Saturday, April 16, 2011

దాశరధి జీవనయానం






"ఈసారి మనం చదవబోయే పుస్తకాల్లో దాశరధి రంగాచార్య రాసిన పుస్తకం ఒకటుందండీ" అన్నారు వెంకట మారమరాజు అఫీసులో నన్ను పలకరిస్తూ.

"అద్భుతం! దాశరధి పుస్తకం చదువుతున్నామన్నమాట!" అన్నాను.

"ఇతను దాశరధి రంగాచార్య! మీరనుకునే దాశరధికి తమ్ముడు" అని నన్ను సరి చేసారు వెంకట.

"అవునా? చిరంజీవి తమ్ముడు తెలుసు, నాగార్జున అల్లుడు తెలుసు. దాశరధికి తమ్ముడున్నాడని మీరు చెపితేనే తెలిసింది" అని తెలుగు సాహిత్యం మీద మనకున్న అవగాహనకి చింతించా.


లావుగా ఉన్న ఈ పుస్తకం చదవడానికి ముందుగా జంకినా, మొదలుబెట్టాక బాగనే ఉత్సాహంగా చదివాను.

ఈ పుస్తకం సీరియల్ గా స్వాతిలో వచ్చిందంట! ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే  దీని పొట్ట నిండా చాలా సమాచారం ఉంది. రెండు,మూడు ఎపిసోడ్స్ ఒకసారి చదవాలంటే చాలా ఓపిక ఉండాలి. అందుకే నేను ఈ పుస్తకాన్ని ఇంచుమించు మూడు నెలల పాటూ చదివాను.


తెలంగాణా గురించి మా ఆవిడ చెప్తే వినడమే కానీ, పుస్తకం చదివాక చాలా విషయాలు తెలిసాయి. స్వాతంత్ర్య పోరాటం కానీ, నిజాం ని ఎదిరించటంలో కానీ దాశరధి తెగింపు, ధైర్యం నిజంగా అద్భుతం!
పెద్దన్నయ్య వైష్ణవ చదువులు, రంగాచార్య వానాకాలం చదువులు, ఇంట్లో పూజలు, పునస్కారాల కబుర్లు చాలా బాగుంటాయి ఈ పుస్తకంలో. తన తల్లిని నాన్న ప్రతిరోజూ హింసించేవాడని, ఒక చెల్లిని కలరా మూలంగా పోగొట్టుకోవడం మన మనసుని కలచివేయక మానదు.


స్వాతంత్ర్యం ముందు కబుర్లు ఒక ఎత్తు! స్వాతంత్ర్యం తరువాత జరిగిన పరిణామాలని బాగా క్షోభ పడుతూ రాసారు. బాగా కష్టపడి ఉద్యోగంలో నిలదొక్కుకోవడం, చాలీ చాలని జీతంతో సంసారాన్ని పోషించడం కొంచెం బరువుగా రాసారు. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంటే రంగాచార్య చేసిన పోరాటాలు మనకి స్పూర్తిని కలిగిస్తూ ఉంటాయి.  



ఇంట్లో మగపిల్లలిద్దరూ సరిగ్గా ఇతన్ని అర్ధం చేసుకోకపోవడం ఇతని దురదృస్టం. ఆడపిల్లలు సుఖపడ్డారు, అదే పెద్ద సంతోషం!


1988 లో దాశరధి ఒకసారి నెల్లూరికి వచ్చారట, నేను కూడా ఆ సమయంలో నెల్లూరులోనే ఉన్నా. పెద్ద కొడుకు అప్పట్లో నెల్లూరులో ఉండేవాడట, నాకు అవకాశం ఉంటే కొడుక్కి క్లాసు పీకి ఉండేవాడిని. ఈ పుస్తకంలో పాప్-అప్స్ బాగా ఎక్కువ. ప్రతి సంఘటన పూర్తి అవగానే ఈ విషయాన్ని ఆ నవలలో రాసాను, దీని గురించి ఈ నవలలో వివరించాను అని కనీసం ఒక వంద సార్లయినా వస్తూ ఉంటాయి. ఇది చదివిన తర్వాత చచ్చినట్టు మిగతా నవలలు చదవాల్సిందే!


ఈ పుస్తకంలో కాలం బాగా గంతులు వేస్తూ ఉంటుంది. ముందుకీ, వెనక్కి ఎన్ని గంతులు వేసినా దాశరధి జీవనయానంలో ప్రయాణం సాఫీగానే ఉంటుంది. వీలు చేసుకుని ఒకసారి చదవండి.




5 comments:

oremuna said...

వచ్చింది వార్తా దిన పత్రికలో అనుకుంటాను. స్వాతీలో కాదనుకుంటాను.

jeevani said...

నేను చదివాను. నాక్కూడా చాలా నచ్చింది. హిపోక్రసీ లేకుండా బాగా రాశారు. మొన్న మరోసారి చదవాలని పుస్తకం తీయబోయాను. మా మిత్రుడు పాపిలా(యా)న్ తెలుగు అనువాదం ఇస్తే జీవన యానం అలానే ఉంచేశాను. రేపట్నుండి మొదలుపెడతాను. :)

శ్రీ said...

ఓ...వార్తలో రాసారా? స్వాతిలో అనుకున్నా.

తప్పకుండా చదవండి జీవని గారు

Unknown said...

hi sree ela vunnaru..nenu narasimha

శ్రీ said...

Iam good Narasimha!

Hope to see you in 2011 FCL!