గురువారం రాత్రి పడుకోబోయేసరికి ఈ నవల చదవడం ముగించాను. తెలుగు నవలల్లో గుర్తుండిపోయే నవల అని అందరికీ తెలిసింది కాబట్టి దీన్ని చాలామందే చదివారు. ఒక స్నేహితుడయితే ఈ నవలని చదవమని నేనే నీకు చెప్పాను అని ఒక రాయేసాడు. మా ఆవిడ కూడా ఈ నవలని చదివానని చెప్పింది. నీకెలా అనిపించింది? అని మా ఆవిడని అడిగాను. ఈ నవల గురించి మాలతి గారు మంచి వ్యాసం రాసారు. మన కత్తి మహేష్ గారు కూడా 2009 లో ఈ నవల మీద తన బ్లాగులో బ్లాగారు. ఆ బ్లాగులో నా కామెంట్ చూసి నాకు గుర్తు వచ్చిన విషయం ఏమిటంటే "2009 నాటికి నేను 20 పేజీలు చదివాను". తరువాత ఎందుకో పూర్తిగా చదవలేకపోయాను. పుస్తకం.నెట్ లో కూడా ఈ పుస్తకం గురించి రాసి పారేసారు. ఇంతమంది రాసాక నేను రాయడం అవసరమా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. పెద్ద సమయం తీసుకోకుండా "అవసరమే" అని నా అంతరాత్మ "నువు రాసెయ్ భయ్యా.." అని చెప్పింది.
ఈ పుస్తకం మీద మా ఊరిలో (ఇంకా మా ఊరేమిటి, ఊరు ఎల్లలు దాటి రెండు వారాలవుతుంది) చర్చకు నేను హాజరు అవలేకపోయాను. ఇదొక్కటే మిస్ అయ్యానా? మిగతావన్నీ హాజరయ్యావా? అని మా క్లబ్బు మిత్రులు నన్నడగవచ్చు, తప్పులేదు. చర్చకి వెళ్ళి ఉంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా నాకు తెలిసి ఉండేది. ఇపుడు తెలియకపోయినా పెద్ద నష్టం జరగలేదు.
అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు ఒక సీనులో విలన్లని చితగ్గొట్టిన తరువాత అతని నాన్నగారయిన జగ్గయ్యతో ఇలా అంటాడు.
"నాన్నా..ఇన్ని రోజులు పని లేకుండా గాలికి తిరిగాననని నన్ను తిట్టావ్, ఈరోజు నుండీ నాకు పని దొరికింది" అంటాడు.
నేను ఎవరినీ కొట్టలేదు కానీ, నాకూ ఈమధ్య కాలంలో పని కాదు ఖాళీ దొరికింది. ఈ ఖాళీలో బాకీ ఉన్న పుస్తకాలని తీసి చదవడం మొదలుపెట్టాను. అటువంటి పుస్తకాలలో ఈ "చివరకు మిగిలేది" ఒకటి.
ఈ నవలలో కథానాయకుడు దయానిథి, కథానాయికలు చాలామందే ఉంటారు. నవలా సమయం వచ్చి మనకి స్వాతంత్ర్యం రావడానికి పది సంవత్సరాల ముందు అనుకోవచ్చు. దయానిథి సర్కారు జిల్లాలోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. పట్నంలో ఎంబీబియస్ చదువుతూ ఉంటాడు. దయానిథి అతని ఊరులోనే లేచివచ్చినామె కూతురు అయిన కోమలితో ప్రేమలో పడతాడు. సంఘాన్ని ఎదిరించి కోమలిని పెళ్ళి చేసుకోలేకపోతాడు. మేనమామ కూతురు అయిన సుశీలతో పెళ్ళి అనుకుంటారు కానీ నిథి తల్లి ప్రవర్తన బాగాలేదని ముందుకు వెళ్ళరు. తండ్రి మాట మీద ఇందిర మెడలో తాళి కడతాడు. నిథికి ఇంకొక అత్త కూతురు ఉంటుంది, పేరు అమృతం. నిథికి అమృతం అంటే ఇష్టం, ఈమెకి పెళ్ళి అయి శుభ్రంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది.
ఎంబీబియస్ పూర్తి అయ్యాక ప్రాక్టీస్ చేస్తూ కాంగ్రెస్ సమావేశాల ప్రభావంతో ప్రభుత్వంకి వ్యతిరేకంగా చేసే పోరాటాలలో పిల్లనిచ్చిన మామ మాధవయ్య గారితో భేదాభిప్రాయాలు వస్తాయి. సుశీల పెళ్ళి తన స్నేహితుడు కృష్ణమూర్తితో జరుగుతుంది.అమృతం మీద అభిమానం ఒక బలహీన క్షణంలో బలపడి నిథి, ఆమె ఒకటవుతారు. నిథికి కోమలి, సుశీలతో అక్రమ సంబంధాలున్నాయంటూ చాలా మంది పుకార్లు లేవదీస్తూ ఉంటారు. ప్రాక్టీసు కూడా దెబ్బ తినేసరికి నిథి ఊరు వదిలేసి రాయలసీమ వెళ్తాడు. ఇక్కడ అనంతాచారి గారితో పరిచయమయి అనుకోకుండా ఒక వజ్రం దొరికి లక్షాధికారి అవుతాడు.
