Wednesday, December 23, 2015

కొలరాడో యాత్ర విశేషాలు - 3


కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం మీరు చదవకపోతే 1, 2  మొదలుపెట్టచ్చు.


రెండవ రోజు, ఆదివారం జూన్ 28, క్లేటన్


మొదటి రోజు బాగా ఎక్కువ దూరం రావడం, టెక్సాస్ ఎండలకి బాగా అలిసిపోయి ఉండడం వలన రాత్రి బాగా పడుకున్నాము. క్లేటన్ చిన్న ఊరు అయినా కాంప్ గ్రౌండులో చాలామందే ఉన్నారు. మేము నిన్న లోపలకి వచ్చేటపుడు కొంతమంది బైకర్లు కూడా ఉండడం గమనించాము. అందులో ఒక బైకు కావాసాకి అడ్వెంచర్ బైకు. ఫరూఖ్ న్యూజెర్సీలో ఉండేటపుడు దానిని నడిపేవాడినని చాలా సార్లు చెప్పాడు. ఉదయం స్నానం చేసేటపుడు ఫారుక్ వాళ్ళని కలిసి వచ్చాడు. మా స్నానాలు ముగించి టెంటు పెరికి, అన్నీ సర్దుకుని బైకుకి కట్టేసుకున్నాము. ఈసారి నా స్లీపింగ్ బాగు కేకే ట్రక్కులో పెట్టేసాను. ఈలోపల కే.ఎల్.ఆర్ బైకర్ మా దగ్గరకి నడుచుకుంటూ వచ్చాడు. బైకర్లు చాలా తొందరగా దగ్గరయిపోతారు, కలిసి మాట్లాడుకోవడానికి చాలా విషయాలుంటాయి. మా టూరులో ఇలా చాలామందితో కబుర్లాడుకున్నాము. 

కే.ఎల్.ఆర్ బైకరు “సియాటిల్ నుండి వస్తున్నాను” అన్నాడు. అప్పటికి అతను ఒక నెల నుండి ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడు. మధ్య, మధ్యలో బైకర్లని కలుస్తూ తన గమ్యం వైపు వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ నుండి టెక్సాస్ వెళ్ళి మళ్ళీ తూర్పు వైపు వెళ్ళి న్యూయార్క్ చేరుకోవాలని ఇతని కోరిక. న్యూయార్క్ లో ఇతన్ని పెంచిన సవతి తండ్రి ఉన్నాడట, అతన్ని కలిసి కొన్ని రోజులు అతని కుటుంబంతో సమయం గడుపుతాడట. నేను, వినయ్, రూపి ఇతనితో మాట్లాడుతూ ఉన్నాము. మా గ్రూపులో పెళ్ళి అయిన వాళ్ళు ఉండడం చూసి అతనికి ఆనందం వేసింది.
“మా ఇంట్లో ఇంతవరకు ఎవరూ పెళ్ళి చేసుకోలేదు, నాకు పెళ్ళి అవుతుందో, లేదో కూడా తెలియదు” అని చెప్పాడు. అతని వయసు నలభై లోపలే ఉండచ్చు.
"శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" అని ఆశీర్వదిస్తూ ఉన్న సమయంలో ఫరూఖ్ కూడా వచ్చి మా కబుర్లలో పాలు పంచుకున్నాడు. తనకి గ్రూపులో వెళ్ళడం ఇష్టంలేదని ఒక్కడినే వెళ్తూ ఉంటాడని చెప్పాడు. దారిలో తన బైకుకి వచ్చిన ఇబ్బందులు వాటిని ఇతను ఎలా మరమ్మత్తులు చేసాడో చెప్పాడు. తనతో పాటు వచ్చిన బైకర్లు బైబిల్ గ్రూపు వాళ్ళనీ చెప్పాడు.
 
 
 

మాకు దగ్గరలోనే ఉన్న సబ్వేలో కాఫీలు, టిఫిన్లు తిని తర్వాత గమ్యం అలమోసా వైపు బయలుదేరాము. ఈ రెండవరోజు నుండి కేకే మాతో కలిసి డ్రైవ్ చెయ్యడం మొదలుపెట్టాడు. కేకే ఆవిడ రూప పిల్లలు ఉర్వి, విహాన్ తో కలిసి ట్రక్ నడుపుతూ మా వెంట వచ్చారు. ఉదయం పదకొండున్నర దాటాక ఒక చోట రోడ్ మూసేసారు. కొండలపైన వర్షాలు బాగా కురవడం వలన వాగులు పొంగి రోడ్ మునిగిందట. పోలీసులు రోడ్ మూసేసి అందరినీ వెనక్కి పంపుతున్నారు. కొన్ని గంటల తర్వాత మళ్ళీ తెరుస్తాము అని చెప్పారు. మాకు ఇక చేసేదేమీ లేక అక్కడే ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపుకున్నాము. పక్కనే ఉన్న షాపులో అటూ, ఇటు తిరిగి కొన్ని వేరుశనగ కాయలు, కాఫీ తీసుకున్నా. ఒక గంట తర్వాత ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అక్కడే ఉన్న రెస్టారెంటులో లంచ్ చేసేద్దామనుకున్నాము. అలమోసా వెళ్ళడానికి ఇంకొక దారి ఉంది, కానీ ఈదారి చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు. వేచి చూద్దామని అందరూ అనుకున్నాము. నిదానంగా తిన్నాకానీ రోడ్ ఇంకా తెరవలేదు.

