదు! లంచగొండులు ఎందెందు వెదికినా అందందే కలరు!! అంతెందుకు, మనయందే కలరు!!! 


"నిద్ర లేస్తే లంచం, నిద్రలోకి వెళ్తే లంచం ...లంచం,లంచం,లంచం" ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటా. మన దేశంలో ఏపని చెయ్యాలన్నా లంచం ఇస్తే కానీ జరగదు. లంచం ఇవ్వకుండా ఎదురుతిరిగి వాళ్ళతో వాదించి నిజాయితీగా పోరాడడం మనకి తెలియదు. "వందో, వాడి బొందో మొహాన కొడితే వాడే నీ పని చూస్తాడు" ఇచ్చెయ్యరా అని మిత్రుల నుండి వినడం మనకి మామూలే. తిరుమలలో గుండు కొట్టుకోవడానికి బ్లేడుతో పాటూ ఒక పది పెట్టకుండా ఉండం. లేకపోతే గోవిందుడు కన్నెర్ర చేసి గుండు ఎరుపెక్కిస్తాడు.

లంచం ఇచ్చేవాడు ఇలా ఉంటే లంచం తీసుకునేవాడు కూడా అలాగే ఉంటాడు. ఊరికే డబ్బులు వస్తాయంటే ఊర్మిళకూడా వద్దనదు! ఇంతకీ ఊర్మిళ ఎవరు? నాకూ తెలియదు, ఏదో ప్రాస కోసం వాడేసా. 

కొన్ని సంవత్సరాల ముందు నేను డెట్రాయిట్టులో ఇల్లు కట్టించా. గుంటలు తవ్వి, చెక్కలు పెట్టేంతవరకు వీలయినంతవరకు దగ్గర ఉండి చేసా. విడతలవారీగా ఇంటి నిర్మాణం జరుగుతుంది. మధ్య, మధ్యలో నేను చూసుకుంటూ ఉండేవాడిని. అలాగే నగర పురపాలక సంస్థ నుండి కూడా ఒక మనిషి వచ్చి నిర్మాణం సరిగ్గా జరుగుతుందో, లేదో చూసేవాడు. 

ఒకసారి ఇలాగే సిటీ వాడు వచ్చి ఏదో రెండు సాకులు చెప్పి వెళ్ళిపోయాడు. నేను వాటిని చూస్తూ మా బిల్డర్ ని అడిగాను "ఏమిటి సంగతి?" అని. 

మా బిల్డర్ తెలుగు టీవీ చూడడు కాబట్టి "పాప ఏడ్చింది" అని చెప్పలేదు. "ఇది మామూలే, ఈసారి వచ్చినపుడు డబ్బులు తీసుకుని ఓకే చేస్తాడు" అన్నాడు.

నా పక్కలో బాంబు పడ్డట్టు నేను బెదరలేదు. "అవునా" అన్నాను. 

బిల్డర్ "అవును" అన్నాడు.

"రామేశ్వరం పోయినా మనకి ఈ శనేశ్వరం తప్పదు" అనుకుని నిట్టూర్చాను.

విషయం ఏమిటంటే లంచం ఎక్కడయినా ఉంటుంది. కాకపోతే అమెరికాలో బిల్ గేట్స్ అయినా స్కాములో ఇరుక్కుంటే అంతే సంగతులు! చట్టం ఎవరికీ చుట్టం కాదు, తన పని తాను చేసుకు పోతుంది. ఆ వెసులుబాటు మనకు లేదు. స్కాములో ఇరుక్కున్న రాజీవ్ గాంధిని రాహుల్ గాంధీకి కొడుకు పుట్టినా ఏమీ చెయ్యలేము. అందరూ దొంగలే, అందరికీ అందుబాటులో మన చట్టం ఉంటుంది.  


RTI చట్టం వచ్చినపుడు మనమెంతో సంతోషించాం. సామన్యుడు ఎవరన్నా "నాకు తెలియాలి" అని అడిగితే తప్పకుండా అతనికి తెలిసేలా ప్రభుత్వం పని చేయడం ద్వారా సాధ్యమయింది. RTI వలన కనీసం మనకి కొంత సమాచారం అయితే దొరుకుతుంది. ఈ చట్టం తీసుకురావడానికి అన్నా చాలా సంవత్సరాలు ప్రభుత్వంతో పోరాడి చివరికి సాధించాడు.


ఈరోజు అవినీతిని అంతమొందించడానికి ప్రజలందరూ ముందుకు రావడం నిజంగా సంతోషకరం. అవినీతి నిర్మూలన మీద ప్రజలందరికీ అవగాహన రావాలి. ఇంతకు ముందు మనమందరం తప్పులు చేసి ఉండచ్చు, ఇక మీదన్నా లంచం ఇచ్చే ముందు ఒకసారి అలోచిద్దాం. 

2 comments:

మురళి said...

well said..

శ్రీ said...

నెనర్లు మురళి గారు