Tuesday, November 15, 2011

హర హర మహాదేవ!నా బ్లాగు పేరు చూసి మీలో చాలామందికి మా ఊరు శ్రీకాళహస్తి అని తెలుసు అనుకుంటా. తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తాను "అవునండీ! మా ఊరు శ్రీకాళహస్తి". కాళహస్తిలో అద్భుతమయిన శివుడి గుడి ఉంటుంది. మా కాలాస్త్రిలో ఉన్న మేమంతా కైలాసంలో ఉన్నామన్న ఫీలింగులో జీవిస్తూ ఉంటాము.

నేను పెద్ద శివ భక్తుడిని కాదేమో అని నేననుకుంటూ ఉండేవాడిని. ఈమధ్య వరకూ ఈ విషయం నాకు తెలియలేదు. అసలు మన గురించి మనకెందుకు తెలియదో నాకెప్పుడూ అర్ధం కాదు. ఎప్పటికప్పుడు మన గురించి మనం తెలుసుకోవలసిందేనా? మన మోహన్ బాబు గారు చెప్పినట్టు "అయ్యా..మీరొక పుస్తకం వెయ్యండి. వీటి గురించి తెలియజేస్తూ ఈ పని చేస్తే వాళ్ళు వీళ్ళు. ఆ పని చేస్తే వీళ్ళు వాళ్ళు! ఆ పుస్తకం మీరు అచ్చు వెయ్యండి. అపుడు అందరికీ తెలుస్తుంది". మన గురించి ఒక పుస్తకం అచ్చు వేసేస్తే దాని ప్రకారం మన పని మనం చేసుకోవచ్చు. అసలు మన పని ఏమిటో తెలిసొచ్చే సమయానికి వయసు కాస్తా హుళక్కి అవుతుంది. ఇపుడు కూడా చూసారా? అసలు విషయం వదిలేసి నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను. విషయం వదిలేసి వేరే మాట్లాడడం కూడా మంచి సరదాగా ఉంటుంది. అది వేరే విషయం!

ఈ శివ దీక్షని నేను ఎప్పటి నుండి చేస్తున్నానో నాకు సరిగ్గా గుర్తు లేదు. కాకపోతే చేస్తున్నాను అని మాత్రం తెలుసు. అందరి భక్తులలాగే నేనూ తెల్లవారక ముందే నిద్ర లేచి కాలకృత్యాలు ముగించి ఈ దీక్షని మొదలుపెట్టను. అసలు ఈ దీక్ష నేనెపుడు మొదలుపెడతానో నాకే తెలియదు. నాకు తెలియకుండానే "చట్టం, తన పని తాను చేసుకు పోతుంది" అన్నట్టు నా దీక్ష సాగిపోతుంది.

నేను ఈమధ్య కాలంలో రేడియో జాకీనయ్యాను కాబట్టి సమయానికి తగ్గట్టు ఒక పాట కూడా వేసుకుందాం. ఒక్కడు సినిమాలో మణిశర్మగారి సంగీతం నుండి మన మహేష్ పాట "సాహసం...శ్వాసగా...అబ్బ..సాగిపో సోదరా..." మీ కోసం...పాట ఎంజాయ్ చేసారు కదా! మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను డ్రైవింగ్ చేసేటపుడు దీక్షలో ఉండను. వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే మాత్రం నేను సందు చూసుకుని తపోదీక్షలోకి వెళ్ళిపోతాను. నేను కార్ పూలింగ్ చేసేటపుడు నాతో పాటూ ఇంకో పూలబ్బాయ్ కూడా దీక్షలో ఉండేవాడు. ఇలా సామూహిక దీక్షలో కూడా నాకు, మాకు అనుభవం ఉంది. మా దీక్షని భంగం చెయ్యడానికి రంభ, ఊర్వశీ దిగి రానక్కరలేదు. గమ్యం (క్రిష్ ది కాదు) వస్తే చాలు, మేమే లేచి కూర్చుకుంటాం. దీక్షలో నుండి బయటకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి తోడూ కొంచెం అలసట కూడా ఉంటుంది, ఎందుకంటే దీక్ష అన్నపుడు బాగా ఏకాగ్రత కూడా అవసరం కదా.


నేను దీక్షలో ఉన్నపుడు మా ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టదు. "మా ఆయన బంగారం, ముద్దుగా దీక్ష చేసుకుంటున్నాడు" అని మురిసిపోతూ ఉంటుంది. మా కాలాస్త్రికి వెళ్ళినపుడు కూడా మా వాళ్ళందరూ "అబ్బా..మా వాడు చూసారా? ఎంత భక్తి! భక్త కన్నప్ప మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది" అని నా గురించి చుట్టుపక్కల తెగ చెప్పేస్తూ ఉంటారు. నా దీక్షలో ఎదో తెలియని శక్తి ఉంది. దీక్షలో ఉన్న నన్ను చాలా సార్లు నా స్నేహితుడు గమనిస్తూ ఉండేవాడు. అతనికి తెలియకుండానే అతను కూడా దీక్షలోకి వెళ్ళిపోతున్నాడని ఈమధ్యనే తెలిసింది.


కాకపోతే నన్ను కొత్తగా చూసేవాళ్ళే అయోమయంలో పడిపోతున్నారు. 


ఏమిటితను, ఇలా నోరు తెరుచుకుని "గుర..గుర" అంటున్నాడూ అని! 


"అబ్బా..అది గుర గుర కాదండీ! హర..హర..." అని నేను సర్ది చెప్పాల్సి వస్తుంది. ఏమిటో ఈ మనుషులు, అర్ధం చేసుకోరూ?


9 comments:

teresa said...

మీ ఆవిడ మురుసుకుంటున్నారుగా, ఇంక ఎవరేమనుకున్నా ఫర్లేదులెండి :)

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

అన్నా, మాది గూడా కాళాస్త్రే...
ఒక చిన్న డౌటు... మన ప్రాంతంలో నిరక్షరాస్యులు కూడా ల, ళ ఖచ్చితంగా పలకడం నేను గమనించాను. మీరు మీ బ్లాగుకి కాళాస్త్రి అని పెట్టుంటే బాగుంటాదేమో?

శశి కళ said...

abbo kaalaastrollandaru oka daggara
cherutunnaru...naidupeta vaallani raanistaaraa...nice post

శ్రీ said...

తెరెసా గారూ, ఏదో సర్దుకు పోతూ ఉన్నామండీ...

శ్రీ said...

హల్లో రవి, నువ్వు చెప్పింది నిజమే...నేను ళా విషయంలో పొరపాటు పడ్డాను.

శ్రీ said...

శశికళ గారూ, మన కాలాస్త్రి,నాయుడుపేట,సూళ్ళూరుపేట,నెల్లూరు...మనమంతా ఒక్కటిగా ఉండబళ్ళా?

రసజ్ఞ said...

హమ్మయ్యా శ్రీ గారూ ఇన్నాల్టికి నాకొక విషయం మీద స్పష్టత ఏర్పడింది. ఇన్నాళ్ళూ ఈ కాలాస్త్రి ఎక్కడుందా అనుకునేదానిని. శ్రీకాళహస్తిని ఇలా అంటారనమాట!

శ్రీ said...

వాడుకలో మా ఊరిని అలా పిలుస్తారనమాట...

Krish said...

""కాలాస్త్రి,నాయుడుపేట,సూళ్ళూరుపేట,నెల్లూరు...మనమంతా ఒక్కటిగా ఉండబళ్ళా?""

-ఉండబళ్ళా!