Monday, September 8, 2008

నా నయాగరా పర్యటన - 2

ముందు రోజు రాత్రి తొందరగానే పడుకున్నాం కాబట్టి ఉదయాన్నే లేచి స్నానాలు చేసి హోటల్ లో టిఫిన్ చేసి,కాఫీ తాగి పార్కుకి బయలుదేరాం.మా హోటల్ నుండి పార్కు ఒక మైలు దూరం ఉంటుంది.స్ట్రోలర్ లో దియా(మా అమ్మాయి)ని కూర్చొపెట్టి మిగతా అందరం కాలినడకన బయలుదేరాం.

నయాగరా జలపాతం స్టేట్ పార్కు అమెరికాలో మొదటి పార్కు,దీనిని 1885 లో ఫ్రెడ్రిక్ లా ఒంస్టెడ్ నిర్మించాడు. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కు నిర్మించింది కుడా ఇతనే!నయాగారా జలపాతం రెండు దేశాల మధ్య ఉంటుంది.మనం కెనడా నుండి చూడచ్చు,లేదా అమెరికా నుండి చూడచ్చు.కెనడా నుండి చూడాలంటే తగిన వీసా కుడా కావలసి ఉంటుంది.కెనడా వైపు జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది.

నయాగరా స్టేట్ పార్కులో $30కి డిస్కవరీ పాసు కొనుక్కుని కింద రాసినవన్నీ చూడచ్చు.ఇలా అన్ని చూడడానికి పాసు కొన్నదానివల్ల మనకి $17 వరకు ఆదా!

1) కేవ్ ఆఫ్ ద విండ్స్

2) మైడ్ ఆఫ్ ద మిస్ట్

3) నయాగరా అడ్వెంచర్ థియేటర్
4) నయాగరా గార్జ్ డిస్కవరీ సెంటర్

5) ఆక్వేరియం ఆఫ్ నయాగరా

6) నయాగరా సీనిక్ ట్రాలీ

వీటిల్లో మైడ్ ఆఫ్ ద మిస్ట్,కేవ్ ఆఫ్ ద విండ్స్ తప్పక చూడాల్సిందే!మిగతావి కుడా చూడాలంటే మనకి సమయం,ఓపిక కావాలి.ఈ పార్కు లాంగ్ వీకెండ్ రోజుల్లో బాగా రద్దీగా ఉంటుంది,ఈ సమయంలో మనకి మైడ్ ఆఫ్ ద మిస్ట్,కేవ్ ఆఫ్ ద విండ్స్ చూడడానికి కనీసం గంట,రెండు గంటలు పడుతుంది.అదే మాములు వారంతంలో అనుకోండి ఒక 15 నిముషాల్లో చూసేయచ్చు.మనం ఇంకొంచెం తీరిగ్గా చూడచ్చు. ఇక ఉపోద్ఘాతం ఆపి మేము నయాగరా ఎలా చూసాం చెపుతాను.


మైడ్ ఆఫ్ ద మిస్ట్ : పార్కు మొదట్లో డిస్కవరీ పాసు తీసుకున్న దగ్గర నుండి "మైడ్ ఆఫ్ ద మిస్ట్" దగ్గర.కాబట్టి నేరుగా మైడ్ ఆఫ్ ద మిస్ట్ కి వెళ్ళవలసిన వరుసలో నిలబడ్డాం.ముందుగా చెప్పినట్టు "పొడుగు వారంతం" వల్ల చాలా రద్దీగ ఉంది.మైడ్ ఆఫ్ ద మిస్ట్ లో అందరూ ఒక పడవ ఎక్కి జలపాతం దగ్గర దాకా వెళ్తారు, పైనుండి నీళ్ళు పడే దగ్గరికి పోయేసరికి అక్కడే ఏర్పడే పొగ మంచు అద్భుతంగా ఉంటుంది.పడవలో ఉన్న అందరూ తడవకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికీ ఒక రైన్ కోటు ఇస్తారు. ఈ పడవ ఎక్కాలంటే 500 అడుగుల ఎత్తు ఉన్న టవర్ కిందకి దిగాలి.అక్కడ ఉన్న ఎలివేటర్ సహాయంతో టవర్ దిగడానికి ఒక్క నిముషం కుడా పట్టదు.కిందకి దిగిన తర్వాత మాకు సరిపోయే రైన్ కోటు తీసుకుని,వేసుకుని పడవ ఎక్కాము.అందరూ ఎక్కిన తర్వాత పడవ అమెరికన్ ఫాల్స్ వైపు బయలుదేరింది. అక్కడ కాసేపు పడవని నిలిపి తర్వాత కెనేడియన్ ఫాల్స్ వైపు కదిలింది.కెనేడీయన్ వైపు ఫాల్స్ బాగా పెద్దగా ఉండి దగ్గరికెళ్ళేసరికి పూర్తిగా పొగ మంచుతో చాలా సుందరంగా ఉనింది.ఇక చల్లని జలపాతం నీళ్ళు మన మీద పడుతుంటే భలే సరదాగా ఉనింది. అందరూ కెమెరాలని టిక్,టిక్ మనిపించారు.దియాని ఎత్తుకుని నేను తీసుకున్న ఫోటో చూడండి,మీకు "చిరుజల్లు" స్పష్టంగా కనిపిస్తుంది. అలా అందమయిన ఆ అనుభూతిని పొంది టవర్ ఎక్కి తిరిగి వచ్చేసరికి ఇంచుమించు మధ్యహ్నం 4 అయింది.అక్కడ కాసేపు చెట్ల కింద కూర్చుని కొంచెం విశ్రాంతి తీసుకున్నాం.అలాగే తెచ్చుకున్న తినుబండారాలు తిని తర్వాత కార్యక్రమం గురించి అలోచించాం.


