Sunday, January 30, 2011

సూళ్ళూరుపేట కబుర్లు




నేను కాలాస్త్రికి వచ్చిన ప్రతిసారీ సూళ్ళురుపేట చుట్టూ తిర్గడం మామూలు విషయం. ఎందుకంటే నాకు కాలాస్త్రిలో కంటే సూళ్ళూరుపేటలో ఎక్కువ స్నేహితులు కాబట్టి.




సూళ్ళూరుపేట నెల్లూరు జిల్లాకి దక్షిణం అంచులో ఉంటుంది. ఒక పది కిలోమీటర్లు కిందకి వెళ్తే తడ, దాని తర్వాత ఇక తమిళనాడే! అందుకే మనం చంటి, చినరాయుడుకి ముందే చిన్న తంబి, చిన్న గౌండర్ చూసేసే వాడిని. సబర్బన్ రైళ్ళనెక్కి మద్రాసుకి బాగా తిరుగుతూ ఉండేవాడిని. ఆ జ్ఞాపకాలని మళ్ళీ తవ్వుకోవడం కోసం ప్రతిసారీ సూళ్ళూరుపేట వెళ్ళడం, పాత మిత్రులని కలవడం నా సాంప్రదాయం. 




ఈ వూరిలో ఉన్న చెంగాళమ్మ గుడికి ఈ చుట్టుపక్కల బాగా పేరు. చెంగాళమ్మకి జరిగే తిరునాళ్ళలో ఒక పెద్ద వెదురు కర్రకి ఒక మేకని కట్టి ఆ కర్రని ధ్వజ స్తంభం చుట్టూ మూడు సార్లు తిప్పుతారు. ఇలా తిప్పడాన్ని సుళ్ళు ఉత్సవం అంటారు, ఆ పేరు మీదుగా ఈ ఊరికి సూళ్ళూరుపేట అని పేరు వచ్చిందనమాట. 




నాకు ప్రియ మిత్రుడయిన నెల్లూరు పెద్దారెడ్డి ఉండేది ఇక్కడే. గత అయిదు సంవత్సరాలుగా మా పెద్దారెడ్డి ఇల్లు కడుతూ ఉన్నాడు. పసలపూడి కథ 'రామశేషా రెడ్డి ఇంద్రభవనం' లాగ మావాడు ఇక్కడ ఒక ఇంద్రభవనం కట్టిస్తూ ఉన్నాడు. బందరు రోడ్డు, కూకట్ పల్లి తిరిగి నచ్చక కోయంబేడులో మలేషియా జకూజి ఒకటి కొన్నాడు. పార్కింగ్ టైల్స్ తిరుపతిలో కొన్నాడు. ఇంటిలో చెక్క సామానంతా కాలాస్త్రికి చెందిన కంసాలి వాళ్ళతో రోజువారీ కూలీ కింద చేపిస్తున్నాడు. ప్లబింగ్ సామాన్లు మద్రాస్ లోని పారిస్ నుంచి తెప్పిస్తున్నాడు. ఇంటి నిండా మేస్త్రీలు, ప్లంబర్లు, కొయ్య పని వాళ్ళతో మా సందడిగా ఉంటుంది. ఫాల్స్ సీలింగు, మిద్దె పైన బ్రోకన్ మార్బెల్స్ అబ్బబ్బ..ఒకటేమిటి, మీరు కనక ఇటు వస్తే తప్పకుండా ఒకసారి ఇల్లు చూసి వెళ్ళండి.




పెద్దారెడ్డి సూళ్ళూరుపేట రాజకీయాల్లో బాగా పూసుకు తిరుగుతాడు. ఇపుడు మావాడు జగన్ పార్టీ అని మీకు కొత్తగా చెప్పక్కరలేదనుకుంటా. మా వాడు రోజూ 'సాక్షి' చదువుతాడు, 'సాక్షి' చూస్తాడు. మా ఊర్లో ఉన్న చౌదరి గారి ఇంటికి ఇతనే డబ్బులు కట్టి 'సాక్షి' పంపుతాడు. చౌదరి గారు మాత్రం తక్కువ తిన్నారా ? ఆయన డబ్బులు కట్టి పెద్దారెడ్డికి 'ఈనాడు' పంపుతాడు.





నా కాలేజి క్లాస్ మేటు సాఫ్ట్ వేరు వదిలేసి కిరాణా కొట్టు నడుపుతూ కనిపించాడు. అలాగే నా జూనియరు చెన్నైలో సిగ్నల్ ఇంజినీరుగా ఉంటున్నాను అని చెప్పాడు. నాకు కూడా సిగ్నల్ ఇంజినీరుగా పని చేయాలని చాలా ఆశగా ఉండేది, నా కోరిక ఇలా తీరడం హాయిగా అనిపించింది.



ఇక్కడ నుండి ఒక పదహారు కిలోమీటర్లు తూర్పు వైపు వెళ్తే శ్రీహరికోట వస్తుంది. దారి పొడుగునా రోడ్డుకి అటు,ఇటు పులికాట్ లేక్ పారుతూ ఉంటుంది. సూళ్ళూరుపేటలో కూడా ఇస్రోకి చెందిన మూడు,నాలుగు కాలనీలు ఉన్నాయి. వీళ్ళందరూ షాపింగ్ చెయ్యాలంటే సూళ్ళూరుపేటకి రావలసిందే, ఆదివారం అంగళ్ళన్నీ సందడిగా ఉంటాయి. అందుకే ఇక్కడ అంగళ్ళకి సోమవారం సెలవిస్తారు.




అలాగే నాయుడుపేటకి వెళ్ళే దారిలో దొరవారిసత్రం దాటగానే వచ్చే నేలపట్టు మీకు తెలిసే ఉండచ్చు. ఇక్కడకి అంటార్కిటికా, చైనా, సైబీరియా నుండి పెలికాన్ పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడ గుడ్లు పెట్టి, పిల్లల్ని పెంచి తమతో 
వాటిని తీసుకుపోతాయి. ఈ విహారకేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం బాగనే అభివృద్ధి చేసింది. సూళ్ళూరుపేట నుండి పది కిలోమీటర్ల దూరంలో 
ఉన్న ఈ ప్రదేశం చూడదగింది. అవండీ, సూళ్ళూరుపేట కబుర్లు.






3 comments:

cbrao said...

కబుర్లు బాగున్నాయి. పులికాట్ సరస్సులో నౌకా విహారం చేస్తూ అక్కడి దీవులు, ఫ్లెమింగో పక్షులను సందర్శించారా?

Sujata M said...

abba ! chaalaa baavunnaayi 'sooLLooripet kadhalu'.

శ్రీ said...

@సీబీరావు, అవునండీ,పక్షులని చూసాను.నౌక విహారమయితే చెయ్యలేదు.
@కత్తి, నెనర్లు
@సుజాత, నెనర్లు