కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం
మూడవ రోజు, సోమవారం జూన్ 29, అలమోసా
టెంటులో ఎంత లేటుగా పడుకుంటే ఉదయం ఆరు లోపల మెలకువ వచ్చేస్తుంది. ముందుగా లేచిన నేను, కేకే ఊరులోకి వెళ్ళి కాఫీ, టిఫిన్ తెద్దామని బయలుదేరాము. మెక్ డొనాల్డ్స్ లో అందరికీ సరిపడే కాఫీ, టిఫిన్ పాక్ చేసి తీసుకువచ్చాము. ఈలోపలే అందరూ తయారయ్యి వచ్చారు. వినయ్, రూపి ఇక్కడ టెంట్ వేసుకోకుండా కాబిన్ తీసుకున్నారు.
వినయ్, రూపి ఒక జంట, దేవేందర్, కృష్ణ రెండో జంట. కేకే, రూప మూడవ జంట. ఈ ప్రయాణంలో నేనూ, ఫరూఖ్ ఒంటరి పక్షులం. ఈ రోజుటి పధకం
ప్రకారం నేను, కేకే కుటుంబం, వినయ్, రూపి, ఫారుక్ దగ్గరలో ఉన్న సాండ్ డ్యూన్స్ కి వెళ్దామనుకున్నాము.
దేవేందర్ టైరు రిపేర్ చేసుకుంటాడు. మేము సాండ్ డ్యూన్స్ నుండి తిరిగి వచ్చి అతన్ని
లంచులో కలుసుకుంటాము. కృష్ణ కూడా దేవేందరుతో పాటే వెళ్తానంది. మా టెంటు మధ్యాహ్నం విప్పుకుంటామని
కాంప్ గ్రౌండ్ వారికి చెప్పుకున్నాము.
మేము టెక్సాసులో బయలుదేరేటపుడు అక్కడ ఎండలు జాస్తి (ఎక్కువ). నేను కొలరాడో చలిని తక్కువ అంచనా వేసాను. ఒక్క పొడుగు చొక్కా కూడా తెచ్చుకోలేదు. బయలుదేరేముందు అలమోసా గుర్తుగా చలికి వెచ్చగా ఉండేలా ఇక్కడ ఒక పొడుగు చొక్కా కొనుక్కున్నాను.
మేము టెక్సాసులో బయలుదేరేటపుడు అక్కడ ఎండలు జాస్తి (ఎక్కువ). నేను కొలరాడో చలిని తక్కువ అంచనా వేసాను. ఒక్క పొడుగు చొక్కా కూడా తెచ్చుకోలేదు. బయలుదేరేముందు అలమోసా గుర్తుగా చలికి వెచ్చగా ఉండేలా ఇక్కడ ఒక పొడుగు చొక్కా కొనుక్కున్నాను.
అందరూ తయారయి పెట్రోల్
కొట్టించేసమయంలో ఇంకొక చిక్కు వచ్చి పడింది. ఫరూఖ్ పెట్రోల్ కొట్టించగానే అతని ఇంజిన్
నుండి పెట్రోల్ కారడం మొదలయింది. ఎక్కడ నుండి వస్తుందో తెలియడం లేదు. ఆగకుండా పడుతూనే
ఉంది. ఇదేదో నేను చూసి వస్తాను, మీరు వెళ్ళండి అని మమ్మల్ని పంపించి అతను టెంట్ దగ్గరకి
వెళ్ళాడు. ఫరూఖ్ బైకు పనులు అతనే చేసుకుంటాడు. దానికి కావలసిన ఆయిల్ మార్చడం, టైరు
విప్పడంలాంటివన్నీ ఇతనికి కొట్టిన పిండి. మమ్మల్ని చూసి ఒక పెద్దాయన మాతో కలిసి కాసేపు
కబుర్లు చెప్పాడు. అతని టీనేజి వయసు నుండి బైకు నడుపుతున్నాని చెప్పాడు. సాండ్ డ్యూన్స్
పార్కుని గత అయిదు సంవత్సరాలనుండే గుర్తించారనీ, ఎండలో మీరు అక్కడ ఎక్కువసేపు
ఉండలేరనీ చెప్పాడు. అతనికి వీడ్కోలు చెప్పి కేకే కుటుంబం, వినయ్, రూపి, నేను సాండ్
డ్యూన్స్ వైపు బయలుదేరాము. గంటలోపే చేరుకున్నాము. పెద్దాయన చెప్పినట్టు ఎండ బాగానే
ఉంది. మా బైకు డ్రెస్ విప్పి నేను నా లగేజీ నుండి ఒక షార్ట్ తీసి వేసుకున్నా. నా చెప్పులు
టెంటులో ఉండిపోయాయి. చెప్పులు లేకుండా ఎలా అని కేకే నాకు తనవి ఇచ్చాడు. సాండ్ డ్యూన్స్
పార్కింగ్ స్థలం నుండి కదిలాము.