దబ్బులొచ్చి సెటిల్ అయ్యాక ఇందిరతో కాపురం చేసాడా? పాత ప్రియిరాలు కోమలి ప్రేమాయణం మొదలుపెట్టాడా? అనంతాచారి కూతురు కాత్యాయనికి దగ్గరయ్యాడా? పెళ్ళి అయి కాపురం చేసుకుంటున్న అమృతం ని ఆరాధిస్తూ కూర్చున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే!
టైటిల్ చూడగానే ఈ నవలలో ఏమి చెప్తాడు అని చాలా ఆసక్తి కలగడం సహజమే. నవల నడిపించే విధానం చాలా బాగుంది, దయానిథి మనోభావాలని పాఠకులతో పంచుకున్న తీరు చాలా బాగుంది. ఈ తీరే నవలకి మంచి పేరు తెచ్చి పెట్టాయని నా అభిప్రాయం. సంఘంతో నిథి చేసే పోరాటం చాలా బాగుంటుంది, కాకపోతే చివరకు ఇతను సంఘానికి లొంగిపోవడం జరుగుతుంది, అలా లొంగిపోకుండా ఉంటే నిథి పాత్ర మంచి వీర పాత్రగా కూడా ఉండేదేమో? లేకపోతే ఎంతవారయినా సంఘానికి కట్టుబడి ఉండాలని బుచ్చిబాబు గారు చెప్పారా?
నిథి పెళ్ళిలో బ్రామ్మలు భోజనాలు చేస్తుండగా పెద కాపు నారయ్య కిటికీలో నుండి చూసాడని మాధవయ్య కోపంతో రెండు దెబ్బలు వేస్తాడు. నిథి అడ్డు వెళ్ళి నారయ్యని కాపాడడం బాగుంది. నారయ్యని కూడా బంతిలో కూర్చోపెట్టడానికి నిథి పంతం పట్టడం లాంటివి ఆనాటి కట్టుబాట్లు మనకి తెలియజేస్తాయి.
కోమలితో నిథి ప్రేమ నాకు బాగా నచ్చింది. ఆమె మీద ఉన్న వాంచని తీర్చుకుంటే ప్రేమ తగ్గుతుందేమోనని నిథి పడే తపన బాగుంది. కాకపోతే సమాజానికి ఎదురు తిరిగి ఆమెని పెళ్ళి చేసుకోవడానికి భయపడుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిజం కాకుండా రియాలిటీకి దగ్గరలో కథని ఉంచారు బుచ్చిబాబు గారు. కోమలిని తక్కిన ఆడవాళ్ళు గేలి చెయ్యకుండా ఆమెకి నిథి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి ఈమెలో ఏమి ప్రత్యేకత ఉందో ఎప్పటికీ అర్థం కాదు. ఆమెకి చదువు చెప్పించడం లాంటివి ఆదర్శవంతంగా ఉంది.
అమృతం తో నిథి పెళ్ళి అయి ఉంటే కథ వేరే విధంగా ఉండేదేమో? అమృతం అంటే ఎందుకో నిథికి అంత అభిమానం, ఆమెకి కూడా బావ అంటే బాగా ఇష్టం. వీళ్ళిద్దరి మధ్యలో రహస్యం మనకి తెలుస్తుంది కానీ, నిథికి పూర్తిగా తెలియనివ్వలేదు రచయిత. కోమలి పాత్ర లేకపోయి ఉంటే నిథి అమృతాన్ని లేపుకు పోయి ఉండేవాడనిపిస్తుంది నాకు.
దయానిథి మామగారితో గొడవపడ్డాడు అని చదవగానే నాకు "కొళ్ళాయిగట్టితేనేమి" నవలలో రామనాధం గుర్తుకు వచ్చాడు. ఈ మామా,అల్లుళ్ళ గొడవలలో పెళ్ళాలని అశ్రద్ధ చేయడం ఏమీ బాగుండదు. ఆ కాలంలో ఈ పట్టింపులు బాగా ఎక్కువనమాట! పాపం, ఇందిర కాపురం చెయ్యకుండానే నిష్క్రమిస్తుంది.
నవల మొదలయినపుడూ అదే ప్రశ్న, పూర్తి అయేటపుడూ అదే ప్రశ్న "చివరకు మిగిలేది" ఏమిటి అని. చివరలో మిగిలేది బతుకు జీవితంలో కలిగే జ్ఞాపకాలే అని మా బాగా సెలవిచ్చాడు రచయిత. నిథి రాయలసీమకి వచ్చినపుడు ఏమీ తీసుకురాడు, మధ్యలో బాగా సంపాదిస్తాడు. చివరలో అన్నీ పోయి మళ్ళీ అదే ప్రయాణం మొదలుపెడతాడు.
నవల మొదలు పెట్టినపుడు చదవడానికి కొంచెం కష్టపడ్డాను, కొంచెం దూరం పోయాక కథలో బాగా ఇరుక్కుపోయాను. కత్తి మహేష్ గారన్నట్టు ఈ నవలని ఇంకో పది సంవత్సరాల తరువాత చదివితే ఇంకా బాగుంటుందేమో?
4 comments:
I liked it at http://toptelugublogs.blogspot.com/
థాంక్స్ శ్రీనివాస్
Good One
థాంక్స్ ఫణీంద్ర
Post a Comment