కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం మీరు చదవకపోతే ఇక్కడ మొదలుపెట్టచ్చు.
మొదటి
రోజు, శనివారం జూన్ 27, డాలస్
ఉదయం నాలుగుకి
నిద్ర లేచి ఒక అరగంటలో తయారయ్యాను. నిన్న రాత్రే సామానంతా బైకుపై కట్టేసాను కాబట్టి
ఇక ఇంటి నుండి బయట పడడమే తరువాయి. ఇంటి ఓనరుకి కొన్ని రోజుల ముందు చెప్పి ఉంచా, ఇంకొక
వారం వరకు ఇంట్లో ఉండనని. ఈమధ్య డాలసులో బాగా దొంగతనాలు అవుతున్నాయి, అవి కూడా భారతీయుల
ఇల్లు వెతుక్కుని మరీ కొన్ని ముఠాలు దోపిడీలు చేసాయి. జాగ్రత్తగా తాళం వేసి రోడ్ మీద
పడ్డాను. ఇల్లు దారి ఒక మలుపు తిరిగే లోపు ఎదురుగా రోడ్ బ్లాక్ చేసి పెట్టారు. ఒక పోలీసు
అక్కడ నిలబడి అందరినీ పక్క దారి మళ్ళిస్తున్నాడు. ఉదయాన్నే ఈ పులిహారా ఏమిటి అనుకుని
హైవే ఎక్కాను.
మధ్య మధ్యలో వెనక లగేజ్ ఉందా, లేదా? అని చూసుకుంటూ ఉన్నాను. హైవే దిగుతుండగా
నా వెనక వస్తున్నట్రక్ డ్రైవరు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏదో జరిగింది అని వెనక చూసుకుంటే స్లీపింగ్
బాగ్ చుట్టిన రైన్ కవర్ చిరిగి పోయి రోడ్ మీద పడిపోయింది. మంచి శకునమే అని వెనక్కి తిరిగి కింద పడిన స్లీపింగ్
బాగ్ తెచ్చుకున్నాను. గట్టీగా కట్టిన తాడు వల్లేమో రైన్ కవర్ చిరిగి మొత్తం బయటకి
వచ్చేసింది. నా దగ్గర ఉన్న వేరే తాడులు తీసుకుని మళ్ళీ గట్టిగా కట్టాను. ఈసారి కొంచెం
పకడ్బందీగా కట్టాననిపించింది. మేము ఎపుడూ కలుసుకునే స్టార్బక్స్ కాఫీ షాపు చేరుకున్నా.
నేనే మొదటివాడిని, బైకు పార్క్ చేసి కాఫీ తాగుతూ, బనానా వాల్నట్ బ్రెడ్ తింటూ మేము
వాడే మీటప్ ఆప్ లో "నేను వచ్చేసా" అని రాసాను. మిగతావాళ్ళు కూడా దగ్గరలోనే
ఉన్నామని అప్డేట్ చేసారు.
ఈలోపల నా బైకు,
సామాను అవతారం చూసి ఒకతను "ఎక్కడకి ప్రయాణం" అని పలకరించాడు.
“కొలరాడో వెళ్తున్నాము”
అని చెప్పాను.
“ఓ..అద్భుతంగా
ఉంటుంది. ఈరోజు వర్షం కూడా ఉంది, తొందరగా బయలుదేరండి అని సలహా ఇచ్చాడు. మళ్ళీ అతనే
టెక్సాస్ దాటేంతవరకు డ్రైవ్ బోరింగ్ గా ఉంటుంది. న్యూ మెక్సికో నుండి పచ్చగా, రోడ్
పక్కల అందంగా ఉంటుంది. నేను ఈ మధ్యనే వెళ్ళాను. కాకపోతే కారులో! జాగ్రత్తగా వెళ్ళండి"
అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఈలొపల వినయ్, రూపి
వచ్చారు. వినయ్ మాతో గత సంవత్సరం లాంగ్ డ్రైవ్ వచ్చాడు. వాళ్ళ ఆవిడ రూపి రావడం ఇదే
మొదటిసారి. రూపి డాలసులో రైడింగ్ కి వస్తూ ఉండేది. దేవేందర్, కృష్ణ కూడా వచ్చేసారు.
ఫారుక్ ఒక అయిదు నిముషాల తర్వాత వచ్చాడు. వాళ్ళు కూడా కాఫీలు, టిఫిన్లు తెచ్చుకుని
కబుర్లు మొదలుపెట్టాము. కేకే కుటుంబంతో పాటు ట్రక్కులో బైకుని వెనక కట్టేసుకుని వస్తున్నాడు.
ఈ మొదటిరోజు మేము ఎక్కువ డ్రైవ్ చేస్తున్నాము. రెండో రోజుకి కొలరాడో తొందరగా చేరుకోవాలని
మా ఆశ. కొన్ని ఫోటోలు దిగి పక్కనే ఉన్న గాస్ స్టేషన్లో గాస్ కొట్టించి రోడ్డెక్కాము.
