Monday, October 28, 2013

ఉల్లాసంగా డల్లాసంగా ఒక వారాంతం!

 
 

"ఈ శుక్రవారం మన టాంటెక్స్ వార్షికోత్సవం ఉందండీ! మన సాహిత్య వేదిక సభ్యులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసాము, మీరు తప్పక రావాలి" అని శ్రీమతి సింగిరెడ్డి శారద  గారు గత వారం జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో మాకందరికీ చెప్పారు. శుక్రవారం దియాని స్కూలు నుండి తొందరగా తీసుకుని శాన్ ఆంటోనియో నుండి డాలస్ బయలుదేరాము. మూడు నెలల ముందు వృత్తి పరంగా డాలస్ నుండి శాన్ ఆంటోనియో వచ్చినా వారాంతాలు మళ్ళీ ఉల్లాసంగా డాలసులో జరుపుకోవడమే ఆనవాయితీ అయిపోయింది. స్త్రీ ఆత్మ గౌరవం ఇంకొకసారి చాటి చెప్పడానికి మా ఆవిడ డాలసులో ఇపుడు ఉద్యోగం వెలగబెడుతుంది. ప్రతి వారం కాళ్ళకి అరిగిపోయిన బలపాలు తీసేసి కొత్తవి కట్టుకుని  వారాంతం సందడి కోసం చేసిన మా ఇంకొక ప్రయాణమే ఈ టపా.

హైవే మీద రెండు ఆక్సిడెంట్ల వలన కలిగిన ట్రాఫిక్ జాములు తప్పించుకుని వెనక సీటులో కూర్చున్న దియాని ఆడిస్తూ, పాడిస్తూ చీకటి పడే సమయానికి డాలస్ చేరుకున్నాం.  టాంటెక్స్ వార్షికోత్సవము ఇంకా మొదలవక ముందే చేరుకుని మిత్రులతో కబుర్లు సాగిస్తుండగా ఇరవై అయిదు సంవత్సరాలుగా ప్రజాదరణ పొందిన టాంటెక్స్ గురించి ఉరిమిండి నరసింహారెడ్డి గారు సభనుద్దేశించి ప్రసంగం మొదలు పెట్టారు. మొదటగా డాలస్ గురించి మాట్లాడిన రెండు మాటలు ఇక్కడ చెప్తాను.



"ఇపుడు డాలసులో ఒక కుటుంబం వంట చేసుకోవాలంటే సరుకులు కొనుక్కోవడానికి చుట్టుపక్కల ఒక పదికి పైగా మన దేశీ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. లేదూ, బయట తిందామంటే యాభైకి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి" అని చెప్పారు. ఈ విషయం డాలస్ బయటి వాళ్ళు వింటే అతిశయోక్తి అనుకుంటారు. నేను డాలసుకి వచ్చాకే ఎండాకాలం బంగిన పల్లి మామిడి పండ్లు తినడం మళ్ళీ మొదలుపెట్టా. రంజాన్ వస్తే హలీం తినచ్చు, ఆకలేస్తే  హైదరాబాద్ బిరియానీ తినచ్చు. గప్పాలు కొట్టుకోవాలంటే ఇరానీ చాయ్ తాగుతూ చెయ్యచ్చు. ఈ అనుభూతులన్నీ మనం పొందాలంటే భాగ్యనగరం వెళ్ళక్కరలేదు, అన్నీ మన డాలసులోనే దొరుకుతాయి. అతడు సినిమాలో కోటా డైలాగునే కొంచెం మార్చి "మన డాలస్ బాగా డెవలప్ అయింది. అన్నీ ఇక్కడే దొరుకుతాయి" అని చెప్పుకోవచ్చు.


తెలుగు గాయనీమణుల్లో సునీత గారి గొంతు అంటే మీలాగే నాకూ చాల ఇష్టం. అమృతగాత్రమంటే ఈమెదేనేమో అనిపిస్తుంది. మనం దిగుమతి చేసుకున్న హీరోయిన్లకందరికీ ఈమె గాత్రమే!  సునీత మాటలు వింటుంటే మనం గీతాంజలి సినిమాలో గిరిజ లాగా వానలో తడుస్తూ, గెంతులు వేస్తూ "ఒళ్ళంత తుళ్ళింత కావాలిలే" అని మన మనసు పాడుకుంటూ ఉండాల్సిందే! అన్నీ నాకు నచ్చిన పాటలు పాడడం విశేషం. సునీతకు తోడు శ్రీకృష్ణ మరియు బృందం అద్భుతంగా ఆ శుక్రవారం సాయంత్రం నాతో పాటూ అందరినీ పాటల పందిరిలో ఊయలలు ఊగించారు.  పాటలకి తోడుగా విందు భోజనం మా సాహితీ బృందానికీ, తోటి టాంటెక్స్ మిత్రులను అలరించింది.

శనివారం ఉదయం మెకిన్నీలోని ఆంజనేయుడి గుడి దర్శనం! ప్రసాద భోజనాలయ్యాక దగ్గరలో నున్న మిత్రుల సందర్శనం. చిరకాల మిత్రుడు కులతో కాసేపు కబుర్లు, పిల్లల ఆటలు అయ్యాక అక్కడకి దగ్గరలోనే ఉన్న శారద గారి ఇంటికి వెళ్ళి పలకరింపులు కూడా పూర్తి చేసాము.  ఎప్పటి నుండో శారద గారి ఇంటికి వెళ్ళలనుకుంటూ ఉండడం, ఈసారి కుటుంబసమేతంగా వెళ్ళడం బాగనిపించింది. సాయంత్రం కాసేపు షాపింగ్, తరువాత మళ్ళీ కుల, రాఘవతో జోరుగా కురుస్తున్న వానకి పోటీగా హోరుమని మా కబుర్లు సాగాయి. ఇక శనివారంకి సెలవు పెట్టేద్దామనుకున్న సమయంలో గత కొన్ని వారాలుగా మాకు డాలసులో ఆతిథ్యమిస్తున్న మిత్రులు, మా నెల్లూరి వాసులు గట్టు సునీలుతో అనుకోకుండా టాలీవుడ్ నైటుకి వెళ్ళాం.



మంచు లక్ష్మి అక్కయ్యని అనుకరిస్తూ సింగర్ మధు యాంకరింగ్ చాలా సరదాగా జరిగింది. సింగర్ కౌసల్య గారు, భార్గవి పిళ్ళై, రేవంత్ మసాలా పాటలు పాడి చలిచలిగా ఉన్న శనివారం రాత్రిలో వేడిని పుట్టించారు. రాజేష్ చిలుకూరి గారు ప్రేక్షకులతో కాసేపు ఆటలు ఆడించి అందరినీ ఆకట్టుకున్నారు. నచ్చావులే సినిమాలో నటించిన కథానాయిక మాధవీలత చాలా అందంగా, ముద్దుగా మాట్లాడి అందరి మనసులు దోచింది.సరదాగా సాగిన సాయంత్రం నుండి సెలవు తీసుకుని అర్థరాత్రి అవుతున్నా ఇంకా నిద్రపోని డాలసులో కాసేపు నగర సంచారం చేసి శనివారానికి సెలవు ఇచ్చేసాం.


ఇక ఆదివారం మధ్యాహ్నం రాయలసీమ వనభోజనాలకి బయలుదేరి సీమ మిత్రులతో సరదాగా గడిపాం. అందరూ ఇంటి నుండి ప్రత్యేకంగ చేసుకువచ్చిన వంటకాలు మాయాబజార్ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. రాగి సంగటి ముద్దలు, ఉడకబెట్టిన చనక్కాయలు, మెంతుల పప్పు, కోడి కూర, సాంబారు, వంకాయ వేపుడు, రవ్వ లడ్డ్లు, పుచ్చకాయలు, మొక్క జొన్నలు, దోసలు ...ఇలా షడ్రసోపేత భోజనం అందరికీ రాయలసీమ గుర్తుకు వచ్చేలా చేసింది. పిల్లలకి, పెద్దలకి ఆటలతో సందడిగా జరిగింది. మా కాలేజీ సీనియర్లు కొందరు ఈ కార్యనిర్వాహకులుగా ఉండడం వలన వాళ్ళని కూడా ఇక్కడ కలుసుకునేందుకు వీలు కలిగింది.

"ఏమండీ, మీ రాయలసీమ అంటే నాకు భయం అండీ...నేను రాను" అని మారాం చేసిన మా తెలంగాణ ఆవిడ ఈ కార్యక్రమంలో సీమ ఆడపడుచులతో కలిసిపోయి చక్కగా ఆటల్లో ఆడింది.


కార్యక్రమం చివరలో సహర్ష్ ఎక్కడా తడబడకుండా చక్కగా జాతీయగీతాన్ని ఆలపించి అందరినీ మైమరపింపజేసాడు. సమయాభావం వల్ల తొందరగా ఈ కార్యక్రమం నుండి బయటపడి రాత్రికి గూటికి చేరుకున్నాం.
అదండీ ఉల్లాసంగా,డల్లాసంగ జరిగిన మా వారాంతం కబుర్లు. ఈ ఒక్క వారమే ఇలా ఉంటుంది అనుకుంటున్నారేమో, ప్రతి వారం ఇదే హడావిడి! మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసి చక్కెర పాకంలో ముంచుతుంది మా డాలసు నగరం!

కృతజ్ఞతలు

టాంటెక్స్ వార్షికోత్సవ కార్యక్రమాలకు ప్రసాద్ గోల్కొండ గారి చిత్రాలు వాడుకోవడం జరిగింది, వారికి నా నమస్క్రారములు. అలాగే నచ్చావులే సినిమా కథానాయికతో నేను దిగిన చిత్రం తీసిన గట్టు సునీలుకి ధన్యవాదాలు. రాయలసీమ వనభోజనాలకి చిత్రసహకారాన్నందించిన బాలం రాధిక గారికి కృతజ్ఞతలు.
 

4 comments:

prince said...

శ్రీ...చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది మీ సమీక్ష.

శ్రీ said...

చాలా సంతోషం!

Unknown said...

your post is so nice.well said about dollas details sree.
http://www.googlefacebook.info/

శ్రీ said...

Thanks Ajay.