Tuesday, November 25, 2014

వడ్ల గింజలు - కథ పరిచయం



వడ్ల గింజలు కథని ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి గారు రచించారు. ఈ కథ 1941 సంవత్సరం ఆంధ్రవారపత్రిక లో ప్రచురించబడింది. శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి కథలు రెండవ సంపుటంలో ఈ కథను మరి కొన్ని మంచి కథలతో పాటూ మళ్ళీ ప్రచురించారు. కథలో వెళ్ళే ముందు రచయిత గురించి తెలుసుకొందాం.

రచయిత పరిచయం
శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు ఏప్రిల్ నాలుగవ తేది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మ శాస్త్రాలను అభ్యసించి అవధానాలు కూడా చేసారు. వీరు పిఠాపురం సంస్థాన కవులు శ్రీ వేంకట రామకృష్ణ కవి గారి శిష్యులు. శ్రీపాద గారు సుమారు 75 కథలు వ్రాసారు. ఇంకా నాటకాలు, రేడియో నాటికలు, నవలలు, పద్య రచనలు కూడా చేసారు. శ్రీపాద గారి సాహిత్య సేవకు 1956 లో కనకాభిషేకం జరిగింది.

కథ
తణుకుకి చెందిన తంగిరాల శంకరప్ప చదరంగంలో దిట్ట. పెద్దాపురం మహరాజు దర్శనం కోసం శంకరప్ప కోటకు చేరుకుంటాడు. పేద బ్రాహ్మడయిన శంకరప్పకి కోటలోకి ప్రవేశం లభించదు. ఠానేదారు, దీవాంజీలు శంకరప్పకి కోటలోకి అనుమతి లభించకుండా అడ్డుపడి వీధిలోకి గెంటేస్తారు. దిగులుతో సత్రానికి చేరుకున్న శంకరప్పని చూసి పేదరాసి పెద్దమ్మ ఓదారుస్తుంది. మహరాజు దర్శనం సంపాదించడానికి ఉపాయం చెప్తుంది. ముందు పట్టణంలో పేరు తెచ్చుకుని తద్వారా మహరాజు దర్శనం సంపాదించమని హితబోధ చేస్తుంది. శంకరప్పకి జ్ఞానోదయం కలిగి ఊరి మీద పడతాడు.

అంచెలంచలుగా పెద్దాపురంలోని చదరంగ ప్రావీణ్యులనందరినీ ఓడించి, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఊరిలో శంకరప్ప పేరు మారు మ్రోగుతుంది. ఈ వార్త చివరికి మహరాజుని చేరి, శంకరప్ప గురించి వాకబు చేస్తాడు. శంకరప్ప చదరంగ ప్రావీణ్యం గురించి తెలుసుకుని తనతో ఆడవలసిందిగా కబురు పంపుతాడు.పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని శంకరప్ప పల్లకీలో కోటకు వెళ్ళి మహరాజుతో చదరంగం ఆడడానికి సిద్ధపడుతాడు. ఆటలో తను గెలిస్తే చదరంగంలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, రెండో గడిలో రెండు వడ్ల గింజలు, మూడో గడిలో నాలుగు వడ్ల గింజలు ఇలా చదరంగంలోని అన్ని గడులలో గింజలు రెట్టింపు చేసుకుంటూ ఇవ్వాలని కోరుతాడు.

చదరంగం ఆటలో మహరాజు శంకరప్పని ఓడించాడా? లేక శంకరప్ప గెలిచి తను కోరుకున్న వడ్లగింజలని రాజు దగ్గర నుండి అందుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే!

