Sunday, June 20, 2010

The Way Home

మా సినిమా క్లబ్ గురించి ఇంతకు ముందు చెప్పాను కదా. తర్వాత వారం "ద వే హోం" సినిమా చూసాం. ఇది ఒక కొరియన్ సినిమా, సినిమా చూసే ముందు మిత్రుడు కొన్ని తొలి పలుకులు ఇలా సాగాయ్.


"ఈ సినిమా కొంచెం బరువుగా ఉంటుంది, సినిమా అయ్యాక నేను మామూలు మనిషి అవడానికి కొన్ని రోజులు పట్టింది" అని.


అందరం గట్టిగా ఊపిరి పీల్చుకుని సినిమా చూసాం.


సియోల్ సిటీలో ఉన్నటువంటి ఓ ఒంటరి తల్లి కొన్ని రొజులు కొడుకుని వాళ్ళ అమ్మ దగ్గర దింపడానికి పల్లెకి వచ్చి పిలకాయ్ ని అమ్మ దగ్గర పెట్టేసి తిరిగి సిటీకి వెళ్ళి పొతుంది. పిలకాయ్ ఎపుడూ పల్లెటూరిలో ఉండలేదు. అమ్మమ్మ చూస్తే నడుము వంగి పోయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆమెకి మూగ కూడా, మాట్లాడలేదు. సైగలతో మాట్లాడేస్తూ ఉంటుంది. పిల్లోడు తన వెంట తెచ్చుకున్న వీడియో గేం ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ వీళ్ళ అమ్మ వీడిని సిటీకి తీసుకువెళ్ళేవరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన కథే సినిమా అంతా.


ఒక ఏడు, ఎనిమిది వయసు ఉన్న పిలకాయ్ ప్రవర్తన చాలా సహజంగా చూపించాడు దర్శకుడు. అమ్మమ పాత్ర కోసం వెతుకుతూ ఒక కొండ ప్రాంతంలో ఈమెని పట్టుకున్నారట. ఆమె తన జీవితంలో అసలు సినిమా ఎలా ఉంటుందో కూడా చూడలేదట, ఆమె చేత చాలా అద్భుతంగా జీవింపచేసాడు మళ్ళీ మన దర్శకుడు. మొదట్లో పెంకిగా ఉండే పిల్లోడు చివరికి వచ్చేసరికి అమ్మమ్మకి చాలా దగ్గరయిపోతాడు. పిల్లవాడి వీడియో గేం బాటరీస్ కోసం ముసలామె సంతకు వెళ్ళి కూరగాయలు అమ్మడం, సంత నుండి బస్సులో రాకుండా నడిచి వచ్చి ఆ డబ్బులు మిగల్చడం మనల్ని పిండుతాయి.


సంత దగ్గర ఇంకో సీన్ ఉంటుంది, తనకి తెలిసిన ఇంకో ముసలామె దగ్గర మనవడి కోసం కొన్ని చాక్లెట్లు కొంటుంది. ఆ ముసలామె కూడా ఈమె వయసే ఉంటుంది, ఆమె కాళ్ళ నొప్పులతో నడవలేదు.


"సంతకి వచ్చినపుడు ఇటు వస్తూ ఉండు! మనకి అట్టే పెద్ద సమయం లేదు, ఈసారికి ఎవరో ఒకరు మాత్రమే మిగులుతాం" అని వైరాగ్యంతో అన్న సీన్ చాలా బరువుగా బాగుంది.


అమ్మమ్మని కసురుకుని కొట్టే తుంటరి పిల్లవాడి మనస్తత్వం నుండి తిరిగి సిటీకి వెళ్ళి పోయేటపుడు తనకి బాగా ఇష్టమయిన బొమ్మలు అమ్మమ్మకి ఇవ్వడం వరకు జరిగే సంఘటనలు చాలా బాగుంటాయి.


నాకు కూడా సినిమా చూస్తున్నపుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. మీకు కూడా వీలయినపుడు ఈ సినిమా చూసి మంచి అనుభూతిని పొందండి. ఆ తర్వాత వారం ఎమిలీ అనే ఫ్రెంచ్ సినిమా చూసాం. ఆ విశేషాలతో మళ్ళీ కలుస్తా.


9 comments:

పరిమళం said...

సినిమాపరిచయం బావుంది ...ఎమిలీ కూడా త్వరలో పరిచయం చేయండి మరి !

శ్రీ said...

తప్పకుండా పరిమళం గారు

భావన said...

బాగుందండి పరిచయం. నేను విన్నా గొప్ప గా ఈ సినిమా గురించి చూడలేదు, ఐతే తప్పక చూడవలసింది అన్నమాట. మిగతా సినిమాలు కూడా మరి తొందర గా చెప్పెయ్యండి.

ramnarsimha said...

This review is very very very very

very very very very very very very

heart-touching..

Thanq..so...................much..

శ్రీ said...

@ భావన,

తప్పక చూడండి. తొందరలోనే ఎమిలీ గురించి రాస్తాను.


@ రాం నరసింహ,

నెనర్లు.

Prasad Samantapudi said...

ఈ సినిమా చూస్తుండగా, అలా... ఆలోచనల్లోకి జారిపోయాను. బాగా ఆలోచింపచేసే సినిమా. ఇటువంటి సినిమాలలో ఉండే మరో సౌలభ్యం ఏమిటంటే, ఎవరి అవగాహన శక్తిమేరకు వారు అర్ధంచేసుకోవచ్చు.

రాధిక said...

ప్రశాంతంగా కాలం వెళ్ళదీస్తున్న మమ్మల్ని ఆ సినిమా చూడండి...ఈ సినిమా చూడండి అని చెప్పి ఏడ్చేలా చేస్తారా.అయ్యబాబొయ్ ఎంతలా గుండెలు పిండేసిందో ఈ సినిమా.నిజానికి సినిమా అంతా చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంటుంది....కానీ.....సీన్ నుండి సీన్ మారేటప్పటికి మన గుండె మాత్రం బరువెక్కిపోతూ వుంటుంది.ఆ డైరెక్టర్ కి కాళ్ళకి మొక్కాలి.ఇంత మంచి సినిమా పరిచయం చేసినందుకు చాలా థాంక్స్ అండి.

రాధిక said...
This comment has been removed by the author.
శ్రీ said...

రాధిక గారికి, టపా చదివి సినిమా కూడా చూసినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. మీరు కుడా మంచి అనుభూతి పొందినట్టున్నారు. ఈ సినిమా చూసాక నిజంగా మా మూవీ క్లబ్ లో ఎవరూ నోరు తెరిచి మాట్లడలేక పోయారు. కొంచెం కదిలిస్తే అందరం ఏడుస్తూ కూర్చునే వాళ్ళమేమో!

మీరన్నట్టు నిజంగా దర్శకుడికి కాళ్ళు మొక్కాలి.

వేచి చూస్తూ ఉండండి, మరిన్ని సినిమాలతో మీ ముందుకు వస్తాను.