Tuesday, October 4, 2011

Clash (2009) - వియత్నాం పులిహోర!




నాకు ఎక్కువగా డ్రామా సినిమాలు ఇష్టం. సినిమా స్లోగా నడిచినా సీనులో లోతు ఉండాలి నాకు, అలాగని నేను గజ ఈతగాడిని కాదు. కాకపోతే గజం మాత్రం ఈదగలను. యాక్షన్ సినిమాలు కూడా చూస్తూ ఉంటాను. చాలా రోజుల నుండీ ఈ సినిమా నన్ను ఆకర్షించాలని తెగ ప్రయత్నిస్తూ ఉంది. ఒక శుభ ముహూర్తం రోజు ఈ సినిమా కూడా చూసేసా.

సినిమా మొదలయిన అయిదు నిముషాలకి ఒక సీను చూసేసరికి నాకు సినిమాలో సరుకు అర్ధమయిపోయింది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు, అలాగే మంచి సినిమానో కాదో తెలుసుకోవడానికి ఒక చిన్న సీన్ చాలు. ఆ సీన్ మీకు ఇపుడు చెప్తాను ఉండండి.


**************

ఒక ఫైటింగులో తల్లీ, కూతురు ఒకరినొకరు చంపుకుంటారు. వాళ్ళ శవాలని చూసి కథానాయిక ఇలా అంటుంది.

కథానాయిక: వీళ్ళిద్దరూ తల్లీ, కూతుళ్ళు.

ప్రతినాయకుడు: తల్లీ, కూతురు. కమాండర్, రథం, సైనికుడు, ఏనుగు. తేడా ఏముంది?
**************

ప్రస్థానం సినిమాలో లాగా ఇక్కడ అందరూ పాత్రలే! 

సినిమా కథలోకి వస్తే కథానాయిక తాన్ వాన్ కూతురుని అడ్డం పెట్టుకుని ప్రతి నాయకుడు హుయాంగ్ ఫుక్ ఆమెకి ఒక పని అప్పగిస్తాడు. పని పూర్తి చేస్తే కూతురుని చేతికిస్తానని చెప్తాడు. తాన్ వాన్ పని కోసం ఒక టీం చేసుకుంటుంది. ఈ టీములో మన నాయకుడు హ్యూ హైన్ ఉంటాడు, నిదానంగా తాన్ వాన్ హీరోతో ప్రేమలో పడిపోతుంది. తాన్ వాన్ పని పూర్తి చేయడం స్థూలంగా కథ అనమాట. 

సినిమాలో చెప్పుకోవలసింది ఫైట్లు అన్నమాట. చైనీస్ సినిమాలో ఫైట్స్ మనకి తెలిసిందే కదా, ఈ వియత్నమీస్ సినిమాలో పాత, కొత్త మార్షల్ ఆర్ట్స్ మిక్స్ చేసి చూపించారు అని నాకు అనిపించింది. వియత్నమీస్ భోజనం కొంచెం స్పైసీగా ఉంటుంది, ఈ సినిమాలో కూడా మన సినిమాలలో ఉండే మసాలా బాగా ఉంది. సంగీతం కూడా మంచి హుషారుగా ఉంటుంది.  

ఈ సినిమాలో థాన్ వాన్ తన టీముకి పేర్లు పెట్టే సీన్ రోనిన్, రిజర్వాయర్ డాగ్స్ సినిమాలోది. చెయ్యబోయే పని ముందు స్కెచ్ గీసుకోవడం మళ్ళీ రోనిన్ లాగే ఉంది. ఇక విలన్, హీరోయిన్ని బ్లాక్ మెయిల్ చెయ్యడం కిల్ బిల్ సినిమా నుండి తీసుకున్నాడు. అన్ని సినిమాలు కలిపి మంచి పులిహోరా తినిపించాడు.


హీరో, హీరోయిన్ ఇద్దరూ ఫైటింగ్ లో బాగా ఆరితేరినట్టున్నారు, చాలా బాగా ఉంటాయి వీళ్ళ ఫైట్ సీన్స్. విలన్ కూడా కోట లాగా చేతులు ముడుచుకునే టైపు కాదు, వాడు కూడా చొక్కా విప్పి ఫైట్ చెయ్యడమే! హీరోని రెండు సెకన్లలో కింద పడగొట్టి తొడ కొడుతాడు (కొట్టలేదు ). సినిమాలో మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి.


తోటకూర, అక్కూర లాంటి సినిమాలు చూస్తూ మధ్యలో ఇలా మసాలా సినిమా చుస్తే అదొక తుత్తి!

2 comments:

గీతాచార్య said...

"నేను గజ ఈతగాడిని కాదు. కాకపోతే గజం మాత్రం ఈదగలను"

SCREAM! :D (అనగా కేక అని కహృ)
CRY! :D (అనగా కెవ్వ్)

శ్రీ said...

హహహ...