Wednesday, January 19, 2011

తెలుగోడికి మళ్ళీ మొండి చెయ్యి

ఒక వారం క్రింద అనుకుంటా, మా అమ్మాయి దియకి రాత్రి పడుకునేటపుడు కథ చెప్పాల్సి వచ్చినపుడు ఎపుడూ చెప్పే ఏడు చేపల కథ కాకుండా కొత్తగా ఉంటుందని రెండు పిల్లుల కథ చెప్పా. ఈ రెండు పిల్లూ కథ మీకు కూడా తెలుసు, ఏమిటంటే రెండు పిల్లులు వాటికి దొరికిన ఆహారం కోసం కొట్టుకుంటూ ఉంటాయి. ఇంతలో దారిన పోతున్న ఒక కోతి ఇద్దరి తగవు తీరుస్తానని అంటుంది. రెండు పిల్లులూ చూస్తుండగానే ఆహారాన్ని కోతి తినేసి ఉడాయిస్తుంది. ఈ కథ నిజంగా పిల్లి, కోతిల మధ్య ఏమో గుర్తు లేదు కానీ మనకి నీతి అర్ధమయితే చాలు అని నిద్రపోతున్న దియాకి చెప్పాను.


ఈరోజు సాయంత్రం అదే చరిత్ర పునరావృతమయింది, కాకపోతే ఇక్కడ మూడు పిల్లులు! కోతి మాత్రం ఒకటే! ముప్పయి రెండు ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతో నిజాయితీగా కుక్కలా కాపాడుతుంటే ఈరోజు కేంద్రం మనకి మొండి చెయ్యి చూపించింది. అదేమంటే "ఇక్కడ గొడవలతో ప్రభుత్వం స్థిరంగా లేదు, ఈసారి ఆంధ్రకి పదవులు లేవు" అని అమ్మగారు అయ్యవారికి చెప్పారు. ఇపుడైతే గొడవలు ఉన్నాయి, మరి ఇంతకు మునుపు చాలా పదవులు దక్కాయా? అంటే ఏదో ముగ్గురికి దొరికాయి ముప్పై రెండు మందిలో!


ఈరోజే సాయంత్రం జెమినీలో మంచి చర్చ జరిగింది ఒక సీనియర్ జర్నలిస్టు 1956 నుండి కేంద్ర పదవుల పంపిణీ-సమీకరణాలు మీద కొన్నిమంచి విషయాలు మాట్లాడాడు. కేంద్ర మంత్రి పదవుల విషయంలో రాష్ట్రానికి అపుడు రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ సామాజికవర్గానికి, కమ్మ ముఖ్యమంత్రి అయితే ఆ సామాజికవర్గానికి పీట వెయ్యడం సమీకరణాల్లో భాగమట. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు బండారు దత్తాత్రేయకి మంత్రి పదవి రాకుండా బాబు ప్రయత్నించాడని కూడా చెప్పాడు. తమ స్వప్రయోజనాల కోసం రాస్ట్రాన్ని అభివృద్ధి కాకుండా చూస్తున్న ఈ ముఖ్యమంత్రుల లీలలకి ఎత్తిపోతలు ఎన్నడో? తెలుగోడికి ఈరోజు మొండి చెయ్యి చూపించి అమ్మగారు తన గొయ్యి తానే తవ్వుకుంది, మీరేమంటారు?


సివరాఖరి కొస్తే ఈ వీకీ లీక్స్ బాబాయ్ భలే సమాచారం తెచ్చాడు, స్విస్ బాంకుల్లో ఖాతా దారులయిన భారతీయుల చిట్టా విప్పుతానని బెదిరిస్తున్నాడు. ఆ విషయం తొందరలో బయటకు వస్తుందని ఆశిస్తున్నాను. వస్తుందంటారా? ఎదో ఆశకి కూడా ఒక హద్దు ఉండాలంటారా?
  

No comments: