Thursday, September 8, 2011

Rubber (2010) - Black / Dark Humor



ఒక నెల ముందు ఈ సినిమా చూసానేమో! మంచి సినిమాలకోసం వెతుకుతూ ఇదేదో ప్రత్యేకంగా ఉంటే ఒక అర్థరాత్రి పూట దీన్ని చూడడం మొదలుపెట్టా. ఒక పది నిముషాలు చూసాక నాకు పిచ్చి మొదలయిందేమోనని కంగారు పడ్డా. లక్కీగా మాకిది మామూలే అన్నట్టు, కాసేపటికి నిద్రలో జారుకున్నాను.

పక్క రోజు కాఫీ తాగేటపుడు "నిన్న చూసిన సినిమా" గురించి కాసేపు మిత్రులకి పరిచయం చేసి నవ్వుకున్నా. మళ్ళీ ఇంకో రోజు "నేను నిద్ర పోయిన ఆరోజు" ఏమయిందో తెలుసుకుందామని మళ్ళీ సినిమా చూడడం మొదలుపెట్టా. ఈసారి నాతో పాటు మా తమ్ముడు కూడా కూర్చుని చూసాడు, సినిమా మీద మనం ఇచ్చిన బిల్డప్ అలాంటిది. ఈసారి కొంచెం ఎక్కువే చూసి పడుకున్నా. అవును, ఈసారి కూడా పూర్తిగా చూడలేదు. ఒక అరగంట సినిమా మిగిలింది.

ఈరోజు ఫేసుబుక్కులో ఈ సినిమా మీద చర్చ జరిగింది. మన ప్రియమయిన బ్లాగరు రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు సినిమాని నా స్టెయిలులో సమీక్ష చేయమన్నారు.  అలుపెరగ కుండా ఎడా,పెడా సినిమాలు చూసేసి బ్లాగేస్తున్న నన్ను చూసిన సినిమా గురించి బ్లాగమంటే ఆనందం తట్టుకోలేకపోయాను. ఇంత కన్నా ఏమి కావాలి ఏ బ్లాగరుకన్నా?  ఇందాకే మిగిలిన అరగంట సినిమా కూడా చూసేసి "మమ" అనుకున్నాను.

మూడుసార్లు సినిమా చూసినా మొదటి అరగంట మళ్ళీ అదే ఉత్సాహంగా, ఆసక్తిగా చూసాను. మొదటి అరగంటే ఈ సినిమాకి ప్రాణం. 

"స్పిల్ బర్గ్ తీసిన ఈ.టీ సినిమాలో ఏలియన్ గోధుమ రంగులో ఎందుకుంటుంది? ఏమో, కారణం లేదు. జే.ఎఫ్.కే. సినిమాలో ప్రెసిడెంటుని చివరలో ఎవడో గొట్టం గాడు ఎందుకు కాలుస్తాడు? ప్రేమ సినిమాలలో ఎందుకు నాయకుడు, నాయిక విపరీతంగా ప్రేమించుకుంటారు? ఇలా చాల సినిమాల్లో కారణం లేకుండా కథ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా కూడా అలాటిదే! ఆ లెక్కకొస్తే జీవితం కూడా ఇంతే!" 

ఒక పోలీసు ఇలా ఉపోద్ఘాతం ఇచ్చి సినిమా మొదలు పెట్టిస్తాడు. ఒక ఇరవై, ముప్పై మంది ఈ సినిమాని మనతో పాటూ బైనాకులర్సులో చూస్తూ ఉంటారు. రాబర్ట్ అనే టైరు నిద్ర లేచి, రోడ్డెక్కుతుంది. ఈ రాబర్టు మన సమరసిహ్మా రెడ్డి లాంటోడు. కంటి చూపుతో ప్లాస్టిక్ బాటిల్, కాకి, కుందేలు, బీరు కానులని చంపేస్తూ, పేల్చేస్తూ ఉంటాడు. రోడ్ మీద కారులో వెళ్తున్న ఒక యువతిని వెంబడిస్తూ ఆమె బస చేసిన హోటల్ చేరుకుంటాడు. ఇక అడ్డం వచ్చిన వాళ్ళని మన టైరు చంపడం, పోలీసులు టైరు చేసే హత్యలని పరిశీలించి దాన్ని వెంటపడడం ఇలా కథ సాగుతుంది.  

ఈ సినిమా చూస్తున్నంత సేపు "ఇలా కూడా సినిమా తియ్యచ్చా" అని అనిపిస్తుంది. కొత్తగా ఆలోచించి చేసిన ఈ ప్రయోగం కొంచెం వింతగా ఉంటుంది.  ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన "కారు దిద్దిన కాపురం" సినిమాలో కారులో ఏదొ ఆత్మ ఉండి దానికదే నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో టైరు కూడా ఇలాగే వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. హోటలులో టీవీ చూస్తుంది, స్నానం చేస్తుంది, రాత్రి అయితే పడుకుంటుంది.  కోపం వస్తే చంపేస్తుంది.

టైరు సంగతి పక్కన పెడితే సినిమాని చూస్తున్న ప్రేక్షకులు భలే తమాషా! టైరు ఎక్కడకి వెళ్ళినా దాన్ని చూస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళద్వారా కథను మనకి తెలియజేస్తూ ఉంటాడు దర్శకుడు. టైరు పడుకున్నపుడు వీళ్ళు పడుకోవడం, అది నిద్ర లేచినపుడు వీళ్ళు నిద్ర లేచి మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం చూడడం వింతగా ఉంటుంది. 

సినిమాలో హింస కొంచెం ఎక్కువ ఉంటుంది. టైరు కోపంతో మనుషుల తలకాయలు పేల్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని చిన్న పిల్లలు లేనపుడు చూడండి.

3 comments:

గీతాచార్య said...

Nice review brother. your style is seen kickingly, అంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తోందీ అని కహృ

Rajendra Devarapalli said...

Thanks a Ton.

శ్రీ said...

@ గీతాచార్య, థాంక్స్.

@ రాజేంద్ర, వెల్కం.