Friday, February 4, 2011

కొల్లాయిగట్టితేనేమి? - కాలాస్త్రి పరిశీలన




ఈ సంవత్సరం డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ చదవబోయే పుస్తకాలలో 'కొల్లాయిగట్టితేనేమి?" కూడా ఒక పుస్తకం. గత రెండు సంవత్సరాలుగా నవోదయా రాం మోహనరావు గారి దగ్గర స్వయంగా పుస్తకాలు కొంటున్నా, ఇంతకు ముందు సీ మెయిలు, ఈ మెయిలు లాగా వచ్చేవి ఈ పుస్తకాలు. కాలాస్త్రిలో ఖాళీగా ఉన్నందువల్ల పుస్తకాలన్నీ తిరగేసేస్తున్నా. ఇప్పటికీ రంగనాయకమ్మ 'అంధకారంలో', కేశవ రెడ్డి 'అతడు అడవిని జయించాడు ', మహీధర రామమోహనరావు 'కొల్లాయిగట్టితేనేమి ' చదివేసాను. దాశరధి రంగాచార్య వ్రాసిన 'జీవనయానం' ప్రస్తుతం చదువుతుంట.  




కొల్లాయిగట్టితేనేమి నవలకి 1968 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. స్వాతంత్ర్య పోరాటాల మీద మనం చాలా వ్యాసాలు, చారిత్రక సంఘటనల గురించి బాగానే విని ఉంటాం. ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే ఆ సమయంలో అప్పటి మనుష్యుల మధ్య జరిగిన వాస్తవ స్థితిగతుల గురించి ప్రస్తావించటం. వారి మీద గాంధీ గిరి ప్రభావం ఎలా ఉండేది ? అన్న విషయాలు మనం ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు. 1920 నుండి రెండేళ్ళపాటు జరిగిన కథే ఈ నవల. ఈ నవలకి సీక్వెల్స్ దేశం కోసం, జ్వాలాతోరణం అట. ఇవే పాత్రలని తరువాత కూడా వాడుకున్నారట. 



రామనాధం రాజమండ్రిలో కాలేజీ కుర్రాడు, బ్రిటీషోళ్ళ కాలేజీలో చదివి వాళ్ళకే పని చెయ్యాల్సివస్తుందని స్వాతంత్రోద్యమంచే ప్రభావితుడై కాలేజీ మానేసి ఇంటికి బయలుదేరుతాడు. ముంగండ ఒక బ్రాహ్మణ అగ్రహారం. అగ్రహారం మడి, అచారాలు, మాల వాళ్ళని చెరువులోకి దిగనీయకపోవడం లాంటి కట్టుబాట్లన్ రామనాధం ఖండిస్తాడు. ఊరికే ఖండిచెయ్యడమే కాకుండా మాలవాళ్ళు తన తోటలో బావి వాడుకునేలా పోరాడుతాడు. అసలు చెరువే వాడుకునేలా రామనాధం, రచయిత సాహసం చేయలేకపోయారు.


రామనాధంకి చిన్నపుడే సుందరితో పెళ్ళయిపోతుంది. ఇంకా పెళ్ళికి ఎదగని పెళ్ళాంతో కాపురం చెయ్యనని పెంచిన తండ్రికి చెప్తాడు. ఇది మామగారింటికి వెళ్ళి ఆయనకి నచ్చచెపుదాము అనుకునే సమయంలో కథ ఒక అద్భుత 
మలుపు తిరుగుతుంది. సరిగ్గా ఇక్కడనుండే నాకు కథ మీద మంచి ఆసక్తి కలగడం మొదలయింది. తండ్రి అధికార దుర్వినియోగం సుందరి కాపురంలో చిచ్చుబుడ్లని (అంటే చిచ్చు రగిలించాయి అని పాఠకులు చదువుకోగలరు) వెలిగిస్తాయి. అలేజీ మానేసి ఇంటికి లాంచిలో తిరుగు ప్రయాణంలో స్వరాజ్యం ని కలుస్తాడు రామనాధం. స్వరాజ్యంకి కూడా ఇంతకుమునుపే పెళ్ళి అయి ఉంటుంది. స్వరాజ్యంకి పై చదువులు చదవాలని ఆశ, చేసుకున్నోడు అందుకు ఒప్పుకోక పెళ్ళిని పెటాకులు చేస్తాడు. ఒకే లాంచిలో ప్రయాణం చేసిన రామనాధం, స్వరాజ్యం కలిసి జీవితం పంచుకోవడంతో లవ్ స్టోరీ ముగుస్తుంది. గాంధి బెజవాడ రావడం, అక్కడ నుండి ముంగండ రావడం ఆసక్తికరంగా ఉంటాయి.  


మొత్తానికి నవలంతా స్వాతంత్ర్యం కంటే బ్రాహ్మణులనే ఎక్కువ టార్గెట్ చేసింది. తెల్లవాళ్ళని తరిమికొట్టడమే కాకుండా ఉన్నవాళ్ళని సంస్కరించుకోవడం కూడా స్వాతంత్రోద్యమంలో భాగమే అని ఈ నవల మనకు చెప్తుంది. నవలతో పాటూ చివరలో వ్యాసాలు తప్పక చదవాల్సిందే! అసలు నవల ఎందుకు వ్రాయాల్సింది ? అని రామమోహన్రావు గారి వ్యాసం చదివాక మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. 



5 comments:

సుజాత వేల్పూరి said...

అబ్బ, ఇంకొంచెం రాసి ఉండవలసింది మీరు! ఈ నవల్లో రామనాథం భార్య అతడితో అహంకారంగా ప్రవర్తించడం, అతడు ఆత్మాభిమానంతో తిరిగి వెళ్ళిపోడం బాగుంటాయి. స్వరాజ్యంతో అతడి ప్రేమ కథ కూడా బాగుంటుంది. అసలు తన తోటలో బావి నీళ్ళు వాడుకోవడం వరకు చేసిందే పెద్ద సాహసం ఆ రోజుల్లో! నిజానికి అలా ప్రవర్తిస్తే కులం నుంచి వెలి వేసే సందర్భాలు లేకపోవు. ఇక చెరువు దాకా హరిజనుల్ని రానివ్వడం అసాధ్యం ఆ రోజుల్లో! అందుకే రచయిత వాస్తవ దృష్టితో అంతవరకూ వదిలిపెట్టారు.

రైల్వే స్టేషన్లో తుపాకీ కి ఎదురు నిల్చి చొక్కా విప్పి "కాల్చండి" అంటూ రామనాథం ఎదురు తిరగే ఘట్టానికి ప్రకాశం పంతులు గారు స్ఫూర్తి అనుకుంటా!

బ్రాహ్మల్ని టార్గెట్ చేసినట్లు అనిపించిందా! అది నిజమే కావొచ్చేమో...ఐనా అది పూలమాలలో దారంలా కల్సి పోయి ప్రత్యేకంగా కనిపించదు. అదీ కాక ఆ రోజుల్లో స్వాంత్ర్య ఉద్యమం అనగానే ముందుకొచ్చి పాల్గొన్న వారిలో బ్రాహ్మణులు అధిక సంఖ్యలోనే ఉండటం(అందరికంటే అధిక సంఖ్య అని కాదు), సంప్రదాయం, ఆచారాల కారణంగా వారి జీవితాల్లో ఏర్పడ్డ ఘర్షణ నవల్లో చెప్పడం అనివార్యమే అనుకుంటాను!

ఒకే లాంచిలో ప్రయాణం చేసిన రామనాధం, స్వరాజ్యం కలిసి జీవితం పంచుకోవడంతో లవ్ స్టోరీ ముగుస్తుంది. ....అయితే మీరు కూడా పెళ్ళితో ప్రేమ ముగుస్తుందని నిర్ణయించేశారా! హ హ హ!

శ్రీ said...

సుజాత గారు,
మొత్తం కథ రాయకుండా పాఠకులని నవల చదివేలా చేద్దామని ప్రయత్నించా.

మీరు చెప్పినట్టు స్వరాజ్యంతో కబుర్లు చాలా బాగుంటాయి. సుందరి మీదే పాపం, జాలి వేస్తుంది, తెలిసీ తెలియని వయసు, తండ్రి అహంకారం వళ్ళ పిల్ల సంసారం చెడుతుంది.

మీరు చెప్పినట్టు రామనాధం చొక్కా సీన్ ప్రకాశం పంతులు గారి స్పూర్తే అయి ఉండచ్చు.

లవ్ స్టొరీ ముగించడం అంటే నవలలో అంటున్నా, నా లెక్క ప్రకారం పెళ్ళి తర్వాతే అసలు ప్రేమ మొదలవుతుంది.

కొత్త పాళీ said...

బాగుంది. ఇంతకీ ఎప్పుడు పునరాగమనం?

సుజాత గారు,
"ఇక చెరువు దాకా హరిజనుల్ని రానివ్వడం అసాధ్యం ఆ రోజుల్లో!"
శ్రీపాద ఇల్లాంటి తవ్వాయి వస్తే ఏ సంవత్సరంలో రాశారు అంటారు?

శ్రీ said...

మార్చి అయిపోతుందేమోనండీ.

ఈ నెల చివరలో యాదగిరి గుట్టలో బావమరిది పెళ్ళి, అది చూసుకుని వచ్చేస్తా.

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారూ,
ఆలస్యంగా చూశా మీ వ్యాఖ్య! శ్రీపాద గారి పుస్తకాలు ఆట్టే చదవలేదండీ నేను! ఒకవేళ ఆయన నవల్లో అలాంటి సంఘటన ఏదైనా ఉంటే అది 'వాస్తవానికి దూరంగానే ఉంది" అనుకుంటానేమో! చదివాక చెప్తాను.