Monday, January 13, 2014

భోగి మంటలు - సరదాగా కాసేపు



ప్రతి సంవత్సరం భోగి పండగ వచ్చిందంటే నేను ముందు చేసే పని అపుడెపుడో (2010) లో నేను స్వయంగా కాలాస్త్రికి వెళ్ళి వేసుకున్న భోగి పండగ తాలూకూ ఫోటో వెతుక్కుని సంవత్సరం మార్చి మళ్ళీ ఈ కొత్త సంవత్సరానికి నా గోడ పైన వేసుకోవడం. దీనితో నా భోగి మంటలు చల్లారిపోతాయ్, తొక్కలోది ఇంతకంటే ఏం చేస్తాం. ప్రతి సంవత్సరం లాగే నా హితులూ, స్నేహితులూ ఈ ఫోటోకు లైకు కొడుతూ నన్ను తృప్తి పరుస్తారు.

"ఇంకొక పది సంవత్సరాలైనా ఇదే ఫోటో పెడుతూనే ఉంటావు!"  అని ఒక స్నేహితుడు కామెంటు.

ఏమో...మళ్ళీ పండగ చేసుకున్నపుడు, కొత్త ఫోటో తీసుకున్నపుడు నా గోడకి మోక్షం వచ్చినపుడు ఆ ముచ్చట కూడా తీరుతుందేమో!

మా సిత్తూరోళ్ళకి ఇంకొక వేడుక ఉంది.. అదేమిటంటే ఉదయాన్నే దోసలు, దాంట్లో పొట్టేలు మాంసం! మాంసం కూరలో దోస తడుస్తుంటే నాకు ఎందుకనో వేటగాడు సినిమాలో "ఆకు చాటు పిందె తడిసే" పాట గుర్తుకు వస్తుంది. తడిసిన దోస, నా సామి రంగా శ్రీదేవి కంటే బాగుంటుంది.

ఇప్పుడొక బేతాళ ప్రశ్న!

"మనిషి జీవితంలో పండగలని ఏ వయస్సులో ఉన్నపుడు బాగా అనుభవిస్తాడు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసీ చెప్పకపోయారంటే మీ తల వెయ్యి ముక్కలవుతుంది".

ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి రవితేజ అవసరం లేదు. ఎందుకంటే ఇది బెజవాడ కాదుగా, ఈ సినిమా కృష్ణా కాదుగా?

పై డవిలాగ్ అర్ధం కాలేదంటే ఈ రెండు సినిమాలు చూడండి.

1) విక్రమార్కుడు
2) కిక్

ఈ బేతాళుడు ఏమిటో ఎపుడూ తలకాయ పగిలిపోతుంది అని బెదిరిస్తూ ఉంటాడు! ఇతనే కాని పదో క్లాసు పరీక్షలకి వచ్చి ఉంటే ఏ ఒక్క పిలకాయకీ తలకాయ మిగిలి ఉండేది కాదనుకుంటా!

అదుగో మీరందరూ ఈపాటికే చేతులెత్తి నానా గొడవ చేస్తున్నట్టున్నారు. ఇంకా పగిలిపోని మీ తలకాయలోని ఆన్సర్ కరెష్ట్ యువర్ ఆనర్.

"బాల్యం"

ప్రతి మనిషి ఆటో రిక్షా జ్ఞాపకాలన్నీ బాల్యంలోనే బాగుంటాయి. తరువాత కాలం గిడిచే కొద్దీ రిక్షాకి టైర్ రొటేషన్, ఆయిల్ చేంజులూ చేపిస్తూ ఉండి మైలేజు పెరిగాక ఇంకేం మిగులుతుంది? అందరూ థార్ ఎడారిలో గుడారాలు కూడా లేని బిడారులుగా మిగిలిపోతాం!


కాబట్టి అందరం మొహం పైన రింగులేసుకుని ఫ్లాష్ బాక్కి వెళ్దాం పదండి. బాక్ గ్రౌండ్ సాంగ్ "గుర్తుకొస్తున్నాయి...అబ్బ...గుర్తుకొస్తున్నాయి" ఏసుకోండి.

