Wednesday, August 3, 2011

హార్లీ డేవిడ్ సన్ మోటార్ సైకిల్స్




ఉద్యోగ ప్రయత్నం లో పోయిన శుక్రవారం షికాగో వెళ్ళాను. సాయంత్రానికి  షికాగోలో పని అయిపోయింది. రాత్రికి మకాం మిల్వాకీలో పెట్టాం. మా దోస్తు మామయ్య మిల్వాకీలో ఉంటాడు. షికాగో నుండి ఒక రెండు గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరాం. శుక్రవారం రాత్రి, మామయ్య ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. అమెరికా అప్పుల మీద ఇంచుమించు కొట్టేసుకుంటున్నారు అక్కడ! ఒకరు రిపబ్లికన్ పార్టీ, ఇంకొకరు స్వచ్చమయిన డెమొక్రాట్. మాటల తూటాలయ్యాక రెండో సారి భోజనం చేసి (అంతకు ముందే షికాగోలో భోజనం అయింది) పడుకున్నాం.


ఉదయం మా ఊరికి తిరిగివెళ్ళాలి. స్నానాలు, ఉప్మాలు అయ్యాక చాయ్ తాగుతూ మామయ్యతో కబుర్లు దొర్లాయి. ఈ ఊర్లోనే ఉన్న హార్లీ డేవిడ్ సన్ మ్యూజియం చూసి వెళ్ళండి అని ఒక ఉచిత సలహా పడేసాడు. మామూలు సలహాలయితే మనం ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ హార్లీ డేవిడ్ సన్! ఇంటి నుండి పది నిముషాలు అంతే, అదీ దారి మధ్యలో.  నేను ఒక బుడ్డి బైక్ నడుపుతాను, చిన్న బైకే అయినా విపరీతమయిన బైకర్ ని నేను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాను. నాలాంటి బైకర్ అసలు హార్లీ మ్యూజియం చూడకుండా వెళ్ళడం ఎలాగా?


హార్లీ డేవిడ్ సన్ బైకులు అంటే అమెరికన్లకి ప్రాణం కంటే ఎక్కువ. కనీసం 750 సీ.సీలతో ధడ ధడ లాడిస్తూ రోడ్లమీద హడావిడి చేస్తూ ఉంటారు ఈ బైకర్లు. తళ,తళ లాడుతూ ట్విన్ ఇంజిన్లు మెరుస్తూ బండి హైవే మీద పోతుంటే అందరూ తల తిప్పి చూడాల్సిందే. బైకు ఇంత హడావిడి ఉంటే ఇక బైకరు హడావిడి వేరేగా ఉంటుంది. కనీసం గడ్డం, లేకపోతే పొడుగు పోనీ టెయిల్ వొళ్ళంతా టాటూలతో చాలా హడావిడిగా ఉంటారు. 


1903 నుండి అమెరికా దేశ సంస్కృతిలో మమైకం అయిపోయింది హార్లీ డేవిడ్ సన్ మోటార్ సైకిళ్ళు. ఒక సమయంలో ఈ కంపెనీ మూతపడబోయింది. దీనికి కాపాడేందుకు ప్రభుత్వం, ప్రజలు చాలా కృషి చేసారు. హార్లీ వ్యాపారం కాపాడేందుకు బయటనుండి దిగుమతుల మీద శుంకాలు బాగా పెంచారు. దానితో యమహా, సుజుకీ మోటార్ సైకిళ్ళు కొనలేక హార్లీ డేవిడ్ సన్ కొనుక్కుని కంపెనీ మూతపడకుండా కాపాడుకున్నారు ఇక్కడి ప్రజలు. ప్రతి ఊరిలో హార్లీ డేవిడ్ సన్ క్లబ్బులు తప్పనిసరిగా ఉంటాయి. గుంపులు, గుంపులుగా క్రమశిక్షణతో రోడ్ మీద వెళ్తూ ఉంటారు. స్పోర్ట్స్ బైకర్లు అపుడపుడూ తోక జాడిస్తారేమో కానీ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా బండి నడుపుతారు. 