ఈలోపల ఆగిపోయిన వాళ్ళందరితో ఆ చిన్న రెస్టారెంట్ బాగా నిండిపోయింది. కొంతమంది బైకర్లు కూడా చేరారు. వాళ్ళకి మా బైకులు చూపిస్తూ మేము వాళ్ళ బైకులు చూస్తూ కబుర్లు చెప్పుకున్నాము. ఒక బైకరు డాలస్ నుండి చాలా ఏళ్ళ క్రితం ఇటు వైపు వచ్చాడట. ఇది చాలా చిన్న ఊరు, నాకు బాగా ఇష్టం అని ఆ అరవై ఏళ్ళ బైకరు చెప్పాడు.

అతను నడుపుతున్న బైకు మోటో గూచి, ఇటాలియన్ డిజైనుతో చాలా డాషింగ్ గా ఉంటుంది.
“నువ్వు నడుపుతున్న బైకు నేను నడిపాను, నాకు బాగా ఇష్టం అది కూడా!” అని నాతో అన్నాడు.


ఇలా మా కబుర్లు సాగుతున్నాయి కానీ రోడ్ మాత్రం ఇంకా తెరవడం లేదు. ఈసారి కృష్ణ వెళ్ళి ఇంకోసారి విషయం కనుక్కుని వచ్చింది. రోడ్ మీద నీళ్ళు మళ్ళించారు, కానీ రవాణా శాఖ అధికారి తణిఖీ చేసిన తర్వాత మాత్రమే వాహనాలకి అనుమతి దొరుకుతుందట! ఇంకో గంట సేపు వేచి చూడడమా? లేక వేరే దారిలో వెళ్ళడమా? అని అలోచించి వేరే దారిలో వెళ్ళడానికే నిర్ణయించుకున్నాము. ఒక గంట దూరం ప్రయాణించగానే సుందరమయిన పర్వతాలతో కొలరాడో మాకు స్వాగతమిచ్చింది. దారి పక్కన ఫోటోలు తీసుకోవడానికి అనువుగా ఉన్న విశ్రాంతి ప్రదేశంలో ఫోటోలు దిగాము.


మాలాగే ఆగిన ఒక అమె మా అందరి ఫోటో తీసింది. కాసేపయ్యాక బయలుదేరే సమయంలో ఒక చిక్కు వచ్చి పడింది. దేవేందర్ బైకుని చెక్ చేస్తున్న ఫరూక్ కి ఒక అనుమానం వచ్చింది. దేవేందర్ బైకు వెనక టైరు బాగా అరిగిపోయింది. అది మరి కొద్దిదూరంలో పగిలేటట్లు ఉంది. దూర ప్రయాణం చేసేటపుడు ఇటువంటి విషయాలు ముందే చూసుకోవాలి. నా బైకు రెండు టైర్లు ఒక నెల ముందే మార్చాను. దేవేందర్ బైకు బీ.ఎం.డబల్యూ. తన బైకుకి ఏమీ కాదులే అన్న ధీమాతో ఈ చిన్న విషయం మర్చిపోయాడు.
 
 
 