 


"ఏమిటి? చాలా రింగులు రావాలే? ఒకటే వచ్చింది? టెక్నికల్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందనుకుంటున్నారా?"

అదేమీ కాదు!

మీకు ఇంకొక బేతాళ ప్రశ్న!

"వేమన క్యా బోలా? అసలు క్యా బోలా అండీ?"

"తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈసారయినా చంద్రబాబుని గిలిపించండి!" అన్నాడా?

"హబ్బా...నేనడిగింది మన తానా సెక్రటరీ సతీష్ వేమన గురించి కాదండీ? మన పాత వేమన! చిన్నపుడు వేమన పద్యాలు చదువుకున్నాం గుర్తు ఉందా?"

"హమ్మయ్యా...ఇప్పటికి గుర్తు వచ్చినట్టుంది! ఇందులో నా తప్పు కూడా ఉంది లేండి. రిక్షావోడు సినిమా మాదిరి ఒక ఫ్లాషు బాకులో ఇంకొక బాకు అంటే మరి ఇలాగే ఉంటుందనుకుంటా".

వేమన పద్యాలలో ఒకటి మీకు గుర్తు చేస్తాను.

గంగి గోవు పాలు గరిటెడైననూ చాలు
కడివిడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ!

వేమన గారు చెప్పినట్టు మనకి చాలా రింగులు అవసరం లేదు. రింగులన్నిటిలోకి మెగా రింగు మన లార్డు ఆఫ్ దా రింగు. అందుకే బడ్జెటుకి కోత వేసి ఒక రింగుతో సరి పెట్టా.

ఇక పులిహారా కబుర్లు ఆపి నా చిన్నపుడు భోగి కబుర్లు చెప్పుకుందాము.

పండగ అంటే చిన్నపుడు కొత్త బట్టలు ఉంటాయి కదా! మా అమ్మ నెల్లూరు కాపు వీధిలో చొక్కా, చెడ్డీలకి సరిపోయే గుడ్డ ముక్కలు తెచ్చేది. నేను ఇంటరు వచ్చే వరకు సెలక్షన్ అంతా మా అమ్మదే! తర్వాత నుండి నేను గుడుంబా శంకరులాగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాను. ఈ పెద్ద పండగ అంటే ముక్కోటికి సినిమాలు వేసినట్టు రెండు,మూడు జతలు బట్టలు కొనేవాళ్ళు. అందుకే ఈ పండగ మనకందరికీ బాగా ఇట్టం అనుకుంటా.

ఇక గుడ్డ ముక్కలు ఇంటికి రాగానే రాపూరులో ఫేమస్ టైలరు దగ్గరికెళ్ళి బాగా షోగ్గా కుట్టమని కొలతలు ఇవ్వడం బాగా గుర్తు. రాపూరు అంతటీకీ ఫేమస్ టైలరు సాయిబు బాగా ఫేమస్. అందరూ చొక్కాలకి గుండీలు పెడితే ఇతను ప్రెస్ బటన్లు పెట్టేవాడు. స్కూలు నుండి ఇంటికి రాగానే చొక్కా ఇప్పెయ్యాలంటే రెండు సెకన్లలో ఇప్పేసేవాడిని.

అసలు చొక్కా ఇప్పే పోటీలు కానీ ఒలింపిక్స్ లో ఉన్నట్లయితే నాదేమిటి, మీ సామి కూడా బిల్లా రంగే! భారతదేశానికి ఆరోజుల్లోనే స్వర్ణ పతకం వచ్చేసి ఉండేది.

ఏరోజుల్లో అంటే నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ మీరు "ఏమిటి, అపుడు పుట్టారా?" అని వెక్కిరిస్తారు.

శ్రీదేవి మదర్ ఛెన్నై నుండి గుంటూరు వెళ్ళేటపుడు గూడూరు రైల్వే స్టేషనులో ఒకసారి ఇలా చెప్పింది.

"అమ్మణ్ణీ...నీ ఎప్పూ నీ వయసు సొల్ల కుడాదూ" అని.

