అకీరా కురసావా తీసిన ఈ సినిమాలో ఎనిమిది చిన్న కథలు ఉంటాయి. ఈ కథలన్నీ అకీరా జీవిత కాలంలో వచ్చిన కలల నుండి తీసుకున్నవేనట. ప్రతి కల చాలా ఆసక్తికరంగా ఉండి, విపరీతమయిన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. అకీరా దగ్గర ఉన్న గొప్పదనం ఏమిటంటే సినిమా మొదలయినప్పటి నుండీ మనల్ని కూర్చున్నచోటు నుండి కదలనివ్వడు. ఆ ఎనిమిది కథలనీ ఇక్కడ మీ కోసం పరిచయం చేస్తాను.
ఎండలో వాన: ఇది మొదటి కథ. ఎండగా ఉన్నపుడు వాన వస్తే ఆరోజు నక్కలు ఊరేగింపు చేసుకుంటాయిట. ఆ ఊరేగింపుని ఎవరన్నా చూస్తే నక్కలకి కోపం వస్తుందట. అందుకని బయటకి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఆడుకోమని తల్లి చెప్తుంది. పిల్లవాడు వినకుండా అటూ, ఇటు తిరుగుతూ చివరకు నక్కల ఊరేగింపు చూస్తాడు. తరువాత నక్కలు ఏమి చేసాయన్నదే కథ! మనం కూడా ఎండ పడినపుడు వాన కురిస్తే కుక్క, నక్క పెళ్ళి అనుకుంటాం. జపనీస్ వాళ్ళకి కూడా ఇటువంటి నమ్మకమే ఉందనమాట. నక్కల ఊరేగింపు చాలా అందంగా తీసాడు అకీరా. సంగీతానికి తోడుగా నక్కల నృత్యం మంచి కళాత్మకంగా ఉంటుంది.
పీచుల తోట: పీచులు అంటే కొబ్బరి పీచు కాదు, పీచ్ అనే పళ్ళ తోట గురించి ఈ కథ. పీచుల తోట ఉన్న ఆసామి కూతురు ఇంట్లో బొమ్మల కొలువు చేసుకుంటూ ఉంటుంది. అక్క స్నేహితులకి చిరుతిళ్ళు అందిస్తూ ఒక అమ్మాయి మిస్ అయిందని గ్రహిస్తాడు తమ్ముడు. ఈ లింగడికి తప్పిపోయిన అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇతన్ని పీచుల తోటకి తీసుకు వెళ్తుంది. బొమ్మల కొలువులో ఉన్న బొమ్మలు అక్కడ నిజ అవతారం ఎత్తి పిల్లవాడికి చిన్న క్లాసు పీకుతారు. ఈ బొమ్మలాటలు కథాకళికి దగ్గరలో ఉంటుంది. పచ్చని తోటలో ఈ బొమ్మలు సంక్రాంతి ముగ్గులాగా అందంగా ఉంటుంది.
మంచు తుఫాను: ఇతనెవరో మంచు లక్ష్మి తమ్ముడు కాదు, నిజంగా మంచు తుఫానే. మంచు కొండల్లో సాహసపూరితమయిన యాత్రలో ఉన్న ఒక బృందం తుఫానులో చిక్కుకుపొతుంది. ఒక్కొక్క అడుగు వెయ్యడమే చాలా కష్టమయిపోతుంది. కాసేపటికి అందరూ ఇక నడవలేక ఆ మంచు తుఫానులో స్పృహ తప్పి పోతారు. ఈ సీన్ అంతా మంచులో చాలా బాగా తీసారు, మనుషులు కూడా చలిలో ఒళ్ళంతా గడ్డ కట్టినట్టు బాగా చూపించాడు. మాటలు చాలా తక్కువ ఉండి వాళ్ళ భావాలతోనే కథ నడుస్తుంది.
సొరంగం: ఈ కథలో ఒక సైనికుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక సొరంగం వస్తే దాంట్లోకి నడుస్తాడు. సొరంగం నుండి ఒక కుక్క భయంకరంగా అరుచుకుంటూ ఇతని మీద పడుతుంది. దాన్ని దాటుకుని సొరంగంలో నడిచి బయటపడతాడు. ఈ లోపల చనిపోయిన ఒక సైనికుడు ఇతని దగ్గరకు వస్తాడు. తాను చనిపోయినా తన అమ్మా, నాన్నలు ఇంకా బతికేఉన్నాడని అనుకుంటున్నారు అని చెప్తాడు. తన కింద పని చేసిన సైనికులంతా యుద్ధంలో చనిపోయి ఇతని దగ్గర వచ్చే సన్నివేశం నిజంగా అద్భుతం. చనిపోయిన సైనికుడి బాధ మనల్ని కదిలిస్తుంది, అకీరా మనల్ని కదిలించకపోయినా.
