Wednesday, September 30, 2009

డెట్రాయిట్ లో శ్రీశ్రీ,కొడవటిగంటి,గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు






శ్రీశ్రీ,కొడవటిగంటి,గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు డెట్రాయిట్ లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో డెట్రాయిట్ లోని సెయింట్ తోమా చర్చిలో గడచిన వారాంతం జరిగాయి.సభకి విచ్చేసిన సాహితీ అభిమానులని ఉద్దేశించి డెట్రాయిట్ లిటరరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీ మద్దిపాటి కృష్ణారావు గారు ముందు మాటతో స్వాగతం పలుకుతూ కార్యక్రమాలని ప్రారంభించారు. కొకు,శ్రీశ్రీ,గోపీచంద్ ల జీవిత విశేషాలను వివరించడానికి ఉపన్యాసకులయిన కొడవటిగంటి రోహిణీప్రసాద్,వేల్చేరు నారాయణరావు,త్రిపురనేని సాయిచంద్ గారిని సమన్వయకర్తగా వ్యవహరించిన వేములపల్లి రాఘవేంద్రచౌదరి ఆహ్వానించారు.




కొడవటిగంటి కుటుంబరావు కొడుకు కొడవటిగంటి రోహిణీప్రసాద్ తన తండ్రి జీవిత విశేషాలను సభతో పంచుకున్నారు. తమ ఇంటి పేరు ఎలా రావడం,తండ్రికి ఎంతో ఇష్టమయిన ఫొటోగ్రఫీ,గ్రాంఫోను,పుస్తకాల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లోనే దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆద్వర్యంలో రిజిష్టర్ మ్యారేజి చేసుకోవడం, దీనికి సాక్షులుగా శ్రీశ్రీ, దర్శి చెంచయ్య, మాధవపెద్ది గోఖలే సంతకాలు చేయడం గురించి గుర్తు చేసారు. కొకు గారికి సంగీతంలో ప్రవేశం గురించి రంగుల రాట్నం సినిమా మ్యూజిక్ రికార్డింగ్ లో జరిగిన సంఘటన వివరించారు.




వేల్చేరు నారాయణరావు శ్రీశ్రీ గురించి మాట్లాడుతూ తన కాలేజీ చదివే రోజుల్లో శ్రీశ్రీ కవితలు జేబులో పెట్టుకు తిరగడం గుర్తుచేసుకున్నారు.కవులలో వ్యక్తిత్వం,జనాల్లో ఆకర్షణ ఉన్న వ్యక్తి శ్రీశ్రీ అని అన్నారు.ఏలూరులో అభ్యుదయవాదులు జరిపిన శాంతిమహాసభలలో తొలి సారిగా శ్రీశ్రీ ని చూడడం జరిగిందని చెప్పారు. శ్రీశ్రీ రచనల్లో సంఘర్షణలు,వైవిధ్యాలు చాలా కనిపిస్తాయన్నారు. శ్రీశ్రీ వ్యకిత జీవితం,అలవాట్లు,స్నేహాలు గురించి మాట్లాడారు. తనను బాగా ప్రభావితం చేసినవారిగా శ్రీశ్రీ ఎప్పటికీ గుర్తు ఉంటారు అని వేల్చేరు గారు తమ ప్రసంగాన్ని ముగించారు.



తన తండ్రి త్రిపురనేని గోపీచంద్ జీవిత విశేషాలను సినీనటుడు సాయిచంద్ సభతో పంచుకున్నారు. రైతుబిడ్డ, మాయాలోకం, లక్ష్మమ్మ సినిమాలలో గొపీచంద్ పనిచేయడం గురించి వివరించారు. గోపీచంద్ రాసిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలని తను టెలీఫిల్ముగా తయారుచేయడం,కేశవమూర్తిగా తను నటించడం గురించి వివరించారు.




మధ్యాహ్నం పసందయిన విందు భోజన విరామం తరువాత కొడవటిగంటి సాహిత్య వేదికని గోపరాజు లక్ష్మి ప్రారంభిస్తూ వేదిక మీదకి విష్ణుభొట్ల లక్ష్మన్న,చుక్కా శ్రీనివాస్,కందాళ రమానాథ్,కొడవళ్ళ హనుమంతరావు,మంగాపురం విష్ణుప్రియని ఆహ్వానించారు.