సాండ్ డ్యూన్స్
చేరుకునే ముందు ఒక పిల్ల కాలువని దాటాలి. మండే ఎండలో పిల్ల కాలువలో కాళ్ళు తడుస్తుంటే
ఎంతో గమ్మత్తుగా ఉంటుంది. కేకే పిల్లల్తో కలిసి
సాండ్ డ్యూన్స్ వైపు వెళ్ళాడు. నేను, వినయ్, రూపి ఈ పిల్లకాలువలో నడుస్తూ ఉండిపోయాము.
పారుతున్న నీళ్ళలో కాలు తీసి మళ్ళీ వేస్తుంటే కాళ్ళ కింద ఇసుక కిందకి వెళ్ళిపోతూ సరదాగా
ఉంది.
“మనం మళ్ళీ న్యూట్రలైస్
అవుతున్నాము” అంది రూపి.
“అంటే” అని నేను
ప్రశ్నార్ధకంగా చూసాను.
“మనం రోజులో ఎక్కువభాగం
షూస్ వేసుకుని ఉంటాము. కాసేపు షూస్ తీసేసి నేలమీద నడిస్తే మన అలసట, ఆయాసం తగ్గుతాయి”
అని చెప్పింది.
“నిజమే, పాదాలలో
కొన్ని చోట్ల వత్తిడి పెంచితే అలసట తీరుతుందని కూడా చెప్తారు” అని నేను చెప్పాను.
“వాటివల్ల మనలో
మళ్ళీ శక్తి పుంజుకుని మనలో ఉన్న చెడు అలోచనలు పోతాయి కూడా" అని రూపి అంది.
సాండ్ డ్యూన్స్
నుండి తిరిగ్ వచ్చిన పిల్లలు కూడా ఆ నీళ్ళలో చాలాసేపు ఆడుకున్నారు. ఈలోపల ఫరూఖ్ కూడా
అక్కడకి చేరుకున్నాడు.
“తను ఏమీ చేయకుండానే
ఇపుడు పెట్రోల్ కారడం ఆగింది” అని చెప్పాడు. ఇదే పరిస్థితి కొన్ని రోజుల తర్వాత రూపికి వచ్చినపుడు మాకు ఫరూఖ్ బైకుకి వచ్చిన ఇబ్బందికి కారణం తెలిసింది.
అందరం కలిసి కొన్ని
ఫోటోలు దిగి డ్రెస్ మార్చుకుని రోడ్ మీద పడ్డాము. పార్క్ దాటే లోపలే ఫరూఖ్ బైకు నుండి
నల్లని వస్తువు ఏదో కింద పడింది. ఫరూఖ్ వెనక ఉన్న రూపి కూడ ఇది గమనించింది. ఆ వస్తువు
కింద పడగానే విరిగి చెల్ల చెదురు అయింది. ఏదో ప్లాస్టిక్ లాంటి వస్తువు, అది
చెప్పడం ఎందుకులే అని నేను చెప్పలేదు. తర్వాత రెస్టారెంటులో ఈ విషయం చెప్తే ఫరూఖ్
బైకు చెక్ చేసి అది వీడియో కెమెరాకి సంబందించింది అని చెప్పాడు.
దేవేందర్ బాగున్న
ఒక పాత టైరుని కొన్నాననీ, మళ్ళీ డాలస్ వెళ్ళినపుడు మంచి టైరు కొనుక్కుంటాననీ చెప్పాడు.
లంచుకి థాయ్ రెస్టారెంటులో కలుద్దమని చెప్పాడు. అందరం లంచ్ సమయానికి కలిసి తిన్నాము.
దేవేందర్, కృష్ణ వచ్చేటపుడు టెంట్ విప్పేసి, బైకులో సర్ధుకుని వచ్చారు. నేను, ఫరూఖ్,
కేకే వెనక్కి వెళ్ళి టెంట్ విప్పేపనిలో పడ్డాము. నా టెంట్ విప్పేసి కేకే సామాను ట్రక్కులో
పెట్టడానికి సహాయం చేసాను. ఎండ బాగా ఉండేసరికి నాకు మత్తుగా ఉండి గడ్డిలో కాసేపు కూర్చున్నా.
ఈలోపల కేకే, ఫరూఖ్
సామాను సర్దేసారు. ముగ్గురం కలిసి మిగతవాళ్ళని రెస్టారెంటు దగ్గర కలిసి అందరం గన్నిసెన్
వైపు బయలుదేరాము. ఒక రెండు గంటలు ప్రయాణం అయ్యాక పెట్రోల్ బంకు దగ్గర ఆగాము. ప్రతి వంద మైళ్ళకీ మేము పెట్రోల్ బంకులో ఆగుతూ ఉంటాము. కాఫీ, నీళ్ళు, పెట్రోల్, బాత్ రూం ఇలా అన్ని అవసరాలకోసం ఆగి బడలిక కూడా తీర్చుకుంటూ ఉంటాము. ఎండాకాలం కాబట్టి నీళ్ళు కూడా బాగా ఎక్కువ తాగుతూ ఉంటాము కాబట్టి వాటి కోసం కూడా ప్రయాణంలో బ్రేకులు సాధారణం. పెట్రోల్
కొట్టించి నీళ్ళ బాటిల్, కొన్ని తినుబండారాలు కొంటూ ఉండగా కొట్టు వాడు పలకరించాడు.
“ఇంకాసేపట్లో వర్షం రాబోతుంది, తొందరగా గన్నిసెన్ వెళ్ళండి. దారి మాత్రం చాలా బాగుంటుంది”
అని చెప్పాడు.
"తడవడానికి
రెడీగా ఉండు" అని ఫరూఖ్ నవ్వాడు.
నా పాంటుకి తడి అంటదు, పైన మెష్ జాకెట్ తడవడానికి
అవకాశం ఉంది. విండ్ షీల్డ్ పెంచితే ముందు నుండి పడే వాన తట్టుకోవచ్చు. అందరూ ముందు
వెళ్తుండగా నేను వెనకబడ్డాను.
కొండల అంచులో వెళ్తున్నాము,
చుట్టూ అద్భుతమైన ప్రకృతి. పచ్చని కొండలు, కింద వేగంగా పారుతున్న సెలయేళ్ళు. వీటన్నిటిని
చూస్తూ వెళ్తుండగా పెద్ద వర్షం మొదలయింది. ఆ వర్షంలోనే చిన్నగా వెళ్తూ ఉన్నాము. ఒక
అరగంట అయ్యాక వర్షం ఇంకా పెద్దగా అయింది. ఎదురుగా ఏమీ కనపడడం లేదు. నా ముందు వెళ్తున్న
బైకు స్టాప్ లైటు మాత్రమే కనిపిస్తుంది. లీలగా రోడ్ కనిపిస్తుంది. కళ్ళు చికిలించి
నడుపుతూ ఉన్నారు అందరూ. కాసేపయ్యాక కృష్ణ ఇక నా వల్ల కాదంటూ రోడ్ పక్కకి వెళ్ళింది.
దేవేందర్ నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. చర్చలు విఫలమయ్యాయి, బండిని పక్కకి తిప్పి
అక్కడ ఉన్న ఒక బారులోకి వెళ్ళాము. మమ్మల్ని చూసి వినయ్, రూపి కూడా వెనక్కి వచ్చారు.
