మున్నా భాయ్ M.B.B.S, లగే రహో మున్నా భాయ్ సినిమాలలో బోమన్ ఇరాని పాత్ర తీసుకుని ఆ పాత్రకి కొడుకుగా షర్మాన్ జోషిగా మార్చి తండ్రి, కొడుకు ఇంకా మనవడి మీద నడిచే కథ ఈ ఫెర్రారీ కీ సవారీ. షర్మాన్ జోషి ఇంతకు ముందు 3 ఇడియట్స్, రంగ్ దే బసంతి సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. బోమన్ ఇరాని గురించి మనకి తెలిసిందే. మున్నా భాయ్ M.B.B.S, లగే రహో మున్నా భాయ్ సినిమాలు నిర్మించిన నిర్మాతే, విధు వినోద్ చోప్రా ఈ సినిమా కూడా నిర్మించడం జరిగింది.
సినిమా కథ లోకి వస్తే రూసీ (షర్మాన్ జోషి) ఒక చిన్న ప్రభుత్వోద్యోగి. తన జీతంతో తండ్రిని (బోమన్ ఇరానీ) పోషిస్తూ, కొడుకు అయిన కాయోని (రిత్విక్ సాహోరే) ని చదివిస్తూ ఉంటాడు. కాయో అద్భుతమయిన క్రికెట్ ప్లేయర్. బాట్ పట్టుకున్నాడంటే చార్లు, చెక్కలే! రూసీ కొడుకు ఆట మెరుగుపడడం కోసం తన శాయశక్తులా ప్రత్నిస్తూ ఉంటాడు.
కాయోకి లండన్లోని లార్డ్స్ లో ఆడే అవకాశం వస్తుంది. కానీ కాయో లండన్ వెళ్ళాలంటే డబ్బు కావాలి, అంత డబ్బు రూసీ దగ్గర ఉండదు. రూసీ నీతికి, నిజాయితీకి పెట్టిన పేరు. ఇంత డబ్బు ఎలా సంపాదించాలా అని అలోచిస్తూ ఉండగా ఇతనికి దీదీ తగులుతుంది. ముంబైలోని ఒక కార్పోరేటర్ కొడుకు పెళ్ళికి కొన్ని గంటలు ఫెర్రారీ అద్దెకి తీసుకు వస్తే నీకు కావలసిన డబ్బు నేనిస్తాను అని దీదీ అంటుంది. ముంబయ్ లో ఉన్న ఒకే ఒక ఫెర్రారీ సచిన్ టెండూల్కర్ దగ్గర ఉంటుంది. రూసీ సచిన్ దగ్గర నుండి ఫెర్రారీ ఎలా తీసుకు వస్తాడు? కాయోని లండన్ కి ఎలా పంపుతాడు ? అన్నదే సినిమా.
మున్నా భాయ్ సినిమాల లాగే ఈ సినిమాలో కూడా అదే అదే రకమయిన అనుభీతి ప్రవహిస్తూ ఉంటుంది.సంతోషం, బాధలని తిప్పించి, మళ్ళించి మన మొహాన కళ్ళాపి జల్లుతుంది ఈ సినిమా. తల్లి లేని కాయోని జాగ్రత్తగా చూసుకోవాలని రూసీ పడే ఆరాటం ఈ ఫాదర్స్ డేకి ఒక మంచి సినిమాగా మిగులుతుంది. ఈ అనుభూతుల మధ్య ఆట విడుపుగా కార్పోరేటర్, అతని కొడుకు కొంత కామెడీని పండిస్తారు. అలాగే దీదీది కూడా మంచి పాత్రే.
మారారే సిక్సర్, మారారే ఫోర్...పాట బాగుంటుంది. ఇక సినిమాలో ఐటం సాంగ్ వేసిన విద్యా బాలన్ గురించి చెప్పాల్సిందే. మలా జావ్ దే అంటూ విద్యా బాలన్ వేసే స్టెప్పులు మంచి ఊపునిస్తాయి.ఇంతకీ మలా జావ్ దే అంటే మరాఠీలో "నన్ను వెళ్ళనీ" అన్నమాట. ఎక్కడికీ అంటే పెళ్ళికొడుకు అప్పటికే ఫెర్రారీలో కూర్చుని ఉంటాడు, సవారీకి వెళ్ళడానికి.
No comments:
Post a Comment