ఈమధ్య కాలంలో తెలుగు సినిమా చూస్తున్నపుడు ఒక ప్రేక్షకుడిగా ఇంతకు ముందు ఉన్న అనుభూతి కలగడం లేదు. నా పిచ్చి కానీ తెలుగు సినిమా ఏమన్నా త్రీ రోజెస్ టీ నా? చివరి సిప్పు వరకు అదే అనుభూతి పొందడానికి? ఇంతకు ముందు అందరిలా తెలుగు సినిమాని ఆస్వాదించినవాడిని ఇపుడు ఎందుకు సినిమా చూడగానే తొక్కలో ఫీలింగు కలుగుతుంది. హిట్టయిన సినిమా కూడా, అంటే దూకుడు, గబ్బర్ సింగ్ తీసుకుంటే వీటిలో కూడా ఏముంది ఉట్టి మసాలానే కదా! ఈమధ్య జీ.ఎం డైటు చేసిన దాని వలన నాకు మసాలా మీద మోజు తగ్గిందా? ఈ వెగటుకి నాకు తెలిసిన కొన్ని కారణాలు చెప్తాను.
మొదటి కారణం: వయస్సు
నేను ఎపుడూ సంతూర్ సోపునే వాడుతాను, అయినా నా వయస్సు నాకు తెలిసిపోతోంది. తల జుట్టు కూడా మిల్కీ బ్యూటీ తమన్నా లాగా తెల్లగా తయారవుతోంది. మా ఆవిడతో పాటూ నేను కూడా ఇక తలకు రంగు వేసుకోవాలేమో! చిన్నపుడు సినిమాలో ఎన్ని ఫైట్లు ఉంటే అంత బాగుంటుంది సినిమా అనుకునేవాడిని. సంతూరుతో ఒళ్ళు రుద్దిన కొన్ని రోజులకి స్టెప్పుల మీద చూపు మళ్ళింది. బాగా స్టెప్పులు ఉన్న సినిమాలు బాగా చూసేవాడిని. చిన్నపుడు తెలుగు నవలలు బాగా చదివేవాడిని. తెలుగు సినిమా చూస్తున్నపుడు సినిమాలో కథ ఉందా? అని ఎపుడూ నన్ను నేను ప్రశ్నించుకోలేదు. మైసూర్ బోండాలో మైసూరు ఉంటుందా? పులిహోరాలో పులి తిరుగుతుందా? తెలుగు సినిమాలో కథ ఏమిటి? అని ఫైట్లు, స్టెప్పులు చూసి చప్పట్లు కొట్టేవాడిని.యుక్త వయస్సు వచ్చేసరికి డబల్ మీనింగ్ డైలాగులు అర్ధమవడం మొదలుపెట్టాయి. అప్పటికే సినిమాలు అలాగ తగలడ్డాయో, లేక నాలాంటి వాళ్ళ కోసమే అలాగయిందో? ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
రెండవ కారణం: పర భాష సినిమాలతో పరిచయం
దూరదర్శన్ పుణ్యమా అని మధ్యాహ్నం పరభాషా సినిమాల దర్శనం కలిగింది. నిద్ర రాని రోజులు ఆ సినిమాలు చూసి ఆనందం వేసింది. బాగా గుర్తు ఉన్న సినిమా పిరవి (మళయాళం సినిమా) . ఇందులో ఒక ముసలాయన తెల్లవారు ఝామున స్నానం చేసి బస్టాండుకి వెళ్ళి కూచుని చీకటి పడగానే ఇంటికి వస్తుంటాడు. సినిమా అంతా ఇదే సీన్ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా గురించి ఒక పూర్తి సమీక్ష రాస్తాను, నా తదుపరి టపా అదే అని మీకు హామీ ఇస్తున్నాను. ఈ సినిమా చూసాక ఏదో బాధ, ఒక మంచి సినిమా చూసానన్న ఆనందం. మన కె.విశ్వనాధం బాబాయ్ గారి సినిమా చూసిన తృప్తి కలిగింది. అలా ఆదివారం మధ్యాహ్నం కోడి అరిగే, అరగని సమయంలో ఈ పరభాష సినిమాలు చూసే వాడిని. మన తెలుగు సినిమాలు ఇలా ఎందుకు ఉండవు? అని ఎపుడూ ఫీలవలేదు. ఎందుకంటే నా పక్కమేటు, రూం మేటు బాగా కష్టపడి చదివేవాడు. అతను బాగా చదువుతాడు, నేను కూడా అతనిలా ఉండాలని ఎపుడూ అనుకోలేదు. నేను, రవిరేజా మేమింతే అనుకుని దుప్పటి వేసుకుని పెందళాడే పడుకునేవాడిని.
