శివ సినిమా ఆంధ్రలో విడుదల అయి ఈ వారంతో పాతికేళ్ళయింది. ఈనాడులో వ్యాసం చూసాక ఆ సినిమాతో నా అనుభవాలు బ్లాగుదామని అనిపించింది.ఈ సినిమా విడుదల సమయానికి నేను నెల్లూరులో ఉన్న సర్వోదయా కాలేజీలో ఇంటరు చదువుతూ ఉన్నాను. దసరా సెలవలకేమో, తిరుపతి నుండి మా అన్న ఇంటికి వచ్చాడు. అన్నతో పాటూ పటాలం అందరం కలిసి సినిమాకి బయలుదేరాము. అది ఫాన్స్ షో, రాత్రి 12 కి రాఘవ సినీ కాంప్లెక్సులో సినిమా. ఆ రోజు ఏమి జరిగిందో నాకు సరిగ్గా గుర్తు లేదు, కానీ అదే సినిమాని నేను అదే హాల్లో నాలుగు సార్లు చూసానని బాగా గుర్తు. ఒక తెలుగు సినిమాని నేను అన్ని సార్లు చూడడం అదే మొదటిసారి. ఇపుడు యూట్యూబు, ఆ ట్యూబు అని చాలా గొట్టాల్లో ప్రతి సినిమాని ఇరవై సార్లు చూడడం అన్నది చాలా మామూలు విషయం.
ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి, వాటి గురించి కాసేపు మాట్లాడుకుందాము. ఈ సినిమాలో ప్రతి డైలాగు కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది, ఈ సినిమాకి వర్మ గారు చాలా కుండలనే వాడి ఉంటారు! విలన్లు కూడా చాలా సహజంగా ఉంటారు. వాళ్ళకి పెద్దగా మేకప్ చేసినట్టు లేరు, మనకి రోజూ కనిపించే రౌడీలలాగా ఉంటారు. కెమెరా పనితనం గురించి కూడా చెప్పుకోవాలి. సినిమాలో చేజింగ్ చూస్తూ ఉంటే మనమే వాళ్ళ వెనకాల పరిగెడుతున్నామా అనిపించేది. తెలుగు సినిమాలో అలా చేజింగ్ సీన్లు చూడడం ఈ సినిమా నుండే మొదలయ్యాయి. ఒక సైకిల్ చేజింగ్ సీనులో విలన్లు వాడే అంబాసడర్ కారు తర్వాత హీరో కూడా వాడుతాడు. రెండింటికీ ఒకే లైసెన్స్ ప్లేట్ ఉంటుంది. ఇళయరాజా గారి సంగీతం గురించి కొత్తగా చెప్పక్కరలేదు. చేజింగ్ సీన్స్ అన్నింటికీ సీటు అంచు మీద ప్రతి ప్రేక్షకుడిని కూర్చోపెట్టడంలో రాజాగారి పాత్ర చాలా ఉంది.
ఈ సినిమా గురించి మా మిత్రులు శేఖర్, చిలకా శ్రీధరుతో కలిసి బాగా చర్చించుకునేవాళ్ళం. అందరం ఇంటరులో ఉండడం వల్ల ఆ సినిమాలోని రౌడీయిజం బాగా నచ్చింది. అవసరమొస్తే ఎపుడయినా, ఏ సమయంలోనన్నా సైకిలు చైను తెంపేయాలన్న కసి ఉండేది. గొడవలెక్కడన్నా జరుగుతున్నాయేమోనని మా కాలేజీకి, పక్క కాలేజీకి తెగ సైకిలులో తిరిగేవాడిని. ఆ అవసరం ఎపుడూ రాలేదు, తర్వాత రోజుల్లో తెలిసింది సైకిల్ చైను తెంపడం మానవమాత్రుడికి సాధ్యం కాదని. ఆ సినిమాలో వాళ్ళు తెంపేది రబ్బర్ చైను అట.
నాకు అప్పటివరకు నాగార్జున పెద్దగా ఇష్టం ఉండేవాడు కాదు. విక్రం సినిమా వచ్చిన రోజుల్లో ఒకసారి నేను, మామయ్య రాపూరు నుండి దీపావళికి టపాసులు కొనుక్కుందామని గూడూరు వచ్చాం. బక్కపలచగా, నీరసంగా మాట్లాడుతున్న నాగార్జునని చూసి మా ఇద్దరికీ బాగా నీరసమొచ్చి రెండు, మూడు నిమ్మకాయ సోడాలు తాగి ఇంటికి వెళ్ళాం. ఆ రోజుల్లోనే సైదాపురం దగ్గర బ్రిడ్జి తెగిపోయి వరదల్లో బస్సు కొట్టుకుపోయింది కూడా. విక్కీదాదా సినిమాలో నాగార్జున నిలబడడానికి సపోర్టుగా ఒక కుక్కని కూడా పెట్టారు. అలాంటి నాగార్జునని వర్మ గారు చాలా వీరోచితంగా చూపించారు శివ సినిమాలో. అదే సంవత్సరం వచ్చిన గీతాంజలి సినిమా (నీరసంగా ఉన్నా కానీ) కూడా నాగార్జున రేంజి పెంచింది. 1989 సంవత్సరం నాగార్జున జీవితంలో బాగా గుర్తుండిపోయే సంవత్సరంగా మిగిలిపోయింది గీతాంజలి, శివ సినిమాల వలన.
