Monday, June 7, 2010

వేదం - మళ్ళీ చూడనీ....

ఒక నెల రోజుల నుండీ పాటలు వింటూ ఉన్నా. వినే కొద్దీ పాట అర్ధమవుతూ ఉంటే ఈ పాట ఇలా తీసి ఉంటాడేమో ? అని ఊహించుకుంటూ ఉన్నా నిన్నటి వరకు. సరోజ పాట ఒక నెల నుండీ నా రింగ్ టోన్ కూడా.


సరిగ్గా సినిమా విడుదల అయ్యే సమయానికి నేను న్యూ యార్క్ వెళ్ళాల్సి వచ్చింది. శుక్రవారం కార్లో వెడుతూ రివ్యూలు చూస్తుంటే "అహా..ఒహో" అంటున్నారు. న్యూ యార్క్ లో సినిమా చూసి ఉండచ్చు,కానీ మనకి అంత సమయం లేకపోవడం వల్ల చూడలేదు. ఫేస్ బుక్ లో డైలాగులతో సహా రాసి నన్ను మరింత రెచ్చగొట్టారు. నిన్న సాయంత్రం ఇంటికి చేరాక ఇంటి పనులు ముగించి నేరుగా సినిమాకి బయలుదేరాను.


మొదటి సినిమా గమ్యం కంటే ఈ సినిమాని ఇంకా బాగా తీసాడనిపించింది. కేబుల్ రాజు ప్రియురాలు కోసం పడే గొప్పలు, నేత కార్మికుడు రాములు శీను గాడిని చదివించాలనుకోవడం, రాక్ స్టార్ కావాలనుకునే వివేక్, తనే కొత్త కంపెనీ పెట్టుకోవాలనుకునే సరోజ ఇంకా ఇక్కడ బతకలేక దుబాయ్ వెళ్ళిపోవాలనుకునే రహీం కథలు చాలా బాగా నడిచాయ్. సినిమా విరామం వచ్చేసరికి చాలా కథ జరిగినట్టు అనిపిస్తుంది, 5 కథలు మనల్ని కుర్చీకి కట్టేసి తరువాత ఏమి జరుగుతుంది ? అన్న మీమాంశలో పడేస్తుంది.సిరిసిల్లలో ఎంత మంది నేత కార్మికులు చనిపోయినా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో వాళ్ళ కథ చూపించలేదు. సినిమాలో పెట్టాక వాళ్ళ బతుకులు బాగుంటాయని కాదు కానీ, కనీసం చూపించడం బాగుంది. రాములుగా నటించిన నర్సయ్య (ఇతని గురించి నవతరంగం లో రాసారు), సరోజ అక్కగా అనూష్క మేకప్ మాన్ పాత్రలు బాగున్నాయ్. అనూష్కకి మంచి పాత్ర దొరికింది, సరోజ అక్కని అడిగే ప్రశ్నలు పరోక్షంగా సమాజానికే అని మనం అనుకోవాలి. అల్లు, మనోజ్ లు కూడా పరిథి మేర బాగా చేసారు. మనోజ్ కాకుండా ఇంకెవరయినా ఉంతే బాగుండేదని ఎవరో బ్లాగారు, గుర్తు లేదు. బహుశా అతనకి మనొజ్ సినిమా మొదటిది ఏమో? బిందాస్ చూసి ఉంటే అలవాటయి ఉండేవాడేమో? సినిమా మొదలయే ముందు ప్రేక్షకులకి ముందే చెప్పాల్సింది, "అయ్యా..మీరు ఈ సినిమా చూసే ముందు మనోజ్ పాత సినిమా ఒకటి చూసి రండి" అని!


సినిమాలో పాటలు విన్నపుడు కీరవాణి గొంతు చాలా పాటల్లో వినిపించింది. ఒక సంగీత దర్శకుడు తన సినిమాలో పాడేవాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా? ఆ వచ్చే నాలుగు వేలు కూడా వెనకేసుకుందామని అతనే పాడడం ఎందుకో? నాకయితే నచ్చలెదు. మల్లికార్జున్ కూడా పై స్థాయిలో పాడగలడు కదా! ఏమిటో కీరవాణికి కక్కుర్తి. కీరవాణి కొంచెం మేలే! గొంతు పరవాలేదు, బండ గొంతేసుకుని పాడే దేవీ ప్రసాద్ నాకు కానీ దొరికితే చితక బాదుతాను.


ఐదు కథలు బాగానే మొదలయినా ముగించే ముందు అందరికీ ఒకేసారి టిక్కు పెట్టడం కష్టం. నా ఇంతకు ముందు టపాలో కీ.శే. శ్రీదేవి కూడా ఇలాగే చేసిందని చెప్పాను. చివరకి వచ్చేసరికి కొంచెం సినిమా ఫక్కీలో జరిగినట్టు మనకి అనిపిస్తుంది. అసలు తెలుగులో మంచి సినిమాలు ఎక్కడ ఉంటాయండీ? అని ఉడుక్కునే ముందు ఈ సినిమా ఒకసారి చూడండి.

4 comments:

Anonymous said...

"మంచి సినిమా అంటే ఏమిటి ?"

"జనాలకు నచ్చిన సినిమా మంచి సినిమా కాదా ?"

"మీకు నచ్చితేనే మంచి సినిమానా ?"

శ్రీ said...

మంచి సినిమా అంటే సినిమా మంచిది అని.

జనాలకి నచ్చిన సినిమా కూడా మంచి సినిమానే అవుతుంది.

నాకు నచ్చిన సినిమా కూడా మంచి సినిమానే అయి ఉండచ్చు.

Prasad Samantapudi said...

పెద్ద హీరోలకి తగలేసే డబ్బులో సగం,సృజనాత్మకత ఉన్న రచయితలకి,దర్శకులకి ఖర్చు పెట్టినా,మంచి ఫలితాలు వస్తాయి.
* * *
ఇపుడిపుడే డిఫరెంటుగా తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. తప్పుల్ని భూతద్దాల్లో వెదక్కుండా, ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది.

శ్రీ said...

బాగా చెప్పారు ప్రసాద్ గారు. ఈ మధ్యలో బాగా తీస్తున్న దేవ కట్టా, క్రిష్ అభినందనీయులే.