శ్రీపాద గారు కథలని నడిపించే విధానం చాలా బాగుంటుంది. మామూలుగా ప్రతి కథలో, నవలలో, నాటికలో రచయిత అపుడపుడూ మన ముందుకు వచ్చి కథ ఉద్దేశం చెప్తూ ఉంటారు. శ్రీపాద గారి కథలలో పాత్రలు మాట్లాడుకుంటూ కథని చెప్తూ ఉంటాయి. మాటలు ఎక్కడా ఆగవు, కథతో పాటూ మాటలు కూడా ఆగుతాయి. ఈ మాటలు కూడా వేగంగా తూటాల్లాగా  పేలుతూ వెళ్ళిపోతాయి.

కథలో శంకరప్ప ప్రధానంగా నాలుగు, అయిదు ఆటలు ఆడుతాడు. ముందుగా వీధి అరుగులో ఆడుకుంటున్న ఒక ఇద్దరు చిన్న తరహా ఆటగాళ్ళయిన శాస్త్రి, యాజులుతో మొదలుపెట్టి చేయి తిరిగిన పోటుగాళ్ళతో ఆడే విధానం శ్రీపాద గారు మనకి కళ్ళకి కట్టినట్టు చెప్తారు. ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళే కొద్దీ ఆట కూడా వారి తరహాలో, వారి అంతస్థుకి తగినట్టు వారి ఇళ్ళు, భవనాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని మనం బాగా దగ్గరగా చూడగలం ఈ కథలో. మూడు, నాలుగు ఎత్తుల్లో ఆట ముగించేసరికి శాస్త్రి, యాజులు శంకరప్పకి ప్రియ శిష్యులయిపోతారు. అప్పటినుండీ చివరివరకు గురువుగారిని అంటిపెట్టుకునే ఉంటారు.

రాజనర్తకి రంగనాయకి తన విటుడుతో ఆడే ఆటలో శంకరప్ప ఇంటి బయట నుండి గోడ చాటుగా వారి మాటలు వింటూ వారి ఆటలో పాల్గొనే సన్నివేశం చాలా ఆసక్తిగా ఉంటుంది. శంకరప్ప ఆటే కాదు, మాటలు కూడా పదునుగా ఉంటాయి. ఈ మాటలు పౌరుషంలో కోటలు దాటే విధంగా ఉంటాయి. దాట్ల అప్పల నరసింహారాజు గారి మేనల్లుడు విజయరామరాజుతో ఆడేముందు అతిథులకి మర్యాదలు, ఆడేటపుడు సపర్యలు అప్పటి కాలం రాచమర్యాదలని మనకి మళ్ళీ గుర్తు చేస్తాయి. ఆటలో శంకరప్ప ఏకాగ్రతకి భంగం కలిగించడానికి అతని పక్కన ఇద్దరు చక్కని చుక్కలని కూర్చుని తాంబూలం అందిస్తూ ఉంటారు. మహరాజుతో ఆడేటపుడు కూడా ఇంకొంచెం పెద్ద మోతాదులో ఈ మర్యాదలు ఉంటాయి. మహారాజుతో ఆట హోరాహోరీగా ఆరు నెలలపాటూ సాగడం, ఆట మధ్యలో వీరిద్దరి సంభాషణ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి.
చివరగా వడ్లగింజల వరం కోరిక చదువుతూ ఉంటే మనకి సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మీనా కోరిక గుర్తుకు వస్తుంది. ఆ కోరికకి స్పూర్తి మన వడ్లగింజలు కథ నుండే అన్నమాట!

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 88వ నెల నెలా తెలుగు వెన్నెల సభలో ఈ కథ సమీక్ష చేసిన నా వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

2 comments:

Kottapali said...

బాగుంది. శ్రీపాదవారిని గురించిన ఉపోద్ఘాతంలో ఒకట్రెండు వాక్యాలు రిపీటయ్యాయి. అసలు ఈ వడ్లగింజల చమత్కారం ఇంకా చాలా పాతది. శంకరప్ప కథకి తగిన ముక్తాయింపుగా శ్రీపాదవారు చమత్కరించారని నా ఉద్దేశం

శ్రీ said...

థాంక్స్ కొత్తపాళీ గారు. వాక్యాలని సవరించాను.