మూడవ కారణం: విదేశీ సినిమాలు
విదేశీ భాష కూడా పర భాష కిందకే వస్తుంది, రెండవ కారణం కిందే వ్రాయడం ఎందుకూ? మూడోది కూడా వ్రాస్తే మార్కులు ఎక్కువ పడుతాయి కదా? చిన్నపుడు కొన్ని ఇంగ్లీష్ సినిమాలు నాన్నతో కలిసి చూసాను. వీటిలో ఎక్కువ చిన్న పిల్లల సినిమాలు, లేకపోతే తమాషా సినిమాలు! హైస్కూలు దాటాక కజినుతో పాటూ సైకిల్లో మూలాపేట నుండి కనక మహలు వరకు వెళ్ళి అక్కడ కొన్ని బాండ్ సినిమాలు చూసాను. తర్వాత లీలామహలులో సీజన్ టిక్కెట్టు తీసుకుని చాలా సినిమాలే చూసాను. హాలీవుడ్ సినిమాలకి మన సినిమాలని ఎపుడూ కంపేర్ చెయ్యలేదు, ఎందుకంటే నాకు విషయం అప్పటికే అర్ధమయింది కాబట్టి. ఎంత చెట్టుకి అంత గాలి! ఎంత మైనుకి అంత జనార్ధన రెడ్డి!!
నాలుగో కారణం: ????
ఇంకా చాలా కారణాలు ఉండచ్చేమో? అంధ్రావాలాలో జూ. ఎంటీఆర్ లాగా నాకు కూడా నాలుగో కారణం గుర్తుకు రావడం లేదు. ఇవన్నీ పరిశీలించాక నాకొక విషయం అర్ధమయింది. రామారావు పొయ్యాడు, బాలయ్య పోబోతున్నాడు. చిరు ఇంటికెళ్ళాడు, రాం చరణ్ ట్రై చేస్తున్నాడు. నాగ చైతన్య వచ్చాడు, అఖిల్ కూడా వస్తాడు. వెంకటేషుకి వయసొచ్చింది, రాణాకి కండలొచ్చాయి. ఇన్ని జరిగినా మోహన్ బాబులాగా తెలుగు సినిమా మారలేదు, అలాగే ఉంది. చినిగి పోయిన అయిదు రూపాయల నోటు మారినట్లే నేను మారాను.
నాకు సినిమాలు నచ్చకపోవడం, వెగటు పుట్టడం పక్కన పెడితే అసలు తెలుగు సినిమాకి అపుడూ, ఇపుడూ ఉన్న అభిమానులు ఎవరు?
ఎవరు అసలు, సిసలు ప్రేక్షకులు?
వేచి చూడండి, ఇంకొక టపాలో ఆ ప్రేక్షకుల గురించి మాట్లాడుకుందాము.
14 comments:
Simply Superb....
Thanks Vamsi
చక్కగా రాసారు.. హాయిగా నవ్వుకోనేట్టుగా... అభినందనలు
థాంక్స్ అండి!
మన తెలుగు సినిమా దరిద్రం గురించి అద్భుతంగా వివరించారు. ఇంచుమించు నేను కూడా ఈ లాగా ఫీల్ అవుతున్న మీ రోజుల్లో దూరదర్శన్ ఐనా దిక్కు ఉంది :)
సెటైర్స్ అదిరి పోయాయి మాస్టారు.
సూపర్. కామెడీ కూడా చింపెసారు.
థాంక్స్ రవితేజా! దూరదర్శన్ ఇపుడు లేదా?
థాంక్స్ కృష్ణ!
Brilliant!
అది ఎంటి అండి మీ అబ్బాయి ని ఎ హృతిక్ రోషన్ లాగ స్టయిల్ గా లేడు... రణ్ భీర్ కపూర్ లాగ అందం గా లేడు అని తిట్టి పొస్తారా? ఎలా ఉన్న మన అబ్బాయి అని సర్దుకుపొతారు కదా.. మరి మన సినిమాకి ఎందుకు వర్తించదు. ఎలా ఉన్న అది మన తెలుగు సినిమా పక్క వారితో పోల్చి చూడటం ఎందుకు అంటారు
నేను సర్దుకుపోయే రకం కాదండి! I want more!!
:-)
మరి హర హర మహదేవా అనే పోస్ట్ లొ "తెరెసా గారూ, ఏదో సర్దుకు పోతూ ఉన్నామండీ..." అని కామెంటారు
నేను మార్గదర్శిలో చేరానండీ! ఈమద్య కొంచెం మారాను.Anyway, good catch!
Post a Comment