రఘువరన్ పాత్ర కూడా ఈ సినిమాకి పెద్ద ఆకర్షణ. రెండు లారీలు తీసుకెళ్ళి నరికెయ్, శివ..శివ..శివా..అని అరిచే డైలాగులని హాలులో అందరూ శ్రద్ధగా వినడం నాకు గుర్తు. రఘువరన్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఈ శివ సినిమా పాత్రని మరిపించేలా ఇంకొకటి చెయ్యలేదని నేనంటాను. అలాగే తనికెళ్ళ భరణి కూడా నానాజీ పాత్రలో టూ మచ్ చేస్తాడు ఈ సినిమాలో. జేడీ, చిన్నా, శుభలేఖ సుధాకర్, అమల, ఉత్తేజ్ కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. నాగచైతన్య ఆరంగేట్రంలో మళ్ళీ జేడీని పెట్టి శివ కాలేజీ కథని వాడుకోవడంలో దర్శకుడు ఓటమిని చవిచూసాడు. ఈ సినిమాకి పోస్టర్లు కూడా కొత్తగా ఉండేవి. శివ అన్న పదాల మధ్యలో నాగార్జున మొహం ఉండడం, ఇంకా 50వ రోజు, 100వ రోజు పోస్టర్లలో అంకెలు 3డీలో లాగా బయటకు పొడుచుకొచ్చేవి.
ఈ మధ్య కాలంలో సిరాశ్రీ గారు వ్రాసిన "వోడ్కా విత్ వర్మ" లో ఈ సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. సినిమాకి దర్శకత్వం కోసం వర్మ గారు చేసే ప్రయత్నాలు పాకుడురాళ్ళు నవలని గుర్తుకు తెచ్చింది. తన కాలేజీ అనుభవాలని "రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్" సినిమాలో కలిపి మనకి శివ సినిమా అందించారని తెలిసి ఈ సినిమా మీద ఉన్న నా అభిమానం విలవిలలాడింది. కాకపోతే వర్మ గారి మీద గౌరవం పెరిగింది. క్వెంటిన్ టొరంటినో కూడా సినిమాలు తీసేముందు వీడియో పార్లరులో పనిచేసేవాడట. సినిమా అద్దెకు తీసుకోవడానికి వచ్చే వారికి మంచి సినిమాలు ఇస్తూ వాటి గురించి కస్టమర్లకి కథలు బాగా చెప్పేవాడట. వర్మ కూడా ఇదే స్కూలు అని ఈ పుస్తకం చదివాక తెలిసింది. తేజ కూడా ఈ సినిమాకి వర్మతో కలిసి పనిచేసాడని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చాలా తమాషాగా ఉంటుంది. అప్పటివరకు ఎవరూ రొటీనుగా తీసే షాట్స్ కాకుండా కొత్తగా తియ్యాలని ఇద్దరూ తపన పడేవారట. అందుకే సినిమా కూడా మనకి కొత్తగా కనిపించింది.
5 comments:
Good post. I Remember watching this movie in visakhapatnam after 60th day or so. I was a school kid but this was sensational movie that time. I remember people roamed with hockey sticks and another specially made item, not sure what was the name used for that "Nag hit the rowdy with that in the tea stall fight". Songs were wonderful, I liked Botany patamundi, Yenniyallo, sarasalu chaalu, hello wrong number songs. There were popular very short dialogues "chinna light arpa ra , chinna rod tiyyi".. etc, those were all new to Telugu cinema that time. Overall its a movie of two shades. It encouraged fights in colleges, some students were ruined. At the same time created new trend in dialogues, sounds, fights..etc.
Thanks Chandu. I was looking into your profile and saw few of your blogs. I will look into them this weekend.
shiva cinema appatlo sensational hit
అవునా చంద్రా? నాకు అక్క వాళ్ళు కూడా వచ్చారని గుర్తు. కాకపోతే అర్థరాత్రి చూసామని తెలుసు.
అవును రేఖ గారు.
Post a Comment