Saturday, October 29, 2011

కాంచీవరం - పుట్టింటి పట్టుచీరసినిమా:                కాంచీవరం (తమిళం)
కథ, దర్శకత్వం:    ప్రియదర్శన్
సంగీతం:               ఎం.జీ.శ్రీకుమార్ 
సినిమాటోగ్రఫీ:       తిరునావుక్కరసు
ఎడిటింగ్:              అరుణ్ కుమార్
తారాగణం:            ప్రకాష్ రాజ్, శ్రేయ రెడ్డి, షమ్మూ
విడుదల:              సెప్టెంబరు 2008

హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే! మా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో పెళ్ళి అంటే కంచికి ప్రత్యేకంగా వెళ్ళి నచ్చిన చీరలు కొనాల్సిందే! 

ఈ సినిమా కథ 1948 సంవత్సరంలోది, కాంచీపురం (వాడుకలో కంచి అంటూ ఉంటాం) కి చెందిన ఒక నేతగాడి కథ ఈ సినిమా. అందరికీ నచ్చే పట్టు చీరలు నేసే నేతగాడి జీవితంలో పట్టు చీర కొనుక్కోవడం ఒక కల! తన పెళ్ళికి పెళ్ళానికి పట్టు చీర పెడతానని ఊరిలో చెప్పి ఉంటాడు ఈ సినిమాలో కథా నాయకుడు. అది కుదరదు, కనీసం తన కూతురు పెళ్ళికయినా ఒక పట్టు చీర ఇవ్వాలని తపన పడుతూ ఉంటాడు, ఆ తపననే మనకి దర్శకుడు ప్రియదర్శన్ కాంచీవరం రూపంలో అందించాడు.
  
కథ:
కంచిలో ఒక ఆసామి ఊరిలోని నేతగాళ్ళకి పట్టు ఇచ్చి చీరలు నేపిస్తూ ఉంటాడు. నేసిన చీరలని ఎక్కువ డబ్బులకి అమ్ముకుంటూ నేతగాళ్ళకి తక్కువ కూలీ డబ్బులు ఇస్తూ ఉంటాడు. నేతగాళ్ళు పట్టు దొంగిలిస్తున్నారనే నెపంతో అందరినీ గుడి ఆవరణలో కూర్చోపెట్టి నేపిస్తూ ఉంటాడు. ఆ ఊరికి ఒక కమ్యూనిస్ట్ వచ్చి వాళ్ళతో ఉండి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేస్తాడు.

వెంగడం (ప్రకాష్ రాజ్) కి కంచిలో మంచి పేరు మోసిన నేతగాడని పేరు. తను పెళ్ళానికి పట్టుచీర కట్టి ఊరికి తీసుకువస్తానని చెప్పి ఉంటాడు, కానీ డబ్బులు సరిపోక నూలు చీరలోనే అన్నం (శ్రేయ రెడ్డి)ని ఇంటికి తీసుకు వస్తాడు. కూతురు పుట్టిన సందర్భంలో మళ్ళీ ఇంకో ప్రగల్భం పలుకుతాడు. కూతురు పెళ్ళికి పట్టుచీర పెడతానని అంటాడు. వెంగడం అనుకున్న ప్రకారం కూతురు పెళ్ళికి పట్టుచీర పెట్టాడా? కంచిలో నేతగాళ్ళ పరిస్థితులు ఎలా మెరుగయ్యాయో తెలుసుకోవాలంటే ఈ సినిమాని మీరు తప్పక చూడాల్సిందే. 

ఈ సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. దానితో పాటూ ప్రకాష్ రాజ్ కి ఉత్తమ నటుడు అవార్డు కూడా లభించింది. వెంగడంగా ప్రకాష్ రాజ్ నటన అద్భుతం. సినిమా అంతా తన నెత్తి మీద పెట్టుకుని నడిపిస్తాడు. జైలు నుండి బస్సులో కంచికి వెళ్తుండగా సినిమా అంతా ఫ్లాష్ బాక్ లో చెప్తూ ఉండడం చాలా బాగా ఉంది. మంచి ఎడిటింగ్ వర్క్ చేసారు ఇక్కడ. బస్సులో ఉన్నంతసేపూ ప్రకాష్ రాజ్ నటన కూడా చాలా బాగుంటుంది. ఇంటికి చేరుకోవాలన్న ఆదుర్దా అతని కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది.

శ్రేయరెడ్డి నటన కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు వెయ్యిళ్ అన్న సినిమాలో కూడా ఈమెకి పల్లెట్టూరి పిల్ల పాత్రే. ఆమె రంగుకి, రూపానికీ ఈ పాత్ర సరిగ్గా సరిపోయింది. శ్రేయ నటన కూడా బాగుంది. కూతురు కోసం దాచి పెట్టిన డబ్బులు ఆడపడుచు కాపురం కోసం వాడేసినపుడు పడే బాధని కళ్ళలో బాగా చూపించింది. సినిమాలోకంతా నాకు ఈ సీన్ చాలా బాగా నచ్చింది. హుండీలో దాచుకున్న డబ్బులు తీసుకొని ప్రకాష్ రాజ్ బయటకు వస్తూ ఉంటే గడపలో శ్రేయ కనిపిస్తుంది. ఇద్దరి మధ్య మాటలు ఉండవు, కానీ ఉయ్యాలలో పడుకున్న పాప అసహనంగా కదిలి ఏడుస్తుంది. 

సినిమాలో చెప్పుకోవలసిన ఇంకొక విషయం సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి పని చేసిన తిరునావుక్కరసు ఇంతకు ముందు పీ.సీ.శ్రీరాం కి పని చేసేవాడట. ప్రియదర్శన్ తో కూడా కలిసి చాలా హిందీ సినిమాలకి చేసాడు. 1940 నాటి కాలం మనుషులు, బస్సులు, కార్లు, ఇల్లు ఇవన్నీ చాలా అందంగా తయారు చేసారు. దీనిలో కళా దర్శకుడి పాత్ర కూడా చాలా వరకు ఉంటుందనుకుంటా.

ప్రియదర్శన్ సినిమాలలో ఇదొక ప్రత్యేక చిత్రంగా ఉంటుందేమో! ఇతను తీసిన ఇంకో  సీరియస్ సినిమా కాలా-పానీ. హిందీలో ఎక్కువగా కామెడీ సినిమాలు బాగా తీస్తాడు. డోలీ సజాకె రఖ్నా సినిమాని కొంచెం సున్నితంగా, చాలా బాగా తీసాడు. అటు హాస్యం, ఎమోషన్ సినిమాలని బాగనే బాలన్స్ చేస్తూ వస్తున్నాడు. కంచి గురించి మనందరికీ తెలుసుకానీ దాని చరిత్రని మన ముందుకు తీసుకువచ్చినందుకు ప్రియదర్శన్ ని అభినందించాల్సిందే!  

1948 తరువాత కమ్యూనిస్ట్ విప్లవం వచ్చి నేతగాళ్ళందరూ సహకార సంఘాలు స్థాపించుకుని బాగు పడ్డారు. నాకు తెలిసి వెంకటగిరిలో ఇటువంటి సహకార సంఘాలు ఉన్నాయి. వ్యాపారపరంగా లాభాలలో ఉన్నటువంటి కంచి సహకార సంఘాలు మిగతా నేతగాళ్ళకి మార్గదర్శకం కావాలి.

No comments: