Monday, April 27, 2015

ఇంటి నుండి పని - మొదటి భాగం




నాకు చిన్నప్పటి ఆదివారం సాయంత్రం అంటే బాగా దిగులు ఉండేది. ఆ దిగులు ఇస్కూలు, కాలేజీ దాటి ఆఫీసులో చాకిరి చేసే వయసు వరకు వెంటాడేది. 

ఆదివారం సూర్యుడు మామయ్య అస్తమించగానే ఇంట్లో "రేపు స్కూలు ఉంది కదా! ఇంక ఆటలు ఆపి రేపు స్కూలు హోంవర్క్ ఉంటే చేసుకో", "రేపు ఉదయాన్నే స్కూలుకి వెళ్ళాలి, తొందరగా పడుకో" లాంటి మాటలు తూటాల్లాగా నన్ను తాకి కలవరపెట్టేవి. 

చెడ్డీలు దాటి ఇంటర్లోకి వచ్చాక మా నెల్లూరు ట్యూషన్లన్నీ ఉదయాన్నే మొదలవుతాయి. అపుడు ఇంట్లో వాళ్ళు చెప్పక పోయినా నాకే దిగులుతో గుండె బరువెక్కి టీవీ తొందరగా కట్టేసి నన్ను దుప్పట్లో చుట్టేసుకునేవాడిని. పెద్ద కాలేజీకి వచ్చాక సోమవారం ఉదయం సూళ్ళూరుపేట షార్ బస్ స్టాండులో కావలి బస్సు ఎక్కి గూడూరు వెళ్ళేవాడిని. అప్పట్లో ఆదివారం మనోహర్ థియేటరులో ఫస్ట్ షోతో సరిపెట్టుకుని మిత్రులకి తొందరగా టాటాలు చెప్పేసి ఉదయం కావలి బస్సులో షార్ నుండి ఎక్కబోయే కోవూరు పాలిటెక్నిక్, నెల్లూరులో చదువుకునే అమ్మాయిల్ని గుర్తు చేసుకుని కలలు కంటూ పడుకునేవాడిని. మా వాకాడు కాలేజీ అమ్మాయిలు కూడా కొంత మంది కావలి బస్సులో వచ్చేవాళ్ళు, అపుడు రాముడు మంచి బాలుడిలా ఉండేవాడిని!

కాలేజీ అయిపోయి మద్రాసులో పనిచేసేటపుడు కూడా ఇదే వరస. ఈసారి సెకండ్ షో చూసి పడుకుని ఉదయాన్నే యూనిట్ లో సందడిగా మద్రాస్ వెళ్ళేవాడిని. యూనిట్ అనగానే ఈపాటికి మీ తలకాయ గిరగిరా తిరుగుతుందనుకుంటా. మద్రాసు నుండి చుట్టుపక్కల వంద మైళ్ళ దూరం వరకు సబర్బన్ రైళ్ళు (Electrical Multiple Units) నడిచేవి. సిటీలో కూడా ఈ రైళ్ళే పరిగెడుతూ ఉంటాయి. వీటికి పికప్ నాకన్నా ఎక్కువ! స్టాపు వదిలిన కొన్ని క్షణాల్లోనే రివ్వుమని బాణంలా దూసుకుపోతుంది. ఈమధ్య వీటిని నెల్లూరు వరకు వేసారట. నోరు తిరగని వాళ్ళంతా ఈ రైళ్ళని యూనిట్ అని పిలుచుకునే వాళ్ళు. అదేమిటో నోరు తిరిగే వాళ్ళు కూడా యూనిట్ అనే పిలుచుకునేవాళ్ళు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని అమెరికా వచ్చినా ఈ సోమవారం సిండ్రోం చాన్నాళ్ళు వేటాడింది.

ఈమధ్య కాలంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. నా పొట్టలాగే ఈ పరిజ్ఞానం ఇంకా పెరుగుతూనే ఉంది. పెరుగుతూ ఉంది అంటుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. మేము పొదలకూరులో ఉండేటపుడు అక్కడ వినాయాకుడి గుడికి వెళ్ళేవాళ్ళం. ఆ గుడిలో చాలా పెద్ద వినాయకుడు విగ్రహం ఉండేది. 

గుడి గురించి పూజారి మాకు "ఈ విగ్రహం మొదట నుండి పెరుగుతూ ఉండేది. ఇంకా పెరిగితే గుడికి ఇబ్బంది అని విగ్రహానికి ఒక చీల కొట్టారంట. అప్పటి నుండి అది పెరగడం ఆగిపోయింది" అని చెప్పారు. 

ఇలాంటి మంత్రాలు ఉండే చీలలు మనకు దొరికితే మనకు కావలసినంత పొట్ట వరకు పెంచి తర్వాత చీల కొట్టేసుకోవచ్చు. 

ఖర్మ కాలి ఇంటావిడ "ఏమండీ...మరే...మీరు ఇంకొంచెం పొట్ట పెంచండి? మన పక్కింటాయన పొట్ట మీకంటే చాలా బాగుంటుంది" అని గారాలు పోతే మనం చీల విప్పేసి మళ్ళీ పొట్ట పెంచుకోవచ్చు. 

ప్రపంచమంతా ఎంతో మంది పొట్టదారులందరికీ మనం ఈ చీలల ద్వార పరిష్కారం చూపచ్చు.

"మితి మీరిన బరువుతో బాధ పడుతున్నారా? మా పొదలకూరు చీలలనే వాడండి" అని మంచి వ్యాపార ప్రకటన తయారు చేసి టీవీలో వెయ్యచ్చు.

"ఈ ప్రకటన చూసి ఇంకో గంటలో మీరు మాకు కాల్ చేస్తే మీకు చీలతో పాటూ బాగా గుండ్రంగా ఉండే రాయి కూడా ఉచితం" అని చెప్తే మన వ్యాపారం మూడు చీలలు ఆరు రాళ్ళు లాగా అభివృద్ధి చెందచ్చు.    

ఇక పిట్ట కథ వదిలి అసలు కథలోకి వెళ్తే చాలా కంపెనీలు మారుతున్న కాలంలో ఉద్యోగస్తులకి వారంలో ఒక రోజు ఇంటి నుండి పని చేసుకునే వెసులుబాటుని కల్పించింది. నా తోటి ఉద్యోగుల్లో చాలా మంది శుక్రవారం ఇంటి నుండి పని చేసేలా ఎంచుకున్నారు. 


ఖడ్గంలో రవితేజాలాగా నాకు ఒక్క చాన్సు వచ్చింది. నేను నా "ఇంటి రోజు"ని సోమవారానికి కుదుర్చుకున్నా. 

మా మేనేజరు "సోమవారం చాలా పని వత్తిడి ఉంటుంది, మీటింగులు బాగా ఉంటాయి. ఇంకోసారి ఆలోచించు" అని చెవి మెలేసింది.

"నేను ఒక్క సారి కమిట్ అయితే మా ఆవిడ మాట తప్ప ఇంకెవరి మాటా వినను" అని గట్టిగా చెప్పా. 

అంతకు ముందే పోకిరి సినిమా సబ్-టైటిల్స్ ఉన్న డీవీడీ ఆమె బాయ్ ఫ్రెండ్ పుట్టిన రోజుకి నేను ఇవ్వడం, ఆమె చూడడం జరిగింది. దాంతో ఆమె తొందరగా తేరుకుని "అలాగే పండూ, నీ ఖర్మ" అని నా సోమవారం సిండ్రోం కి అలా నీళ్ళొదిలింది! 

అప్పటి నుండి నేను ప్రతి సారీ ప్రాజెక్టు మారినపుడంతా మేనేజరుకి పోకిరి డీవీడీ ఇవ్వడం, సోమవారం ఇంటి నుండి పని చెయ్యడం పెట్టుకున్నా. అప్పుడు అంత ఆనందానికి కారణమయిన ఆ నిర్ణయం తర్వాత రోజుల్లో ఎంత దుర్భరంగా మారిందో నాకు తెలిసి వచ్చింది.

                                                                                                          సశేషం)


    

2 comments:

Unknown said...

శ్రీ said...

Thanks Sharath.మార్పు చేసాను. నీ రెండు కామెంట్స్ లో ఒకటి తీసేద్దామని హడావిడిలో రెండూ పోయాయి.Sorry.