అందరికంటే ముందు ఫారుక్, వెనక వినయ్, రూపి, నేను, కృష్ణ తర్వాత దేవేందర్ ఒకరి వెనక
ఒకరు స్టాగ్ చేస్తూ బయలుదేరాము. బైకర్లు గుంపుగా వెళ్ళేటపుడు ఇద్దరు ఒకేలైనులో కాకుండా
ఒకరు ఎడమ, రెండో వాళ్ళు కుడివైపు ఉంటాము. దీని వలన ముందు వాళ్ళు సడన్ బ్రేక్ వేస్తే
మాకు కొంత సమయం, దూరం ఉంటుంది. అదీకాక మొదట వెళ్ళే వాళ్ళు చివరి బైకర్ని చూడడానికి
అవకాశం ఉంటుంది.
గత సంవత్సరం మేము బిగ్ బెండ్ వెళ్ళినపుడు దేవేందర్, కృష్ణ, ఫారుక్ హెల్మెట్ కి సేనా అనే బ్లూటూత్ పరికరం తగ్లించుకున్నారు. ఈ సేనాని సెల్ ఫోనుకి కనెక్ట్ చేసుకోవచ్చు. అపుడు ఫోనులో నుండి పాటలు వింటూ వెళ్ళచ్చు. లేదా బైకు నడుపుతూ మాట్లాడుకోవచ్చు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ ఇంటర్ కాము ద్వారా ముగ్గురు, నలుగురుని కలుపుకుని మాట్లాడుకోవచ్చు. దూర ప్రయాణం చేసేటపుడు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రయాణానికి మిగిలినవాళ్ళదరూ కూడా సేనా కొనుక్కుని హెల్మెట్ కి బిగించుకున్నాము.
ఒక యాభై మైళ్ళు దాటాక అందరం వాటర్ బ్రేక్ తీసుకున్నాము. ఎండాకాలం కాబట్టి
దాహం బాగా వేస్తుంది. నేను ఒక రెండు వాటర్ బాటిల్స్ కొని టాంక్ బాగులో పెట్టుకున్నా.
ఫారుక్, దేవేందర్, కృష్ణలు వాటర్ బాగులు కొన్నారు. అవి మనం తగిలించుకుని పైపు ద్వారా
తగుతూ ఉండచ్చు. ఒక అరలో అయిసు ముక్కలు వేసుకుని ఇంకో అరలో నీళ్ళు నింపుకున్నారు. కొంతమంది
టైరులో గాలి చూసుకుంటూ ఉన్నారు. సరి అయిన గాలి లేకపోతే టైరు తొందరగా పాడయిపోతుంది,
పగిలిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. కొలరాడో ప్రయాణం తర్వాత నేను, వినయ్, రూపి కూడా ఈ వాటర్ బాగులు కొనుక్కున్నాము.
ఉదయం నుండి 125 మైళ్ళు ప్రయాణించి విచితా
ఫాల్స్ దాటి, మరి ఇంకో 250 మైళ్ళు ప్రయాణించి అరమిల్లో చేరాము. మొదట అరమిల్లోలో ఆగిపోదామనున్నాము. మళ్ళీ రెండో రోజు కూడా
ఎక్కూవ డ్రైవ్ చెయ్యాలని ముందుకు వెళ్దామనే నిర్ణయించుకున్నాము. అరమిల్లోలో మా స్నేహితుడు
పూర్ణా ఉంటాడు. కాకపోతే ఎండాకాలం సెలవులకి హైదరాబాదు వెళ్ళాడు. అదే వూరులో ఆగి సబ్వే
సాండ్ విచ్ తిని కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. మంచి మిట్ట మధ్యాహ్నం, ఎండకి చమట పట్టి
ఉంది. డ్రైవ్ చేసేటపుడు మాత్రం గాలికి హాయిగానే ఉంటుంది. ఎండాకాలం మెష్ జాకెట్లోకి
గాలి పోతూ హాయిగా ఉంటుంది. కేకే కూడా మా వెనకే వస్తున్నాడని ఫోన్ చేసి చెప్పాడు.
భోజనం
అయ్యాక మళ్ళీ పడమర దిక్కుకి బయలుదేరాము. మిట్ట మధ్యాహ్నం, ఎండ దంచుతుంది. ఒక అరగంట
ప్రయాణం చేసి విశ్రాంతి కోసం దారిలో ఆగాము. పిక్నిక్ స్థలంలో బైకులు పార్క్ చేసి చెట్టు
నీడలో సేద తీర్చుకుందామని నడుము వాల్చాం. కేకే అంతకు ముందే మాతో మాట్లాడి నేను ఇంకో
పది నిముషాల్లో మిమ్మల్ని చేరుకుంటాను అనడం వలన అందరం ఇక్కడ ఆగామనమాట. మేము పడుకున్న
స్థలంలో చెత్తకుండి నిండి పోయి ఈగలు బాగా ముసురుకున్నాయి. ఒక పదిహేను నిముషాలకి అక్కడ
నుండి కదిలి పక్క నున్న స్థలంలో వెళ్ళాము. ఇక్కడ శుభ్రంగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ
అరగంట పైనే కాలం గడిపాము.