నయాగరా అడ్వెంచర్ థియేటర్ : నయాగరా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని "నయాగరా అడ్వెంచర్ థియేటర్" వైపు వెళ్ళాం. ఈ థియేటర్లో నయాగరా చరిత్ర గురించి ఒక 40 నిముషాలు లఘుచిత్రం ప్రతి 2 గంటలకి వేస్తారు.ఇది ఐమాక్స్ థియేటర్లో 45 అడుగుల తెర మీద డాల్బీ డిజిటల్ ధ్వనితో అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ కుడా ఒక 30 నిముషాలు క్యూలో వేచి చేయాల్సి వచ్చింది.లోపల మొట్టమొదట లైనులో కూర్చున్న ఒక 5 నిముషాలకి చిత్రం మొదలయింది. చిత్రం కథలోకి వస్తే "అమెరికా అప్పటికి ఇంకా కనుగొనక ముందు ఇక్కడ "నేటివ్ ఇండియన్స్" తెగలు ఉండేవి".తెగ పెద్ద కి ఒక అందమయిన కూతురు ఉంటుంది.అమెని తెగలో బలశాలి అయిన ఒక అందవికారమయిన వాడితో పెళ్ళి నిశ్చయమవుతుంది.ఇది కూతురికి నచ్చక తెగలో నుండి పారిపోయి ఎటో వెళ్ళిపోతుంది.ఆమె ఆత్మ ఇంకా నయాగరా జలపాతం దగ్గర తిరుగుతూ ఉంటుందని "ఇండియన్స్" కి నమ్మకం. అలా మొదలయిన చిత్రం తర్వాత రోజుల్లో యూరోపియన్స్ ఈ జలపాతాన్ని ఎలా కనుగొన్నారో చూపిస్తారు.వీళ్ళే ఈ జలపాతానికి "నయాగరా" అని నామకరణం చేస్తారు.నయాగరా అంటే ఇండీయన్స్ బాషలో "ఉరిమే నీళ్ళు" అని అర్థం. తర్వాత రోజుల్లో ఒక స్త్రీ బారెల్ లో పడుకుని జలపాతం నుండి కింద పడి బతకడం చూపిస్తారు.ఇటువంటి విషయాలతో బాగానే ఉనింది నయాగర గురించి చిత్రం.


అలా మా ఉదయం కార్యక్రమాలు ముగిసాక అందరం ఇంటి ముఖం పట్టాం.పార్కు అంతా బాగా నడిచాం కాబట్టి అందరికీ కాళ్ళు బాగా నొప్పి పుట్టాయి.హోటెల్ కి వెళ్ళి స్నానం చేసి కాసేపు నడుం వాల్చాం. నయాగరాలో ప్రతి ఆదివారం, శుక్రవారం రాత్రి 10 గంటలకి టపాకాయలు పేలుస్తారు.అలాగే ప్రతి రాత్రి 9 తర్వాత జలపాతం పై లైట్లు వేస్తారు.రాత్రి పూట వివిధ రంగుల్లో నయాగరా అందం చాలా బాగుంటుంది. కొంత విరామం,భోజనం కార్యక్రమాలయ్యాక మళ్లీ పార్కుకి బయలుదేరాం.రాత్రి 9:30 పార్కుకి చేరుకుని ఒక మంచి ప్రదేశం చూసి గడ్డిలో కూర్చున్నాం.వాతావరణం కొంచెం చల్లగా ఉండడంతో పొడుగు దుస్తులు ధరించి ఉండడంతో వెచ్చగా కూర్చున్నాం.

రంగుల్లో నయాగరా అందాలు చూస్తూ ఉండగా 10 గంటలకి టపాకాయలు పేలడం మొదలుపెట్టాయి.టపకాయల మెరుపుల్లో నయాగరా ఇంకా అందంగా కనిపించింది. అలా ఒక 15 నిముషాలు పేలిన టపాకాయల మోత ఆగిన వెంటనే తిరుగుముఖం పట్టాం.మరుసటి రోజు చూడాల్సిన విశేషాలను ఊహించుకుంటూ నిద్రకు ఉపక్రమించాం.

మిగతా విశేషాలతో మళ్ళీ ఇంకొక టపాలో కలుస్తాను.

No comments: