అపుడే ఎనిమిది వికెట్లు పడిపోయాయి. ఫ్లెక్స్ టీం బౌలింగ్ ఈరోజు చాలా బాగుంది. ఎక్కువ రన్స్ కూడా ఇవ్వకుండా బాట్స్ మెన్ ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. బుల్లిట్ టీం చివరలో పవర్ ప్లే మొదలుపెట్టడంతో ఫీల్డింగ్ నుండి జగన్ బయటకి వచ్చాడు.
చీర్ లీడింగ్ చేస్తున్న నా దగ్గర కొచ్చి "ఒక కవి గారు మా ఇంటికి వస్తున్నారండీ, మీరు మా ఇంటికి రావాలి" అన్నాడు.
ఖాళీగా ఉన్న నా కాలెండరు మరొకసారి చూసుకుని "తప్పకుండా" అని చెప్పా.
నా ఇంకొక మిత్రుడు గణేష్ తో కలిసి వెళ్ళి ఉండాల్సింది, కొన్ని అనివార్య కారణాలవల్ల నేను ఒక్కడినే వెళ్ళాను.
జగన్ ఇంటికి చేరుకోగానే అందరూ బయటే నా కోసం ఎదురు చూస్తూ నిలుచున్నారు. (వాతావరణం బాగుండడం వలన అందరూ బయట ఉన్నారని తర్వాత తెలిసింది).
పరిచయ కార్యక్రమాలయ్యాక అందరం బయటే కుర్చీలేసుకుని కూర్చున్నాం.
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డిగారి వయసు యాభై చిల్లర ఉంటుంది. కొంచెం నలుపేమో, తెల్ల చొక్కా వేసుకుని జేబులో పెన్ను పెట్టుకుని నల్లని జుట్టుతో హుందాగా కనిపించారు. కొండ్రెడ్డి గారు ప్రకాశం జిల్లా కనిగిరిలో పని చేసేవారు, ఉద్యోగం అయ్యాక కవిత్వంలోకి దిగానని చెప్పారు. రెడ్డిగారి భాష నెల్లూరు యాసలో ఉండడం నాకు బాగా నచ్చింది, ఇద్దరం ట్రంకు రోడ్డులో కూర్చుని మాట్లాడిన అనుభూతి కలిగింది.
తను రాసిన "విలక్షణ నేత్రం" గురించి చెప్పారు. ఈ పుస్తకంలో వెయ్యి పద్యాలు రాసానని చెప్పారు, వేమన కవి లాగే కొండ్రెడ్డి గారు కూడా తన పద్యాలని ఆటవెలది లో రాసారు. 'విలక్షణ నేత్రం' నుండి కొన్ని పద్యాలని చదివి వినిపించారు. పద్యాలన్నీ సరళంగా, సులభంగా అర్ధమయ్యాయి.
ఈ పుస్తకంలో వెయ్యి పద్యాలు చూసి మా మల్లెమాల సుందరరామిరెడ్డిగారు "ఏందయ్యా...పద్యాలంటే ఏవో వంద ఉంటే చాలు, ఇన్ని రాసి పారి నూకా వేందీ" అని తన సహజశైలిలో మాట్లాడారట.
"అతని రాక కోసం" నుండి "టీ కొట్టు నర్సిమ్మ" కవిత నాకు వినిపించారు. ఆ కవితని కొంచెం మీకు రుచి చూపిస్తా...
పొద్దు కళ్ళు విప్పీ విప్పకముందే
పంటచేను మీద పరిగె పిట్టలు వాలినట్ట్లు
నాలుగు రోడ్ల కూడల్లో
నర్సిమ్మ టీ కొట్టు నిండా "కస్టమర్స్"
నిండిపోతుంటారు
ఆకాశాన్నుంచి రంగురంగుల పావురాళ్ళు
నేలమీద వాలినట్లు ఎన్నో వారపత్రికలు
టీకొట్టు బల్లలమీద దర్శనమిస్తుంటాయ్!
ప్రభుత్వ గ్రంధాలయం
పొద్దుటే తెరిచారనిపిస్తుంటుంది!
ఈ కవిత వినిపించేముందు నర్సిమ్మ గురించి చెప్పారు.
నర్సిమ్మ టీ తయారు చేస్తూ ఉంటే "అతని చేతి వేళ్ళ మధ్య నుండి జలపాతం ఉరుకుతుందట"!
"నరసింహ కాదు, నర్సిమ్మ" అని మళ్ళీ చెప్పారు. అంటే నిజ జీవితంలో ఎలా మాట్లాడుతామో అలాగే కవితలో చెప్పారనమాట. పేరుతో పాటే నర్సిమ్మ జీవితాన్ని కూడా కవితలో అలాగే చూపించారు.
రైతుల గురించి చాలా మందే కవితలు రాసారు. కొండ్రెడ్డిగారు రైతు కూతురు గురించి "కాపు పిల్ల" లో చెప్పారు. ఇది విని నాకు సుద్దాల అశోక తేజగారు రాసిన "ఆకుపచ్చ చందమామ" గుర్తు వచ్చింది.
"అతడు (మహేష్ బాబు కాదు) ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు" లో అతని గురించి చాలా చక్కగా చెప్పారు. అతడు ఖాళీ చేసింది ఇల్లు ఒక్కటే కాదని తెలుస్తుంది పూర్తిగా చదివాక.
"అతని రాక కోసం" కవితలో ఎన్నారై కోసం ఎదురు చూస్తున్న ఒక ఊరు గురించి రాసారు.
అర్ధరాత్రి వరకు కవితలతో కాలక్షేపం సాగింది. కొండ్రెడ్డిగారి పుస్తకం "అతని రాక కోసం" నాకు ఇచ్చి చదవమన్నారు. పుస్తకం మీద బొమ్మ చూసి "అక్బర్" వేసాడేమో అనుకుని పేరు కోసం వెతికాను.
"బొమ్మ నేనే వేసుకున్నాను" అని కొండ్రెడ్డిగారన్నారు.
మోడరన్ ఆర్ట్ లాగా చాలా బాగుంది. వెంకటేశ్వర రెడ్డిగారికి చిత్రకళలో కూడా ప్రావీణ్యం ఉందట! మళ్ళీ మా వూరు వచ్చినపుడు తను వేసిన చిత్రాలను తీసుకువస్తానని చెప్పారు.
4 comments:
ఏంటి ఇదంతా మనూళ్ళోనే? ఒక ముక్క ముందు చెప్పొచ్చుగదా!
అవునండీ. బుధవారం రాత్రి జరిగింది ఈ కార్యక్రమం.
కొండ్రెడ్డి గారు పక్క రోజే లూయీవిల్ వెళ్ళిపోయారు. వారాంతం కాకపోయేసరికి ఎవరికీ చెప్పలేకపోయాను (గూగూల్ ప్లస్సులో మాత్రం పెట్టాను).
ఈ వారాంతం మన క్లబ్బు చర్చకి రమ్మని ఆహ్వానించా. వస్తానని అన్నారు, వస్తే మా ఇంట్లో కలుద్దాం.
వెంకటేశ్వర రెడ్డి గారి కవితలు చదవాలన్న ఆసక్తి కలిగించారు...
తప్పక చదవండి.
Post a Comment