Sunday, June 13, 2010

ఒకటి కిందకి, నాలుగు పైకి
నా చిన్నపుడు, అంటే లెక్క ప్రకారం నేను నాలుగో తరగతిలో ఉండాలనుకుంటా, మా నాన్న రాజ్ దూత్ బైక్ కొన్నాడు. ఇంటికొచ్చాక నన్ను బైక్ వెనక కూర్చోపెట్టుకుని రెండు, మూడు రౌండ్లు తిప్పేవాడు. నాకు కొంచెం ఊహ తెలిసాక, అంటే నేను ఎనిమిదో, తొమ్మిదో చదువుతున్నాననుకుంటా, మా నాన్న బైక్ ఎలా తోలుతాడో చూస్తూ ఉండేవాడిని. కిక్ స్టార్ట్ కొట్టాక ఎడమ కాలితో బ్రేక్ లాంటి దాన్ని కిందకి నొక్కి టిక్ అనిపించి ముందుకు వెళ్ళేవాడు. కొన్ని రోజులయ్యాక అర్ధమయింది, దాన్ని గేర్ వెయ్యడం అంటారు అని.సెలవల్లో మా అన్న, ఎలాగంటే పెదనాన్న కొడుకు, మా ఇంటికి వచ్చినపుడు నన్ను బైక్ వెనక కూర్చోపెట్టుకుని చిట్వేల్ రోడ్డు మీద షికారుకి తీసుకెళ్ళాడు. రాపూరు నుండి కడప వెళ్ళే దారి చాలా బాగుంటుంది. ఒక ఇరవై, ముప్పై కిలోమీటర్ల పొడవయిన ఘాట్ రోడ్డుతో ఈ రోడ్ చాలా బాగుంటుంది. వర్షాకాలం వస్తే ఘాట్ రోడ్ పొడవునా జలపాతాలతో కన్నుల విందుగా ఉంటుంది. ఈ అడవి ఎర్ర చందనానికి కూడా బాగా ప్రసిద్ది, ఆ రోజుల్లో మద్రాసుకి బాగా స్మగ్లింగ్ జరుగుతూ ఉండేది. అలా షికారుకి వెళ్తూ తిరిగి వచ్చేటపుడు మా అన్న నా చేత బైక్ డ్రైవింగ్ చేపించాడు. నేను బైక్ నడుపుతూ, స్పీడ్ పెంచుతూ ఉంటే మా అన్న కింద గేర్లు, బ్రేకులు తొక్కుతూ ఉండేవాడు, ఎందుకంటే నాకు అప్పటికి కాళ్ళు కిందకి అందేవి కావు. నేను విపరీతంగా ఫీల్ అవుతూ డ్రైవ్ చేస్తూ ఉంటే డాబల్ చెరువులో ఈత కొడుతున్న మా స్నేహితులు చూసి ఈలలు వేసారు.తరువాత నాకు మళ్ళీ బైక్ డ్రైవ్ చేసే అవకాశం రాలేదు, నాకు కాళ్ళు అందే వయసు వచ్చేసరికి మా నాన్న బైక్ అమ్మేసాడు. నా కాలేజీ చదువుల కోసం మా కుటుంబం నెల్లూరుకి మకాం మార్చాల్సి వచ్చింది. అపుడు రెండు వందల యాబై పెట్టి హీరో సైకిల్ కొనుక్కుని బాగా తొక్కేవాడిని. తర్వాత పై చదువులు, ఉద్యోగాలు మొదలయినపుడు సిటీ బస్సులు, ఆటోలతో సర్దుకుపోయాను.పోయిన శీతాకాలంలో మా ఇంటికి వచ్చిన ఫ్రెండు బైక్ అమ్ముతున్నానంటే నేను ఎగిరి గంతెయ్యకుండానే కొనేసాను. ఫిబ్రవరి చివరలో రాత్రి 10 గంటల పైన మా ఇంటికి బైక్ తెచ్చాడు. ఆరోజు రాత్రే రెండు రౌండ్లు షికార్ కొట్టి పడుకున్నా. ఈ మద్య కాలంలో వాతావరణం అనుకూలించాక ఆఫీసుకి బైకులో వెళ్ళడం ప్రారంభించాను. మా ఆఫీసు మా ఇంటి నుండి ఇరవై ఏడు మైళ్ళు. మంచి సీనిక్ డ్రైవులో అఫీసుకి వెళ్తుంటే మా సరదాగా ఉంటుంది, మళ్ళీ నా చిట్వేల్ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇక్కడ బైకులో తిరిగే వాళ్ళు తక్కువ, రోడ్డు మీద ఎదురుగా ఎవరయిన బైకర్ ఎదురయితే ఎడమ చేత్తో విలాసంగా చెయ్యి ఊపి పలకరిస్తారు. ఆఫీసుకి, సినిమా హాలుకి వెళ్ళినపుడు అందరికీ బాగా "కటింగ్" ఇస్తూ ఉంటాను. తెలిసిన వాళ్ళు "ఏమిటి? దీనికి గేర్లు ఎలాగ ?" అని అడుగుతూ ఉంటారు. నేనంటాను "మన లాగే! ఒకటి కిందకి, నాలుగు పైకి" అని. తమాషా ఏమిటంటే హోండా అయినా, యమహా అయినా గేర్లు ఒకేలాగ ఉంటాయి.
3 comments:

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

వాకాడునుంచి నెల్లూరుకి బైక్‌లో వెళ్తుంటే వాహ్ ఆఆనందమేవేరు. డక్కిలిలో ఉండెవాళ్ళం కొంతకాలం. అప్పుడు రాపూరు-చిట్వేలు ఒకసారి వెళ్ళాను. భయమేసిందికానీ సూపర్ థ్రిల్ :)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...
This comment has been removed by the author.
శ్రీ said...

రాపూర్ - చిట్వేల్ రోడ్ చాలా బాగుంటుంది. రాపూరు,వెంకటగిరి మధ్యలో కదా డక్కిలి! ఒకసారి రాపూరు నుండి మా స్నేహితులతో కలిసి సైకిల్ లో వచ్చాను.