Friday, June 8, 2012

షాంఘై - రాజనీ(భీ)తి


కొన్ని సంవత్సరాల ముందు ఎవరిదో వ్యాసం, ఎక్కడో చదివాను. ఒక దశాబ్దం నుండి భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆనందపడుతూ, దాని రెండో వైపు ఇంకా నలుగుతున్న మానవ జాతి గురించి ఆందోళన పడుతూ రాసారు. ఒక వైపు ఆకాశాన్ని అంటుతున్న కట్టడాలు, ఇంకో వైపు ఆకలితో లోపలికెళ్ళిపోతున్న కొందరి పొట్టలు! ఇదే విషయాన్ని మనందరికీ గుర్తుచెయ్యడానికి ఈ సినిమా తీసారేమో అని నాకనిపించింది.  పదవి, అధికారం, డబ్బు వ్యామోహంలో నడిచే రాజకీయ చదరంగం ఈ సినిమా. 

ఈ సినిమా దర్శకుడు దిబాకర్ బెనర్జీ ఇంతకు ముందు అభయ్ డియోల్ తో ఓయ్ లక్కీ..ఓయ్ లక్కీ సినిమా తీసాడని ఇందాకే చదివాను.  సినిమా మొదటి సగం అయిదు నిముషాల్లో అయిపోయిందేమో అనిపించింది. రెండున్నర గంట మనల్ని కట్టి పడేసే సినిమాలల్లో ఇదొకటి.  


నాకు అభయ్ డియోల్ నటన బాగా నచ్చుతుంది. అమ్మాయిల లవర్ బాయ్ ఇమ్రాన్ మనకి పెద్దగా నచ్చడు.  ఈ సినిమాలో నా అంచనాలని తారుమారు చేసి సిమెంటు రోడ్ వేసారు ఇద్దరూ. ఈ పాత్రకి తగ్గట్టు ఇమ్రాన్ అద్భుతంగా నటించాడు. తమిళవాడిగా నటించడంలో అభయ్ ఫెయిల్ అయ్యాడు. ఒక్క తమిళ వాసన తప్పితే అతని నటనలో లోపం లేదు. ఇక కల్కి యధాతథంగా బాగనే చేసింది.  చాలా రోజుల తర్వాత ఫరూఖ్ షేక్ కనిపించాడు.

సినిమా కథలోకి వస్తే భారత్ నగర్లో కొత్తగా కట్టబోయే హై టెక్ సిటీ కోసం బస్తీలోని ప్రజల్ని ఖాళీ చేపించాలని అధికారంలో ఉన్న పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇది అడ్డుకోడానికి వచ్చిన ప్రొఫెసర్ నాటకీయంగా  ఒక దుర్ఘటనలో తీవ్రంగా గాయపడతాడు.  ఈ ఘటన  మీద ప్రభుత్వం ఒక కమిటీని వేసి అభయ్ భయ్యాని కేసు పరిశోధించమంటుంది. భయ్యా తీగ లాగితే డొంకంతా కదిలి వస్తుంది. ఈ తీగ లాగడానికి కల్కి, ఇమ్రాన్ భయ్యా సహాయపడతారు.

ఊరు నుండి పారిపోయి వచ్చి అన్న దగ్గర ఫోటోగ్రాఫర్ గా పని చేసే పాత్రలో ఇమ్రాన్ జీవించాడు. కొన్ని సీన్లలో ఇతని నటన నాకు బాగా నచ్చింది. ప్రొఫెసర్, అతని భార్య కూడా బాగా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు ఇదేదో నిజంగా జరిగిన కథనే చూస్తున్నామేమో అనిపిస్తుంది. సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిని అభినందించాల్సిందే. 

ఈ సంవత్సరం రెండు అద్భుతమయిన బెంగాళీ సినిమాలు కహానీ, ఇపుడు ఇది.  మన చుట్టూ నడుస్తున్న, జరుతుతున్న, రగులుతోన్న చరిత్ర చూసి గగుర్పాటు చెందాలంటే ఈ సినిమా చూసి తరించాల్సిందే!

 మన టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులు ఎందుకో రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు తియ్యరు, ఎవరో కొద్ది మంది తప్ప. ఎంత సేపూ ప్రేక్షకుడిని మాయలో ఉంచి వాడి దగ్గర ఉన్న నాలుగు రూపాయలు గుంజి, వాడికి కాసేపు కితకితలు పెట్టి ఇంటికి పంపేస్తారు. కోలీవుడ్, బెంగాళీ వుడ్   (వీళ్ళు ఏ వుడ్డో? నాకు తెలియదు)  సినిమాలు వాస్తవానికి దగ్గరలో ఉంటాయి.  ఎందుకంటారూ?


 



3 comments:

Rajendra Devarapalli said...

చాలా బాగా రాసారు.నిన్న రాత్రే డీవీడీ బుక్ చేసుకున్నా,
బెంగాల్ సినిమాలు తీసే ప్రాంతం Tollygunge
వాళ్ళు సరదాగా మా టాలీవుడ్ అని పిలుచుకుంటారు.
దాన్ని మనవాళ్ళు సిగ్గులేకుండా వాడుకుంటున్నారు.

Anonymous said...

"...దాన్ని మనవాళ్ళు సిగ్గులేకుండా వాడుకుంటున్నారు..."

అసలు టాలీగంజ్ లో సినిమాలు తీస్తారనే విషయమే మనవాళ్ళకి తెలీదు. ఇహ వాళ్ళని కాపీకొట్టేదేముంటుంది ? మనవాళ్ళ టాలీవుడ్ పదప్రయోగం హాలీవుడ్ అనేదానికి పూర్తిగా స్వతంత్ర అనుకరణ (ఇదేదో పవిత్రపాపిలా అనిపిస్తోంది). హాలీవుడ్ లోని హెచ్ తీసేసి తెలుగు అనే పదానికి మొదట వచ్చే T ని అక్కడ పెట్టి నిష్పాదించిన పదమే అది. ఇది సరదా కోసం చేసినదే తప్ప ఇందులో ఎవఱికీ ఏ విధమైన దురుద్దేశాలూ లేవు. టాలీగంజ్ ని బెంగాలీలు సరదాగా టాలీవుడ్ అని పిల్చుకుంటే బానే ఉంది గానీ తెలుగువాళ్ళు తమ ఇండస్ట్రీని టాలీవుడ్ అని పిల్చుకుంటే బాలేదా ? బెంగాలీల సరదాకున్న గౌరవనీయత ఏంటో తెలుగువాళ్ళ సరదాలో కుట్ర ఏంటో నాకర్థం కాలేదు. టాలీవుడ్ టాలీగంజ్ కి అనుకరణ అయితే మఱి బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇత్యాది పదాల సంగతి ? నైజీరియావాళ్ళు తమ సినిమా ఇండస్ట్రీని నాలీవుడ్ అని పిలుచుకుంటారు. మఱి దాని సంగతి ? వాళ్లందఱూ కూడా "సిగ్గులేకుండా బెంగాలీలని అనుకరిస్తున్నవాళ్లేనా ? ఇప్పుడు బెంగాల్ లో పెద్దగా చిత్రనిర్మాణం లేదు. అందుచేత ఏడాదికి వంద సినిమాలు తీస్తూ ప్రసిద్ధి వహించిన తెలుగు సినిమా పరిశ్రమకే టాలీవుడ్ పదప్రయోగం ఫిక్స్ అయిపోయింది.

హరే కృష్ణ said...

బాగారాసారు శ్రీ గారు
సినిమా చాలా అద్భుతంగా తీసాడు దిబాకర్ బెనర్జీ
ఇమ్రాన్ హష్మి mind blowing :)

Khosla ka Ghosla నుండి దర్శకుడు ఎక్కే మెట్టు జాగ్రత్తగా ఎక్కుతున్నాడు!