ఈ సినిమాలో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్. హీరోయిన్ తమన్నా. విలన్లుగా కోట, ప్రకాష్ రాజ్ మరియు తనికెళ్ళ భరణి. ఇక హాస్య బృందం బ్రహ్మానందం, ఆలీ. తెర వెనక సంగీత దర్శకుడు మణిశర్మ, సినిమాటోగ్రఫీ శ్యాం.కె.నాయుడు. నిర్మాత డానయ్య. దర్శకుడు: పూరీ జగన్నాధ్. ఈమధ్య సినిమాలు చాలా తీసేస్తున్నాడు. మొన్న మహేష్, ఇపుడు పవన్! పెద్ద హీరోలని బెట్టి బాగనే ప్లాన్ చేస్తున్నాడు. పెద్ద హీరోల ఇమేజుకి తగిన కథలు వెతకాలంటే కష్టమే! పూరీ ఈకథని ముందుగా రవితేజా దగ్గరకి తీసుకువెళ్ళాడట. రవి ఈ సినిమాని పవన్ చేస్తే బాగుంటుందని చెప్పాడట.
ముందుగా కథలోకి వెళ్దాం. మన హీరో రాంబాబు (పవన్ కళ్యాన్) ఒక సాధారణ మనిషి, కానీ కొంచెం అసాధారణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఎప్పటిలాగే తిక్క, తిక్కగా కాదు! అందరిలాగే ఇతను రోజూ ఉదయం లేవగానే టీవీ చూస్తాడు. అందరిలాగే ఇతనికీ బ్రేకింగ్ వార్తలు వినగానే కోపం నెత్తికెక్కుతుంది. ఇది అంత తొందరగా తగ్గకుండా ఇతన్ని వీధిన పడేసి సమస్యకి పరిష్కారం చూపుతుంది. ఇతనిలోని ఫైరుని గమనించి ఒక టీవీ చానెలులో కెమెరామెన్నుగా పని చేస్తున్న గంగ (తమన్నా) నెత్తి మీద నీళ్ళు పొయ్యకుండా ఇంకొంచెం కిరసనాయిలు పోద్దామని ఇతన్ని తమ చానెల్ లోకి తీసుకు వెళ్తుంది.
ఒక విలేఖరి హత్య కేసులో మన బద్రి మళ్ళీ నందాతో తలపడుతాడు. ఈసారి నందా పేరు రాణా నాయుడు. ఇతని తండ్రి జవహర్ నాయుడు, ఇంతకు ముందు సీ.ఎం గా పని చేసి ప్రస్తుతం ప్రతిపక్షంలో గోర్లు గిళ్ళుకుంటూ ఉంటాడు. నేను సీ.ఎం అయి చూపిస్తానని రాణా నాయుడు రాంబాబుపై సవాల్ విసురుతాడు. ఈ సవాల్ ఢాం అంటూ పేలిందా? లేక తుస్స్ అంటూ మూలిగిందా? ఇది తెలుసుకోవాలంటే వెండి తెర మీద మీరు చూడాల్సిందే!
ఈ సినిమాలో కూడా గబ్బర్ సింగులో ఉన్న పవర్ అలాగే కంటిన్యూ అయింది. ఆడవాళ్ళ మీద పవర్ స్టార్ పేల్చిన డైలాగులు మహిళాలోకం పెద్దగా హర్షించక పోవచ్చు కానీ పురుష్ మాత్రం చంకలు గుద్దుకోవచ్చు. తమిళ సినిమాలలో బాగా బిజీగా ఉన్న తమన్నా మగరాయుడులాగా కొత్త గెటప్పులో బాగా చేసింది. కాకపోతే ఈపాపని సెకండ్ హాఫులో మనం పెద్దగా చూడం. ఆలీ కామెడీ బాగనే ఉంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిన బ్రహ్మీ చమక్కులు పెద్దగా లేవు. విలనుగా కోట బాగనే ఉన్నాడు కానీ, ప్రకాష్ రాజ్ పాత్రకి పూరీ తగిన న్యాయం చెయ్యలేదు. నందా, బద్రి లెవల్లో సీన్లు ఊహించుకుని ఈ సినిమాకి వెళ్తే మీకు మిగిలేది పగిలిపోయిన పూరీనే!
సినిమాలో అధికారంలో ఉన్న సీ.ఎం చంద్రశేఖర్ రెడ్డి. ప్రతిపక్షంలొ జవహర్ నాయుడు. ఇతని కొడుకు రాణా నాయుడు తదుపరి సీ.ఎం కావాలని ఉబలాట పడుతూ ఉంటాడు. నిజ జీవితంలో ఈ ముగ్గురు పాత్రలని ప్రేక్షకులు బాగనే పోల్చుకోగలరు. ఇందుకు తగిన డైలాగులు కూడా హింట్సుగా మనకి గుర్తు చేస్తూ ఉంటాడు దర్శకుడు. సినిమా అంతా ప్రస్తుతం మన రాష్ట్రంలో కాకిగోలగా తయారయిన మీడియా చుట్టూ తిరుగుతుంది. పూరీ ఒక కర్ర తీసుకుని కొన్ని చానెల్సుకి బాగా వాత పెట్టాడు. మీడియా మీద సెటైర్లతో ఫస్ట్ హాఫు అంతా సందడిగా, సరదాగా సాగుతుంది. సెకండ్ హాఫులో ఈ సరదా కాస్తా సీరియస్ అవుతుంది. క్లైమాక్సు కొంచెం పేలవంగా ఉండడం ఈ సినిమాకి పెద్ద దెబ్బ కొట్టింది. పెద్ద హిట్టు అవదు కానీ ఆవరేజుగా ఉండిపోతుంది.
చివరగా తెలుగు అభిమానులకి ఒక సందేశం. మన తెలుగు ఇదిగో చచ్చిపోయింది, అదిగో చచ్చి పోబోతోంది! అని తెగ దిగులు పడేవాళ్ళకి ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఆంధ్ర దేశంలో తెలుగు మాట్లాడం ఆగిపోయినా తమిళనాడులో,కేరళలో, ముంబాయిలో, పంజాబులో మనం దిగుమతి చేసుకున్న హీరోయిన్లు, విలన్లు మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ మాట్లాడక పోయినా వినగానే మన భాషని గుర్తు పట్టగలరు. మన దేసమే కాకుండా ఉక్రెయిన్, రష్యా, బ్రెజిలులో కూడా మన ఐటం డాన్సర్లు తెలుగు మాట్లాడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమెరికాలో ఎక్కడ చూసినా దేశీలు ఉన్నట్టు తెలుగు సినిమా నిండా పరదేశీలు, పరభాషీయులు మనకి కనిపిస్తూ ఉంటారు, కనిపిస్తూనే ఉంటారు.
గమనిక: ఈ సినిమా రివ్యూ ఫిలిం సర్కిల్ కోసం, నా కోసం, మన కోసం రాసాను.
2 comments:
బావుందండీ మీ రివ్యూ! నేను చూస్తా ఈ వీకెండ్!
చివర్లో తెలుగు మీద చెప్పారే..అవి చాలా స్ఫూర్తి దాయకంగా ఉన్నాయి.(స్ఫూర్తి దాయకం కరెక్టా? స్ఫూర్తి వంతం కరెక్టా ఇంతకి?)
థాంక్స్ అండి. ఏమోనండీ, రెండూ దగ్గరగానే ఉన్నాయి.
Post a Comment