విష్ణుభొట్ల లక్ష్మన్న మాట్లాడుతూ కొకు సాహిత్యంతో ఇపుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామో వివరించారు.తనకు 11 ఏళ్ళ వయసులో చదివిన చందమామ పత్రికలోని బేతాళకథని గుర్తు చేసుకున్నారు. ఆ కథలోని నీతి "స్వయంకృషిలోని తృప్తి" తనకి ఇంకా గుర్తు ఉండడం,ఆ నీతి తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపిందో చెప్పారు. కొత్తజీవితం కథ గురించి మాట్లాడారు. ఇదినిజంగా జరిగిన కథ అని రొహిణీప్రసాద్ గారు అందరికీ తెలియజేసారు.
కొకు రచనల్లో స్త్రీల సాధికారత గురించి గోపరాజు లక్ష్మి మాట్లాడుతూఆల చిన్నతనపు పెళ్ళి,పచ్చకాగితం,సాహసి కథలని గుర్తు చేసుకున్నారు.తరువాత కందాళ రమానాథ్ కొకు రచనల్లో హాస్య వ్యంగ్యాల మేళవింపు గురించి మాట్లాడారు. కొకు కథల్లో భార్యభర్తల సంభాషణలు ఎలా ఉండేవో వివరించి అందరినీ నవ్వించారు.వాస్తవిక కథలకి అవాస్తవిక చిత్రీకరణగా సినిమా అని సినిమా కథలో వివరించారని చెప్పారు. ఐశ్వర్యం నవలపై కొడవళ్ళ హనుమంతరావు ఒక పరిశీలన చేసారు. నవలలోని డాక్టరు పాత్ర గురించి కాసేపు ముచ్చటించారు.మంగాపురం విష్ణుప్రియ "వివాహ వ్యవస్థకు కొకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసారా?" అన్న విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా స్వార్థబుద్ది,పెళ్ళి వ్యవహారం,చెడిపోయిన మనిషి కథలు గుర్తు చేసుకున్నారు.



సాయంత్రం 4 పైన శ్రీశ్రీ సాహిత్య వేదికని ప్రారంభిస్తూ వెంకటయోగి నారాయణస్వామి "శ్రీశ్రీ సమకాలీన ప్రాసంగికత" గురించి మాట్లాడారు. చిన్నప్పటి నుండి శ్రీశ్రీ కవితలు తనను ఎలా ప్రభావితం చేసిందో వివరించారు. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి విన్నకోట రవిశంకర్ ప్రసంగించారు.జే.కే.మోహన్ రావు శ్రీశ్రీ కవితల్లో మాతా చందస్సు గురించి మాట్లాడారు. శ్రీశ్రీ మహా ప్రషానం:కదనం, కథనం గురించి తమ్మినేని భూషణ్ వీడియోని సభలో ప్రదర్శించారు. "దూరం నించి శ్రీశ్రీ" అన్న విషయంపై వేల్చేరు నారయణరావు కాసేపు ముచ్చటించారు."ఉద్యమాలు లేకున్నా కవిత్వం ఉంటుంది,శ్రీశ్రీ ఉంటాడు" అన్న హెచ్చార్కే సందేశాన్ని బసాబత్తిన శ్రీనివాసులు సభకి చదివి వినిపించారు.రాత్రి 7.30 కి విందు,వినోదం,గోపీచంద్,కథాసాగర్ పుస్తకావిష్కరణలతో శనివారం ముగిసింది.
ఆదివారం ఉదయం ఉపాహారం తరువాత గోపీచంద్ సాహిత్యవేదికని ఆవుల మంజులత ప్రారంభించారు. వేదిక పైకి ఏపూరి భక్తవత్సలం,కొత్త ఝాన్సీలక్ష్మి,వేములపల్లి రాఘవేంద్ర చౌదరి,మద్దిపాటి కృష్ణారావు,ఆరి సీతారామయ్యని ఆహ్వానించారు. గోపీచంద్ తాత్విక దృష్టి గురించి ఏపూరి భక్తవత్సలం మాట్లాడారు.ఆవుల మంజులత మాట్లాడుతూ తన తండ్రి ఆవుల సాంబశివరావు,గోపీచంద్ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ప్రత్యేకత,తాత్వికత గురించి కొత్త ఝాన్సీలక్ష్మి మాట్లాడారు. కేశవమూర్తి, ప్రమేశ్వర శాస్త్రి,సుజాత,సుభాషిణి పాత్రలను విశ్లేషించారు.ఈ నవలని ఒక నెల ముందే డెట్రాయిట్ లిటరరీ క్లబ్ లో సమీక్షించడం గమనార్హం. ఆరి సీతారామయ్య మాట్లాడుతూ గోపీచంద్ కి జీవపరిణామక్రియ అర్ధం కాలేదేమోనని అభిప్రాయపడ్డారు.అది నిజంగా అసమర్థుని జీవయాత్రేనా? అని మాచవరం మాధవ్ వీడియోని సభ తిలకించింది.మద్దిపాటి కృష్ణారావు కూడా అసమర్థుని జీవయాత్ర నవలపై తన అభిప్రాయాలని వెలిబుచ్చారు.చీకటి గదులు నవలని వేములపల్లి రాఘవేంద్ర చౌదరి సమీక్షించారు.




