Monday, May 19, 2014

పాకుడు రాళ్ళు - పుస్తక సమీక్ష



డా.రావూరి భరద్వాజ్ గారికి పాకుడురాళ్ళు నవల ద్వారా జ్ణానపీఠ్ అవార్డు లభించిన వార్త రాగానే, నేను అడగకుండానే మా రెండో అక్క విజయవాడలో ఆ పుస్తకం కొనేసి తానా సభలకు వస్తున్న మా బావతో పంపింది. సహజంగానే సినిమాలంటే అందరికీ మోజు,దానితో పాటూ అందాల తారల వ్యక్తిగత జీవితం మీద  రాసిన నవల అనగానే ఆసక్తి కలగడం కూడా సహజమే! ఇంకొక సంగతి ఏమిటంటే నవల అట్ట మీద రావూరి భరద్వాజ గారిని చూసినపుడంతా నాకు శ్రీకాళహస్తిలో మా దూరపు బంధువైనా కానీ మా ఇంటికి దగ్గరలో నివసించిన మా తాత రాఘవులు గారిలా కనిపించేవారు. మా ఉప్పువీధి వారందరూ మా తాత తెల్ల గడ్డం చూసి భీష్ముడు అని పిలుచుకుని మురిసిపోయేవారు.

ఈ పాకుడు రాళ్ళు వంటి సినీ ప్రపంచం నుండి జారి పడి, నేల రాలిన తారలని కాసేపు ఇక్కడ గుర్తు చేసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవడం మనకందరికీ తెలిసిందే! పాకీజా లాంటి అద్భుత కళాఖండంలో నటించిన మీనా కుమారి తాగుడుకి బానిసై చనిపోయింది. మహానటి సావిత్రి కూడా తెరపై మనందరినీ ఆకట్టుకున్నా వ్యక్తిగత జీవితంలో సరైన ప్రేమకు నోచుకోక చిన్న వయసులోనే ఈలోకాన్ని వీడింది. పొట్టేలు పున్నమ్మ, స్వర్గం నరకం లో మనకందరికీ గుర్తుండిన ఫటాఫట్ జయలక్ష్మి కూడా ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకోవడం మనకు ఇంకా గుర్తు. బొబ్బిలి రాజా, ధర్మ క్షేత్రం, అసెంబ్లీ రౌడీ ఇంకా అనేక హిట్ సినిమాలలో నటించిన అందాల తార దివ్య భారతి కూడా చిన్న వయసులోనే నేల రాలింది. తెలుగు, తమిళం, మళయాళం ఇంకా పలు భాషల్లో నటించిన సిల్క్ స్మిత కూడా జీవితంలో ఓడిపోయి చావుకి దగ్గరయింది. పలు ప్రేమ కథా చిత్రాలలో ఘన విజయం సాధించిన లవర్ బాయ్ గా చెప్పుకునే ఉదయ్ కిరణ్ కూడా సినీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకోలేక చాలా చిన్న వయసులోనే జీవితం నుండి నిష్క్రమించాడు. వీకీపీడియాలో చూస్తే ఇలా నేల రాలిన తారలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 మంది ఉన్నారు.

నవల గురించి మాట్లాడుకునే ముందు జ్ణానపీఠ్ అవార్డు గురించి కొంచెం చెప్పుకుందాం. సాహితీరంగంలో అద్భుత క్రిషి చేసిన సాహితీకారులకి లభించే అత్యుతామ పురస్కారం ఈ జ్ణానపీఠ్ అవార్డు. తెలుగు వారిలో మొదటగా ఈ పురస్కారం శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచించిన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారికి 1970లో లభించింది. తరువాత 1988లో విశ్వంభర కావ్య రచయిత డా.సీ.నారాయణరెడ్డి గారికి లభించింది. ఈమధ్యనే 2012లో పాకుడురాళ్ళు నవలా రచయిత డా.రావూరి భరద్వాజ్ గారికి ఈ పురస్కారం దక్కింది.