నేను అపుడు పక్క ప్లాటుఫాము మీద సూళ్ళూరుపేట వెళ్ళే పాసెంజరులో చెనక్కాయలు తింటూ ఈ మాటలు వినేసా.

ఇక చూస్కోండి, ఇప్పటి వరకూ ఎవరికీ సొల్లలా....మీరు కూడా యారికీ సొల్లమాట్టా? వాకే?

బట్టల గొడవ అయిపోతే భోగికి కావాల్సిన సామాను. టెక్సాసులో హిల్ కంట్రీ ఉన్నట్టే రాపూరుకి కూడా ఉండేది. నెల్లూరు, కడప జిల్లా సరిహద్దులో హిల్ కంట్రీ ఉళ్ళా? హిల్లంతా తుమ్మ చెట్లే కదా! మద్దూరు పల్లి నుండి మాకు రెండు మోపులు వచ్చేవి.

మద్దూరుపల్లెలో కుక్కల రెడ్డి ఉండేవాడు. ఆయన్ని పెట్రొమాక్స్ లైట్లేసుకొచ్చి మరీ నక్సలైట్లు చంపేసారు. ఆయన మూడో పెళ్ళాం మాత్రం ఉండేది కోటలో. ఇది నిజంగా కోటే! పల్లెటూరులో ఒక ఇంద్ర భవనం ఉండేది! ఈ ఇంట్లో ముప్పై, నలభై కుక్కలు ఉండేవి. ఈ ఇంటి నుంచే మేము ఒక వేట జాతి అయిన జోనంగి జాతికి చెందిన కుక్కని తెచ్చుకున్నాం తర్వాత రోజుల్లో.

నల్లగా ఉండే ఆ కుక్కకి బ్లాకీ అని పేరు పెట్టుకున్నాం. ఎవరికీ చెప్పబాకండి నాయనా! తెలీని వయసులో ఆ పేరు పెట్టా. ఇపుడీ విషయం బయటకి పొక్కిందంటే మళ్ళీ CNN, TV9 గలభా,గలభా చేసిపారి నూకతాయ్.

"ఏదో పిలకాయ్ మంచోడనుకున్నా, మిడిమాలంగా ఉన్నాడే నా బట్టా!" అని బిడ్డ ఒబామా యాష్ట పోతాడు.

ఇక చాల్లేబ్బా సంబడం. రండి, మళ్ళీ భోగికి వెళ్దాం. నేను పిలిచినప్పుడు రాలేదంటే మళ్ళా ఇన్సెప్షన్ సినిమాలో లాగా నేను పిలిచక రాలెను బాబా....

మద్దూరుపల్లి నుండి తెచ్చిన ఈ మోపులు రెండు, మూడు గంటలు కాలతాయి. మా ఇంట్లో భోగి వేసిన ప్రతిసారీ ఫైర్ ఇంజనులు వచ్చేసేవి.

"ఏందియా...ఇదంతా భోగి కేసిన మంట గదా! నువ్వు యాడికి ఒచ్చేసావా?" అని మా నాయన బలే తిట్టేటోడు.

"ఎట్టా వచ్చారు! మాకు వేడి నీళ్ళు కొన్ని కావాలి" అని చెప్పి కొన్ని నీళ్ళు బైలరులో పోసుకునేవాళ్ళం. మా పక్కిళ్ళు, ఇంకా ఎదురింట్లో వాళ్ళు కూడా ఈ నీళ్ళే వాడేసుకునేవాళ్ళు.

భోగిమంట చెలరేగుతున్న సమయంలోనే మనం అందరికంటే ఫష్టుగా స్నానం చేసి ఫేమస్ మామయ్య కుట్టిన బట్టలేసుకుని మా అమ్మ దోసలు పోసిందా? లేదా? అని వంట గది చుట్టూ మా బ్లాకీ కుక్కలా తిరిగేవాడిని.