మధ్యాహ్న భోజన విరామం తరువాత శ్రీశ్రీ,కొకు,గోపీచంద్ సాహిత్యం,సమాజం - పరస్పర ప్రబావం మీద చర్చ జరిగింది. ఈ చర్చకి సమన్వయకర్త రవి గుల్లపల్లి వేదికపైకి వెంకటయోగి నారాయణ స్వామి,మంగాపురం విష్ణుప్రియ,వేల్చేరు నారాయణరావు,జంపాల చౌదరిని ఆహ్వానించారు. వేడి వేడి ప్రశ్నలు,సమాధానాలతో చర్చా వేదిక ముగిసింది.

7 comments:

Bhãskar Rãmarãju said...

బాగుందండీ మీ ఉత్సవ సంగ్రహం

శ్రీ said...

నెనర్లండీ!

రెండు రోజులూ చాలా సరదాగా జరిగింది.

కొత్త పాళీ said...

శ్రీ. బాగుంది మీ నివేదిక.

cbrao said...

శతజయంతి ఉత్సవాలు గురించిన మీ నివేదిక బాగుంది. కొసమెరుపులు, తమాషా సన్నివేశాలు ఇలాంటి నివేదికలకు అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. వాటిని కూడా ఇస్తే బాగుండేది. ఛాయాచిత్రం కింద చిత్రంలో ఉన్నవారి పేర్లు ఇస్తే పాఠకులకు ఉపయోగం.మరికొన్ని ఛాయాచిత్రాలు కూడా వ్యాసానికి పూర్ణత్వం తెచ్చిఉండేవి.

మురళి said...

సైడ్ లైట్స్ తో మరో టపా రాస్తారని ఎదురుచూస్తున్నా...

శ్రీ said...

@ కొత్తపాళీ,సీబీరావు,మురళి కి నెనర్లు.

ఫొటోలో మాట్లాడుతున్నది డెట్రాయిట్ లిటరరీ క్లబ్ కి చెందిన మద్దిపాటి కృష్ణారావు గారు.అతని పక్కన కూర్చున్నవారు ఏపూరి భక్తవత్సలం,కొత్త ఝాన్సీలక్ష్మి,ఆవుల మంజులత,వేములపల్లి రాఘవేంద్ర చౌదరి,ఆరి సీతారామయ్య.

చాయాచిత్రాలు స్లైడ్ షో పెడుతాను.సైడ్ లైట్స్ చాలా ఉన్నాయి.అవి ఒక సిరీస్ గా రాస్తాను.

Bhãskar Rãmarãju said...

http://malakpetrowdy.blogspot.com/2009/10/blog-post.html