కేకే చెప్పిన పది నిముషాలు యాభై నిముషాలు అయ్యాయి. ఇక విరహం తట్టుకోలేక
రోడ్డెక్కేసాము.
ఇంకొక గంట సేపు
ప్రయాణం చేసి కాఫీ బ్రేక్ కోసం ఆగాము. భోజనం తర్వాత బండి నడపడం చాలా కష్టం, ఎంత ఎండ
ఉన్నా ఆ గాలికి చల్లగా నిద్ర మొదలవుతుంది. దాన్ని తట్టుకోఅడం కోసం చాలా పాట్లు పడాలి.
నాకు తగులుతున్న గాలి వల్ల నాకు నిద్ర వస్తే నేను విండ్ షీల్డ్ కొంచెం పెంచుతా. అపుడు
చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కాసేపయ్యాక ఈ నిశ్శబ్దానికి నిద్ర మొదలవుతుంది. మళ్ళీ విండ్
షీల్డ్ తీసి గాలి ఫీల్ అవుతూ మళ్ళీ నిద్రని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు!
ఈసారి కాఫీ
తాగే సమయానికి కేకే కుటుంబం మమ్మల్ని చేరుకుంది. అందరితో పరిచయాలు, కబుర్లతో కాఫీ ముగించి
ఆరోజు చివరి మజిలీ ప్రయాణం మొదలుపెట్టాము. నా స్లీపింగ్ బాగ్ గాలికి రేగుతూ చిరాకు
పుట్టించింది. అది బాగా రేగుతూ ఉండేసరికి వినయ్ నన్ను హెచ్చరించి ఆపాడు. రోడ్ పక్కనే
బైకుని ఆపి స్లీపింగ్ బాగుని మళ్ళీ విప్పి ఇంకొంచెం గట్టిగా కట్టాము. మమ్మల్ని చూసి
ఫరూక్ మా దగ్గరకి వచ్చి తన దగ్గరున్న తాడుతో గట్టిగా కట్టాడు. ఈసారి సామాను చెదరకుండా
నోరు మూసుకుని కూర్చుంది. మేము టెక్సాస్ దాటి న్యూ మెక్సికో రాష్ట్రంలోకి అడుగుపెట్టాము.
చుట్టూ పచ్చని పొలాలతో ఈ రాష్ట్రం చూడ చక్కగా ఉంది. అందరూ రెచ్చిపోయి తొంభై మైళ్ళ వేగంతో
బండిని నడిపించారు. మొదటిసారి ఒక రోజులో 500 మైళ్ళు నడిపి మా గ్రూపులో కొత్త రికార్డుని
నమోదు చేసుకున్నాము.
క్లేటన్ చాలా చిన్న
ఊరు. సాయంత్రం అయిదుకంతా చేరుకుని మా కాంపింగ్ ప్రదేశానికి చేరుకున్నాము. చకచకా బైకు
నుండి సామాను విప్పి పది నిముషాల్లో టెంట్ వేసుకున్నాము. నాది ఇద్దరికి సరిపోయే
టెంట్. ఇది వెయ్యడానికి అట్టే సమయం పట్టదు. టెంట్ లోపల స్లీపింగ్ పాడ్ వేసి దాని మీద
స్లీపింగ్ బాగ్ ఉంచి బైకుకి తగిలించి ఉన్న సాడిల్ బాగ్స్ కూడా తీసేసి టెంటులో పెట్టేసుకున్నా.
కేకే ట్రక్కులో ఉన్న బైకుని వినయ్, ఫారుక్, దేవేందర్, నేను కలిసి నెమ్మదిగా దించాము.
ట్రక్కులో బైకుని ఉంచి నాలుగు వైపులా తాడుతో కడుతారు. అవన్ని విప్పి కిందకి దించేటపుడు
బైకుని ఒక నిచ్చెన మీదుగా దించాలి. ఏమాత్రం తప్పు చేసినా బైకు మూడడుగుల నుండి కింద
పడుతుంది. జాగ్రత్తగా దించిన తర్వాత కేకే, వినయ్, ఫారుక్, దేవేందర్ కూడా టెంట్ వేసుకుని
బైకుల నుండి సామాను దించుకుని సర్దుకున్నారు.
చిన్న ఊరు కాబట్టి భోజనానికి కొంచెం ఇబ్బంది.
ఎక్కువ రెస్టారంట్స్ ఉండవు, పైగా ఉన్నవి తొందరగా మూసేస్తారు. మధ్యాహ్నం అదరాబదరాగా
తిన్నా సాయంత్రం వేరే పనులు లేవు కాబట్టి నిదానంగా రెండు గంటలు విందు చేసి టెంటు చేరుకున్నాము.
(తరువాయి భాగం రేపు చూద్దాము)
2 comments:
నిద్ర ఆదుకోవడానికి చిట్కా బాగుంది.
ధన్యవాదాలు అనిల్ గారు.
Post a Comment