కాకులు: చిత్రకళా ప్రదర్శనలో అద్భుతమయిన చిత్రపటాలను చూస్తూ ఆ బొమ్మలలోకి వెళ్ళిపోతాడు ఒక కళాపిపాసి. ఆ బొమ్మని వేసిన చిత్రకారుడిని కలవడానికి వెళ్తాడు. చిత్రకారుడు బొమ్మ వేసుకుంటూ మనవాడికి కనిపిస్తాడు. ఈ కథ అకీరా క్రియేటివిటీకి పరాకాష్ట. చూస్తున్న బొమ్మలలోకి మనిషి వెళ్ళడం, వెళ్ళిన మనిషికి బొమ్మలు కనిపించడం బాగా ఉంటుంది. బొమ్మలు వేసిన చిత్రకారుడిగా ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సీ నటించాడు. ఇతను తీసిన సినిమాలలో "డిపార్టెడ్, టాక్సీ డ్రైవర్ లాంటి అద్భుత సినిమాలు ఉన్నాయి.
మండే ఫ్యూజీ పర్వతం: ఫ్యూజీ పర్వతం దగ్గర ఉన్న ఒక న్యూక్లియార్ ప్లాంట్ పేలి దాని దాని నుండి వచ్చే రేడియేషన్ కి తట్టుకోలేక ప్రజలందరూ పారిపోతూ ఉంటారు. ఎటూ తప్పించుకోలేమని తెలిసి పక్కనే ఉన్న సముద్రంలోకి దూకేస్తుంటారు చాలామంది. తన ఇద్దరు పిల్లలని కాపాడుకోవడానికి తల్లి పడే యాతన టచింగ్ గా ఉంటుంది. ప్లాంట్ కట్టేటపుడు మాకు ఈ విషయాలన్నీ చెప్పలేదే అని నిట్టూరుస్తూ భాయందోళనలకు గురవుతుంది.
ఏడ్చే దెయ్యం: దారిన పోయే బాటసారికి ఒక దెయ్యం కనిపిస్తుంది. ఇతను మనిషిలాగే ఉంటాడు, కానీ బట్టలు అన్నీ పాడయిపోయి జుట్టు, గడ్డం పెరిగి తల మీద ఒక కొమ్ము కూడా ఉంటుంది. న్యూక్లియార్ రేడియేషన్ వలన అందరూ చనిపోయాక అక్కడ ఇటువంటి మనుషులే మిగిలారు అని దెయ్యం చెపుతుంది. మంచి చెట్లు పోయి పిచ్చి చెట్లు మాత్రమే మిగిలుతాయి. ఈ దెయ్యాలకి చావు ఉండదు, రాత్రి పూట కొమ్ములు నొప్పి పుడుతూ ఉంటే ఇవన్నీ దీనంగా ఏడుస్తూ ఉంటాయి.
పల్లెటూరు: అందమయిన పల్లెటూరు. రంగు, రంగుల పూల చెట్లు, గల, గలా పారే సెలయేరూ, ముచ్చటగా ఆడుకునే పిల్లలతో ఆ పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది. విచిత్రమేమిటంటే ఆ ఊరిలో కరెంటు ఉండదు. మన బాటసారి అక్కడ పని చేసుకుంటున్న ముసలాయనతో పల్లెటూరి విశేషాలు తెలుసుకుంటాడు. మానవుడు ప్రకృతి నుండి లభించిన వాటితోనే తృప్తి పడాలనీ, దానికి విరుద్ధంగా నడుచుకోకూడదనీ చెప్తాడు. ఆదర్శవంతమయిన జీవితాన్ని గడపాలంటూ బోధిస్తాడు.
చిన్న కథ, దాన్ని అద్భుతంగా నడిపించే కథనం మనల్ని రెండు గంటలు అలరిస్తాయి. ప్రతి కథ ఎంతో అందంగా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా చాలా అద్భుతంగా నటిస్తారు. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.
4 comments:
కుమ్మేసారండీ,ఆయన చిన్న కథలు తీసుకుని సినిమా తీస్తే మీరూ చిన్నగా రాయాలని యేముంది?ఒక్కోదాని గురించి సవివరంగా రాయండి.కాకులు విభాగములో ల్యాండ్ స్కేపింగ్ చూసారా ? అదీ కురసోవా అంటే :)
థాంక్స్ రాజేంద్ర గారు. ఈ సినిమా ఏదో డాక్యుమెంటరీ అనుకునేవాడిని, చాలా బాగుంది. కాకులులో బొమ్మలలో విహారం అద్భుతం!
మీరు ఇలా చెప్పి అల్లా పోవడమేనా లెక వీటన్నింటినీ ఎలా సంపాదించాలోకూడా చెప్పేదారేదైనా వుందా?లింకులో ఇంగ్లీషుపేర్లో ఏదోఒకటి ఇవ్వండి బాబూ.
నేను చూసే సినిమాలు చాలా వరకు నెట్ ఫ్లిక్సు నుండి చూసినవే. కొన్ని సినిమాలు యూట్యూబులో ఉన్నాయి. ఈ సినిమాలో కొన్ని కథలు యూట్యూబులో కనిపించాయి. మీరు అకీరా డ్రీంస్ అని యూట్యూబులో వెతకగలరు.
Post a Comment