సమస్య వచ్చినపుడే మన ప్రతిభ బయటపడుతుంది. ప్రతి ప్రయాణంలో ఇటువంటి సరిగమలు మామూలే, చకచకా అందరి బుర్రలు అలోచించడం మొదలుపెట్టాయి. దగ్గరలో ఉన్న ఊరు వరకు వెళ్ళి అక్కడ అలోచిద్దామని బయలుదేరాము. దేవేందర్ వెనక వచ్చే వారికి కొన్ని సూచనలు ఇచ్చి బయలుదేరాము. ఒక వేళ టైరు పగిలితే బైకుని జాగ్రత్తగా నడపమని దేవేందర్ కి చెప్పాము. అతన్ని చూసి ఆందోళన పడద్దని వెనక వచ్చే వారికి చెప్పాము.  మామూలు వేగం కన్నా కొంచెం తగ్గించి ప్రయాణించి ట్రినిడాడ్ అన్న ఊరు చేరుకుని రోడ్ పక్కన ఖాళీ స్థలంలో ఆగాము. ముందు బైకుని దగ్గరలో ఉన్న షాపుకి తీసుకు వెళ్దామని AAA కి ఫోన్ చేసాము. అసలే ఆదివారం, ఊరు కూడా చిన్నది కాబట్టి మా దగ్గరకి రావాలంటే గంటకి పైగా పడుతుందన్నారు. ఈలోపల అందరూ దగ్గరలో ఉన్న మెకానిక్ షాపు కోసం గూగులులో వెతికారు. ఎవరూ ఆసమయంలో ఉండరు కాబట్టి మాకు కుదరలేదు. అటుగా వెళ్తున్న బైకరుని ఆపి విషయం వివరించాము. అతను ఇక్కడ దగ్గరలో ఒక షాపు ఉంది అని చెప్పాడు. ఫారుక్ వెళ్ళి ఒక అరగంటకి తిరిగి వచ్చాడు, షాపు మూసేసి ఉందని చెప్పాడు.


AAA నుండి సమాచారం చాలా నిదానంగా వస్తూ ఉంది. ఈలోపల ఉర్వి, విహాన్ ఇద్దరికీ విసుగు పుట్టి అల్లరి చెయ్యడం మొదలుపెట్టారు. నేను వారితో ఫ్రిస్బీ ఆడుతూ వాళ్ళని ఆడిస్తూ ఉన్నాను. పరిస్థితిని సమీక్షిస్తూ అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ నుండి అలమోసా ఇంకొన్ని గంటలలో చేరచ్చు. దేవేందర్, కృష్ణ సోమవారం ఉదయం టైరు రిపేర్ చేసుకుని మిగతావారిని లంచ్ టైములో కలుస్తారు. ఈలోపల టైరు పగిలితే అపుడు బైకుని కేకే ట్రక్కులో వేసుకుందామని ముందుకు కదిలాము. చీకటి పడుతుండగా అలమోసా చేరుకున్నాము. 


అలమోసా కాంప్ గ్రౌండ్ బాగా సందడిగా ఉంది. చిన్న స్థలంలోనే నలుగురం టెంట్లు వేసుకోవలసి వచ్చింది. మా ఎడమ పక్క ఒక దేశీ, అతని అమెరికా పెళ్ళాం, ఇద్దరు పిల్లలు ఒక పెద్ద టెంటులో ఉన్నారు. కుడి పక్కన ఒక ప్రేమ జంట, వయసు ఇరవై లోపలే ఉండచ్చు. చిన్న టెంటు వేసుకుని గుసగుసలు చెప్పుకుంటూ ఉన్నారు. 


అప్పటికే ఆలస్యమయ్యేసరికి అందరం కాంపుకే పీజా తెప్పించుకున్నాము. కాంపు ఫైర్ కూడా వేసుకుని బీరు పొంగించాము. కేకే తెచ్చిన పసుపు పుచ్చకాయ తమాషాగా ఉండి పిల్లలకి బాగా నచ్చింది. పీజా కూడా తింటూ కబుర్లు చెప్పుకున్నాము. ఆరియా నుండి కొనుక్కున్న బుజ్జి కుర్చీలలో వెచ్చగా కూర్చుని, దోమలు కుట్టకుండా మందు పూసుకుని ఈ రెండు రోజుల్లో మాకు నచ్చిన రెండు విషయాలు, నచ్చని రెండు విషయాలు గురించి చెప్పుకున్నాము. ఫరూఖ్ వాల్మార్టు నుండి తెచ్చిన కాంపింగ్ వంట సామాను తీసి చికెన్ సూపు తయారు చేసాడు. ఒక బుజ్జి స్టవ్వు, దాని మీద ఒక బుజ్జి సిలిండరుతో చూడడానికి బాగుంది. సూపు మాత్రం బాగా లేదు, ఎవరూ దానిని తినడానికి ముందుకు రాలేదు. ఈలోపల చిన్నగా చినుకులు పడడం మొదలుపెట్టింది. అందరం అప్పటికే వేసుకున్న టెంటులోకి పరిగెత్తాము. కాసేపయ్యాక వాన వెలిసింది, అందరూ బయటకి వచ్చి మళ్ళీ కాంప్ ఫైరు వేసాము. పెద్ద వాన కాదు కాబట్టి మంట కూడా ఆరలేదు.


(కొలరాడో యాత్రలో మూడవరోజు కోసం ఎదురు చూడండి).2 comments:

Anil Atluri said...

పిల్లలతో తో ఆటలా! బాగుంది.

శ్రీ బసాబత్తిన said...

ధన్యవాదాలు అనిల్ గారు.