కథ: శంకర్ నారాయణ్ ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి. ప్రజల బాగు కోసం పాటు పడే ఒక నాయకుడు. ఎవరింటికి పిలిచినా వెళ్ళిపోతూ ఉంటాడు, అందరి ఆప్యాయతని పొందిన ఈ నాయకుడు ఒక దుర్ఘటనలో మరణిస్తాడు. అతని కొడుకే మన మహేష్ బాబు (అజయ్). అజయ్ ఒక పోలీస్ ఆఫీసరు, ఫీల్ అవ్వద్దండి ఇది సస్పెన్స్ ఏమీ కాదు. ముంబైని గడగడలాడిస్తున్న ఒక మాఫియా లీడరు (సోనూ సూద్) ఆచూకీ తియ్యడం కోసం టర్కీ వెళ్తుంది అజయ్ బృందం. ఇక్కడ అజయ్ కి ప్రశాంతి (సమంతా) తారసపడుతుంది, ఇద్దరి ప్రేమాయణానికి అంకురార్పణ జరుగుతుంది. సోనూ సూద్ ని పట్టుకోవడం కోసం అజయ్ అతని తమ్ముడిని ట్రాప్ చేసి పట్టుకుని చంపేస్తాడు.
ఎపుడో దుర్ఘటనలో చనిపోయాడనుకున్న శంకర్ నారాయణ చనిపోకుండా కోమాలో ఉంటాడు. ఇరవై ఏళ్ళ తరువాత మళ్ళీ ఈలోకం లోకి వస్తాడు. ఎపుడూ జనం కోసం అలోచించే తండ్రిని సంతోషంగా ఉంచడం కోసం అజయ్ తండ్రి చుట్టూ అబద్దాల కోటని కట్టి మురిపిస్తాడు. తన తండ్రిని చంపాలనుకున్న అందరినీ తండ్రి చేతనే మట్టు పెట్టేలా శత్రువులని ఉచ్చులో బిగిస్తాడు. స్థూలంగా ఇదీ కథ.
నటన: టీవీ9 చెప్పినట్టే మహేష్ బాబు ఈ సినిమాలో తెలంగాణా యాసలో మట్లాడుతాడు. అయ్యా, కేసీఆర్! నువ్వు ఈ సినిమా ప్రదర్శనని ఆపద్దు, మనవాడు మన భాషలోనే మాట్లాడాడు. మహేష్ బాబు పంచ్ డైలాగులు కడప బాంబుల్లా పేలాయి. మనవాడు కామెడీ సితక్కొట్టేసాడు. మహేష్ పక్కన సమంతా జోడీ చాలా బాగా సరిపోయింది. ఏం మాయ చేసావే లో సమంతాకి డబ్బింగ్ చెప్పిన చిన్మయి శ్రీపాదనే ఈ సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పింది. తనకిచ్చిన గ్లామర్ పాత్రకి సమంతా మంచి న్యాయమే చేసింది.
ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర నిజంగా అమోఘం. సినిమా అంతా రియాలిటీ షోలో ఒక పాత్రలో నటిస్తున్నానన్న భ్రమలో ఉంటాడు. బాగా నటించి ప్రైజ్ మనీ కొట్టేయాలని విపరీతంగా నటించేస్తూ ఉంటాడు. బ్రహ్మానందం ఎస్సెమ్మెస్ అడిగే సీన్ బాగా పండింది. అజయ్ తీసే సినిమాలో తనే హీరో అన్న భ్రమలో ఎమ్మెస్.నారాయణ ఉంటాడు. ఎమ్మెస్.నారాయణ యమదొంగలో ఎంటీఆర్ లాగా, మగధీరలో రాం చరణ్ తేజ లాగా, రోబోలో రజనీకాంత్ లాగా నటించే సీన్ కూడా మంచి సరదాగా ఉంటుంది. క్లైమాక్సులో కామెడీ చాలా బాగుంది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా కాసేపు అందరినీ కామెడీలో ముంచుతాడు.
సినిమాటోగ్రఫీ: శ్రీను వైట్ల సినిమాలలో పాటల చిత్రీకరణ పెద్ద గొప్పగా ఉండదు. మహేష్ బాబుతో సినిమా అంటే పాటలు బాగా తీయాలి. పాటల చిత్రీకరణ చాలా అందంగా బాగుంది. అతడుకి సినిమాటోగ్రాఫరుగా పని చేసిన గుహన్ ఈ సినిమాకి కూడా పని చేసాడు. దూకుడులో టైటిల్ సాంగు చూస్తుంటే అతడులో పాట చూసినట్లే ఉంటుంది.
దర్శకత్వం: ఇది పూర్తిగా శ్రీను వైట్ల మార్కు సినిమా. ఇంటికొచ్చి అసలు కథ ఏమిటి అని అలోచిస్తే అంతా కలగూరగంపలా ఉంటుంది. కథలో గందరగోళం సాగుతూ ఉంటే కామెడీ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కథ ఎలా ఉన్నా, అసలు లేకున్నా కథని నడిపిన తీరు బాగుంటుంది. ఎక్కడా బోరు కొట్టనివ్వకుండా నడిపించడమే ఈ సినిమాని నిలబెడుతుంది. మహేష్ బాబు ఇమేజుని సరిగ్గా కాష్ చేసుకోవడముతో పాటూ బ్రహ్మానందం, ఎమ్మెస్.నారాయణలతో సినిమాని పకడ్బందీగా లాక్కొచ్చేసాడు. గోపీమోహన్ కథకి ముప్పతిప్పలు పెట్టాడు.
సంగీతం: సినిమాలో పాటలు బాగానే హిట్ అయ్యాయి. పువ్వాయ్, పువ్వాయ్ అప్పారావ్ పాట 80లలో వచ్చిన హిందీ సినిమా పాటలాగ ఉంటుంది వినడానికి. ఈ పాటకి పార్వతీ మెల్టన్ ఐటం గర్లుగా బాగా చేసింది, పాటకి సెట్టు సూపరుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ సౌండ్ కూడా బాగనే ఉంది, తమన్ పరవాలేదు అనిపించుకున్నాడు.
సినిమా నీటుగా ఉంది, ఎక్కడా అసభ్యం అంటూ లేకుండా చక్కగా తీసాడు శీను. కుటుంబ సమేతంగా సినిమాకి మళ్ళీ మళ్ళీ వెళ్ళచ్చు. ఈ సినిమాకి కాలాస్త్రి రేటింగ్ 3.5/5.
4 comments:
ఎక్కడ ఆడుతోంది?
Phoenix Theatres Laurel Park Place
17310 Laurel Park Drive North
Livonia, MI 48152
నిన్న వెళ్ళాం బాబూ ..
నిజంగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయ్యింది..
అదేం కథ..అదేం కామెడీ..
ఒక రసం ఆస్వాదించే లోపే ..ఇంకో రసం ..మరో రసం ..తికమక పెట్టేస్తాయి..
గొప్ప కంగాళీ సినిమా రా ఓ దేవ దేవ దేవ దేవ దేవుడా..
హహహ...
Post a Comment