ఇక నవల గురించి మాట్లాడుకుందాం. మంగమ్మ ఒక రంగస్థల నటి. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్న మంగమ్మను ఆమె విటుడు అయిన చలపతి తను తీస్తున్న సినిమాలో కథానాయకి పాత్ర ఇవ్వగలనని మద్రాసు తీసుకు వస్తాడు. సినిమాలలో చాన్సుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి మంజరిని పెద్ద కథానాయకిని చేస్తాడు. మంగమ్మ కాస్తా మంజరిగా మారి తెలుగు సినీలోకాన్ని రంజింపజేస్తుంది. ఎడా,పెడా సినిమాలతో బాగా డబ్బు సంపాదిస్తూ అదే సమయములో సినీ ప్రపంచంలో తన స్థానం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉన్నా మంజరికి మనశ్శాంతి కరువవుతుంది. సినీరంగంలో ప్రముఖులతో మనస్తాపాలు,సినిమాలకు డబ్బులు పెట్టే లక్షాధికారులు, సినీ దర్శకులు, నిర్మాతలు ఇలా అవసరమున్న వారితో సంబంధాలు పెట్టుకోవడం, తనని సినీ రంగానికి పరిచయం చేసిన చలపతితో రోజువారీ పోట్లాటలు, సినీ పాత్రికేయులని మచ్చిక చేసుకుని తనకి కావసినట్లుగా పత్రికలలో వ్రాయించుకోవడం లాంటి సమస్యలతో మంజరి సతమతమవుతూ ఉంటుంది. ఈ సమస్యల సుడిగుండం నుండి మంజరికి ఎలా విముక్తి కలిగిందో తెలుసుకోవాలంటే పాకుడు రాళ్ళు నవల చదవాల్సిందే!

భరద్వాజ్ గారు ముందుగా ఈ నవలకు పెట్టిన పేరు "మాయ జలతారు". శీలా వీర్రాజు గారు దీనిని పాకుడు రాళ్ళుగా మార్చారట. భరద్వాజ్ గారు సినీ పత్రికలలో పని చేస్తున్నపుడు పరిశ్రమలోని కళాకారుల జీవితాలని దగ్గరగా చూడడం జరిగింది. ఆ అనుభవాలను పాకుడురాళ్ళలో చేర్చడం వలన నవలలో జీవం తొణికిసలాడుతుంది.  మంజరి పాత్ర కూడా తనకు తెలిసిన ఓ చిన్న నటి అని భరద్వాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అమె ఎవరు అన్న విషయం మనకి అనవసరం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ తారను చూసినా ఆమె గతం, ప్రస్తుతం ఈ నవలలోని మంజరి, కళ్యాణి పాత్రలకు దగ్గరగానే ఉంటుంది. నవల చదువుతున్నంత సేపూ మనకి మంజరి జీవితం మీద జాలి కలుగుతూనే ఉంటుంది. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్నా సినిమాలలో ప్రవేశం కోసం చలపతి ఆమెకోసం చాలా తిప్పలు పడుతాడు. పత్రిక విలేఖరులు, సినిమా నిర్మాతలు, పెద్ద హీరోల ఆఫీసులు చూట్టూ తిరగడం, వాళ్ళని మచ్చిక చేసుకోవడం వంటి సంగతులని ఈ నవలలో బాగా చెప్పారు. ఒకసారి అవకాశం వచ్చాక ఏమన్నా జీవితం కుదురుగా ఉంటుందా అంటే అదీ లేదు! పరిశ్రమలో తనకి దొరికిన స్థానన్ని పదిల పరుచుకోవడం కోసం, ఇంకా పెద్ద పేరు తెచ్చుకోవాలన్న ఆశ మంజరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఈ నవలలో భరద్వాజ్ గారు మనకి శర్మ పాత్రలో కనిపిస్తారు. సినీ పత్రికలు వ్యాపార రహస్యాలని ఈ నవలలో మనకి శర్మ గారి ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అపుడపుడూ ఈ సమాచారం అందించే సందర్భం లేకపోయినా పిలవని పేరంటానికి వచ్చిన చుట్టంలా శర్మ గారు నవల మధ్యలో దూరి చిరాకు పెట్టారు. మంగమ్మని మంజరిగా మార్చిన జక్కన్న పాత్రలో చలపతి గారు సినీ రంగాన్ని మనకి పరిచయం చేస్తూ ఉంటారు. మంజరికి సినిమాలలో అవకాశం దొరకడం భలే తమాషాగా జరిగిపోతుంది. ఈ తమాషా చెయ్యడం కోసం చలపతి తిమ్మిని బమ్మి చేస్తాడు. ఈ తతంగం అంతా చదువుతుంటే రాం గోపాల్ వర్మ తన మొదటి సినిమా శివ కోసం ఆడిన నాటకం గుర్తుకు వస్తుంది. మీకు ఆ నాటకం వివరాలు కావాలంటే వర్మ విత్ వోడ్కా చదవండి.

