Tuesday, November 4, 2008

చేపల పులుసు


నాకిష్టమయిన వంటకాల్లో చేపల పులుసు ఒకటి. చేపల పులుసు తినాలని అనిపిస్తే మా ఆవిడ ప్రేమగా వంటగదిని నాకు అంకితం చేస్తుంది ఆ రోజుకి. ఎందుకంటే ఇందులో మన చేయి తిరిగిందనే చెప్పుకోవాలి. ఇక చేపల పులుసు నేను ఎలా చేస్తానో చూద్దాం.


ముందుగా మనకి కావలసినవి ఏమిటో ఒకసారి చూద్దాం.


కడిగి శుభ్రం చేసిన చేపలు
ఒక చెంచా కారం
ఒక చిటికెడు సుపు
కొద్దిగా ఆవాలు
కొంచెం జీలకర్ర
ఒక చెంచా అల్లం పేస్టు
ఒక చెంచా తెల్లగడ్డ పేస్టు
ఒక 2 చెంచాలు చేప పులుసు మసాలా
చింతపండు పులుసు తగినంత
ఒకటిన్నర ఎర్రగడ్డ
3 పచ్చిమిరపకాయలు



కడిగి శుభ్రం చేసిన చేపలని ఒక గిన్నెలో తీసుకుని అందులో అల్లం,తెల్లగడ్డ పేస్టుని ఒక్కొక్క చెంచా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక చెంచా కారం వేసుకోవాలి. ఇపుడు మన జీవితాన్ని చాలా సులభతరం చేసిన మసాలా పొడులకి నెనర్లు చెప్పుకుంటూ ఒక 2 చెంచాలు చేపల మసాలా పొడిని వేసుకుని ఈ మిశ్రమాన్ని చేపలకి పూసుకోవాలి. ఇలా మారినేట్ చేసిన చేపలని అలాగే కాసేపు ఉంచండి.



ఇపుడు ఒకటిన్నర ఎర్రగడ్డలని చిన్న ముక్కలుగా తరగండి. వాటితో పాటూ ఒక 3 పచ్చిమిరపకాయలని కుడా చిన్న ముక్కలుగా తరగండి. చేపల పులుసు చేసుకునే గిన్నెని పొయ్యి మీద ఉంచి కొంచెం వేడెక్కాక అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. గిన్నె వేడెక్కాక కొన్ని ఆవాలు, జీలకర్ర గిన్నెలో వేయించండి. అవాలు పేలబోయేముందు ముందుగా తరిగి ఉంచిన ఎర్రగడ్డలని గిన్నెలో వేసి మూత పెట్టండి. ఎర్రగడ్డలు ఆవిరికి ఉడికితే మంచి రుచిగా ఉంటాయి. ఎర్రగడ్డలు మాడబోయేముందు పచ్చిమిరపకాయలు కుడా గిన్నెలో వేయించండి. అలాగే చిటికెడు పసుపు, ఒక చెంచా అల్లం పేస్టు, ఒక చెంచా తెల్లగడ్డ పేస్టు, 2 చెంచాలు చేపల మసాలా పొడి వేసి గరిటెతో కలపండి. ఒక రెండు చెంచాలు ఉప్పు కుడా వేసి బాగా కలపండి. ఉప్పుని చేపలు వేసాక వేస్తే గరిటెతో కలపడం కష్టం, ఎందుకంటే చేప ముక్క విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి.



ఇప్పటివరకు మారినేట్ చేసిన చేపని గిన్నెలో వేయండి. ఒక చెంచా నూనె కుడా వేసి మూత పెట్టండి. ఇపుడు కొంచెం చింతపండు వేరే గిన్నెలో తీసుకుని కొన్ని నీళ్ళు పోసి చింతపండు పులుసు అయ్యేలా పిసకండి. మనకి పులుసు ఎంత పులుపుగా ఉండాలో దానికి తగినంత పులుసుని తయారుచేసుకోవాలి. ఇలా తయారయిన చింతపండు పులుసుని చేపల గిన్నెలో పోయండి. మంట తగ్గించి చేప పులుసు గిన్నెపై మూత పెట్టండి. ఒక 10 నిముషాల తరువాత మూత తీసి చూస్తే మనకి పులుసుపై నూనె తేలిందంటే పులుసు అయిపోయినట్టే! ఒక చేప ముక్క ని తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేయండి. చేప ఉడికితే ఇక పొయ్యి కింద మంట తీసేయండి, ఒక 15 నిముషాల తర్వాత తినడానికి మన చేపల పులుసు తయార్! రెండో రోజుకి దీని రుచి మరింత పెరుగుతుంది.

3 comments:

సిరిసిరిమువ్వ said...

నిజమే, చాపల పులుసు రుచి మరుసటి రోజుకు ఇంతై అంతై అన్నట్లు ఇనుమడిస్తుంది.

ఏంటొ ఆందరూ నలభీమపాకాలు మొదలుపెట్టారు.

Rajendra Devarapalli said...

అన్ని రకాల చేపలు ఇలాగె వండుతారా,రకానికో రకం గా వండే పద్ధతి మారుతుందా?? ఇంతకీ ఫొటోలు ఏవీ?

శ్రీ said...

నలభీమపాకాలు ఎపుడో మొదలయ్యాయి కదా సి.సి.ము గారు.

చేపని బట్టి వండుతారు రాజేంద్రకుమార్ గారు. నేను వండినవి స్మెల్ట్ చేపలు. ఫోటోలు పెడదామనుకుంటే నా పికాసా లిమిట్ దగ్గరలో ఉన్నాను అని వార్నింగ్ ఇచ్చింది.