దోసలు, మాంసం కూరతో "కూర చాటూ దోస తడిచే" అని ఎంటీవోడు స్టెప్పులేసుకుంటూ మురారి సినిమాలో మహేష్ విలన్లని గోదాట్లో ముంచి, ముంచి కొట్టినట్టు నేను దోసని తిప్పించి, మళ్ళించి పొట్టేలు మాంసంలో ముంచి, ముంచి తినేవాడిని.

"యమగోల సినిమాలో డాన్సులాడేటపుడు ఎంటీవోడు నా దుంప తీసాడు" అని జయప్రద వాపోయిందట.

ఈ విషయం మనసులో చదువుకోండి నాయనలారా! అరిచారంటే గ్రేట్ ఆంధ్రాలో రేపే "సచ్చినోడు, నా దుంప తీసాడు" అని హెడ్డింగ్ పెట్టి మరీ రాస్తాడు. ఆ స్క్రోలింగ్ నొక్కి చూస్తే అసలు విషయం ఏమీ ఉండదు, నిండా మోసం!

అప్పట్లో జయప్రద ఫీల్ అయినట్టు నా దోసకి కూడా ఒక మనసుంటే దాని మనోభావాలు కూడా ఇలాగే దెబ్బ తిని ఉండేవి.

"ఈ సంపు గాడు సంపేస్తున్నడురోయ్..." అని దోశ మనసు విలవిలలాడేది పాపం.

అలా ఉత్తరాయణంలో మా సిత్తూరోళ్ళు దోశలని నేరుగా స్వర్గానికి పంపేవారు,పంపుతున్నారు.

"ఇక్కడ కూడా సీమాంధ్రేనా? మా తెలగాణోళ్ళని రానివ్వరా? మా దోశలకి స్వర్గం చూపరా?" అని అరవబాకండి.

"ఉత్తరాయణంలో మీరు కూడా దోశలు తినండి. పాపం, వాటికి స్వర్గం మస్తు చూపించండి".

ఈ దోశలు తిన్నాక మనం కూడా స్వర్గ ద్వారం అంచులదాకా వెళ్తాం మన జనక్ రాజ్ లాగా. ఒక్క తేపు వచ్చిందంటే చాలు...ఆడ నుండి ఒకేసారి తుపుక్కున కింద పడిపోతాం.

ఇలా దోశల చాప్టరు తర్వాత మనకి రెస్టు. ఓపిక ఉన్నంతసేపు ఊరి మీద పడి ఆడేసుకోవడమే! మధ్యలో ఇంటికొచ్చి అరిసెలు, వడలు, అవి, ఇవి తినడం మళ్ళీ ఎగరడం.

మా అమ్మమ్మ అంటూ ఉండేది "నాయనా, ఒక పక్క కూర్చుని ఆడుకోండిరా...ఊరికే ఆడకీ, ఈడకీ తిరగతా ఉండబాకండి" అని.

మనం యాడబా...ఒకరి మాట వినిందా? ఈ పెళ్ళి అయ్యేవరకూ ఇలా ఒకరి మాట ఇంకొకరు వినాలి అని తెలవలా! ఆరోజు మా అమ్మమ్మ మాట విని ఉంటే ఈరోజు ఇన్ని బొప్పిలు ఉండేవే కాదు. కొంచెం అలవాటయి కొన్ని బొప్పిలన్నా తగ్గేవి!

అవబ్బా, భోగి కబుర్లు! రేపు సంక్రాంతి ఉళ్ళా...మళ్ళీ మీరు రాబళ్ళా?

రేపు కూడా ఇట్టే తమాషా చేసుకుందాం, అట్నేనా? 

5 comments:

Kottapali said...

చించేశారు. కేకంతే!!

శ్రీ said...

ధన్యవాదాలు మాస్టారూ!

kittigaadu said...

chaala rojula tarvaatha manasaara aaswaadinchaanu anubhavinchaanu ikkade hyderabad lo kuurchani. thank you

శ్రీ said...

థాంక్స్ కిట్టిగాడు.

Unknown said...

Shaanaa bagundaadi yaa....ettundadante...ragi sangatilo mukkala pulusu eskuni tinnantha bagundaadi...ittage raayala mari ...untanu yoo