ఇంకో సందర్భంలో అప్పటికే సినిమాలలో రాణించిన మంజరిని సినీ పెద్దలు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతాయి. భరద్వాజ్ గారు భూకైలాస్ చిత్రంలో జమునకి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు గారితో జరిగిన గొడవను వాడుకున్నారని మనకి తెలుస్తుంది. జమున గారు కూడా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు కూడా, కాకపోతే పెద్ద మనుషుల పేర్లు బయట పెట్టలేదు. సహజకవి మా ఎమ్మెస్.రెడ్డి బయటకు రాని తన ఆత్మకథలో ఈ విషయాన్ని బయట పెట్టారు. నవలలో ఈ విషయాలు చదువుతుంటే మనకి అప్పటి రోజులు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు కూడా అటువంటి సంఘటనలు సినీ రంగంలో జరుగుతుండడం సిగ్గుచేటు. ఎలాగయిన సినిమా తియ్యాలని పల్లెటూరు నుండి పొలాలు అన్నీ అమ్మి అది తియ్యలేక అప్పుల పాలవడం, ఆఫీసు మూసేసి వూరెళ్ళిపోవడం చదువుతుంటే కొడవటిగంటి కుటుంబ రావు గారు సినిమాపై రాసిన ఒక కథ మనకు లీలగా కనిపిస్తూ ఉంటుంది.

మంజరి సినిమాలలోకి రాకముందే కళ్యాణి పెద్ద నటి. పూల పానుపు తలపించే ఆమె జీవితంలో చీకటి కోణాలు ఒక్కొక్కటీ ఆవిష్కరిస్తూ ఉంటే అందమయిన గులాబీ మొక్కపై ముళ్ళు మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. చివరికి ఈమెని ఆమె దగ్గరి వాళ్ళే హత్య చేస్తారు. మంజరి హాలీవుడ్ యాత్ర ద్వారా రచయిత పాఠకులకి అంతర్జాతీయ ముచ్చట్లు తెలియజేస్తారు. మంజరి మార్లిన్ మన్రోతో కొద్ది రోజులు గడుపుతుంది. ఆమెతో కబుర్లు మనకి చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళిద్దరినీ ఇలా కలపాలన్న రచయిత ఊహ నిజంగా అద్భుతం. నవల చదవడం పూర్తి అవగానే ఒక మంచి తమిళ సినిమా చూసినట్లు ఏదో బాధ ఇక్కడ అని తెలియని చోటల్లా బాధిస్తుంది.

5 comments:

oremuna said...

http://kinige.com/author/Ravuri+Bharadwaja

Anil Atluri said...

లభించలేదు
డా.రావూరి భరద్వాజ్ గారికి పాకుడురాళ్ళు నవల ద్వారా కేంద్ర సాహిత్య తెలుగు అకాడమీ అవార్డు
వారికి లభించలేదు.

వారి సాహిత్య సేవని గుర్తించి అందజేసిన పురస్కారం
జ్ఞానపీఠం !

శ్రీ said...

పొరపాటయిపోయింది అనిల్ గారు. సరిదిద్దుతాను. మీకు నా ధన్యవాదాలు.

RENUKA AYOLA said...

Bagundi Sameeksha..

శ్రీ said...

Thanks Renuka garu.