హార్లీ పుట్టు,పూర్వోత్తరాలతో మ్యూజియం చాలా బాగుంది. 1903 లో సైకిలుకే మోటారు పెట్టిన మొదటి మోడల్ నుండి ఇప్పటి బండ్లవరకు అన్ని చూడచ్చు. 1915 లో మొదటిసారి మోటార్ సైకిలుకి హెడ్ లైటు కూడా పెట్టచ్చని తెలిసినట్టుంది. అలాగే ప్రపంచ యుద్ధాల కోసం చేసిన బైకులు కూడా చాలా ఉన్నాయి. షోలే సినిమాలో మనం చూసిన సైడ్ కార్ లాంటివి కూడా ఇక్కడ చూడచ్చు. సైడ్ కార్ ఎక్కువగా యుద్ధాలకి వాడినట్టున్నారు. 


మోటార్ సైకిళ్ళు తయారుచేయడానికి రోబోట్ వాడే విధానం పై వీడియోలో చూడచ్చు. ఈ రోబోట్ ని ఫనూక్ రోబోట్ అంటారని కొత్తపాళీగారు చెప్పారు. కేప్టన్ అమెరికా కామిక్ కారక్టర్ కి చెందిన హార్లీని కూడా మీరు చూడచ్చు.


అలాగే రస్ మరియు పెగ్ కి చెందిన బైక్ కూడా ఇక్కడ చూడచ్చు. ఆ బైకుని సర్వాంగసుందరంగా అలంకరించి పెట్టారు. 


ఇంకొక బైకు పేరు కింగ్ కాంగ్, ఇది పేరుకి తగ్గట్టే చాలా భారీగా ఉంటుంది. ఒక సైకిలుని ఇద్దరు తొక్కడం మీరు చూసి ఉంటారు, ఇది అలాంటిదే. బైకు చాలా పొడవుగా ఉంటుంది.


కౌంటరులో నెల్లూరు పాప మాకు టిక్కెట్టు ఇచ్చేటపుడు "మ్యూజియం లో ఉన్న బైకులు తాకబాకండి, కొంచెం ముందు బొయినావంటే ఆడ ఆడుకొనే బండ్లు ఉంటాయ్. మీరు వాటితో ఆడుకోవచ్చు" అని వయ్యారంగా చెప్పింది. అక్కడ ఇంచుమించు పది వెరైటీలు ఉన్నాయి, నేను అన్నిటి మీదా కూర్చుని కాసేపు ఆడుకున్నా.


హార్లీ సిబ్బంది "సార్, సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలండి" అన్నారు. బాబోయ్, నేను రవితేజ కాదండీ అంటున్నా, వినలేదు. చేరన్ అనుకున్నారేమో అని "ఎంద చేట! నా చేరన్ అల్లె" అని చెప్పినా వినిపించుకోలేదు. ఇక వల్లకాక నా ఆటోగ్రాఫ్ ఇవ్వక తప్పలేదు.


2 comments:

రామ said...

మీ ఫైనల్ టచ్ బాగుంది :). మొన్న టోరి కి ఫోన్ చేసినట్టున్నారు? మనం (నాలా కొంచెం కొంచెం బ్లాగులు రాసేవాళ్ళు కూడా) ఇలా టోరి లాంటి వాటికీ ఫోన్ చేసినప్పుడు మన బ్లాగుల గురించి ప్రచారం చెయ్యాలండి మీరు చెప్పినట్టుగా. ఇంకా ఎక్కువ మంది రాస్తారు.

శ్రీ said...

థాంక్స్ రామ.

ఈమధ్య టోరీని బాగనే ఫాలో అవుతున్నా. ఒకసారి వంటల విషయంలో ఆర్ జే నా "బైంగన్ భార్య" టపా చదివారు.