ఫరూఖ్, కేకే కూడా కాసేపయ్యాక చేరుకున్నారు. అక్కడ నుండి మూడు గంటలు వెళ్తే గన్నిసన్
చేరుకుంటాము. కేకే, రూప ఆ వానలో బయలుదేరారు. మేము బారులో కాసింత ఎంగిలిపడ్డాము, ఈలోపల
వాన కూడా వెలిసింది. అందమైన ప్రకృతిని చూసి పులకరించి కొన్ని ఫోటోలు దిగాము.
అసలే అందమైన కొండలు,
ఆపై వర్షం పడి తడిచి మహాద్భుతంగా ఉంది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆ ప్రకృతిలో
మైమరుస్తూ ఆ క్లిష్టమైన రహదారుల వెంబడి జాగ్రత్తగా వెళ్ళాము. ఇంచుమించు సముద్ర మట్టానికి
11000 అడుగుల ఎత్తుకి చేరుకుని దిగాము. కొండల నిండా యాత్రికులతో సందడిగా ఉంది. క్రిక్కిరిసిన
హోటల్లు, వారికి జీప్ టూర్లు, ఆఫ్ రోడ్ అడ్వెంచర్లతో ఆ ప్రదేశం ఒక చక్కని యాత్రాస్థలమని
మాకు తెలిసిపోయింది. మధ్యమధ్యలో మంచి చోట్ల ఆగుతూ ఫోటోలు దిగుతున్నాము. ఒక చోట కృష్ణ
బైకు ఆపింది. రోడ్ పక్కన గులకరాళ్ళు ఉండేసరికి బైకు జారి కింద పడిపోయింది. రూపి కూడా
అలాగే ఆగడం, బైకు పడిపోవడం జరిగింది.
బైకర్లు ఒకరినొకరు అనుసరిస్తూ వెళ్తూ ఉన్నపుడు ముందు అతను చేసిన తప్పు మనం కూడా చెయ్యడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన ముందు అతను అదుపు తప్పి రోడ్ పక్కకి వెళ్ళినపుడు మనం అతన్ని చూడకుండా రోడ్ మీద మనసు పెట్టి వెళ్ళాలి. అతన్ని చూస్తే మనం కూడా అతని లాగే రోడ్ దిగిపోవడానికి చాకా అవకాశాలున్నాయి. కొన్ని సంవత్సరాల ముందు మేము టెక్సాసులోని హిల్ కంట్రీలో ప్రయాణం చేస్తున్నపుడు మాకు ఇటువంటి అనుభవమే జరిగింది.
బైకర్లు ఒకరినొకరు అనుసరిస్తూ వెళ్తూ ఉన్నపుడు ముందు అతను చేసిన తప్పు మనం కూడా చెయ్యడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన ముందు అతను అదుపు తప్పి రోడ్ పక్కకి వెళ్ళినపుడు మనం అతన్ని చూడకుండా రోడ్ మీద మనసు పెట్టి వెళ్ళాలి. అతన్ని చూస్తే మనం కూడా అతని లాగే రోడ్ దిగిపోవడానికి చాకా అవకాశాలున్నాయి. కొన్ని సంవత్సరాల ముందు మేము టెక్సాసులోని హిల్ కంట్రీలో ప్రయాణం చేస్తున్నపుడు మాకు ఇటువంటి అనుభవమే జరిగింది.
జీవితంలో అనుభవాలని మించిన ఉపాధ్యాయుడు ఉండడు!
దేవేందర్, వినయ్ ఇద్దరూ కలిసి బైకుని నిలబెట్టారు.
రోడ్ మీద ఉన్నంతసేపూ బైకు బాగనే ఉంటుంది, రోడ్ కింద నడవాలంటే కష్టం. టైర్లు జారిపోయి
కింద పడిపోతాయి. అడ్వెంచర్ బైకులు అయితే ఆ ఇబ్బంది ఉండదు.
దారి పొడుగునా గల గల పారుతున్న
సెలయేరు మాత్రం నయనానందకరంగా ఉంది. కొండలు దిగి గన్నిసెన్ లేక్ చేరుకున్నాము. పెద్ద
లేక్ చుట్టూ ప్రయాణించి దాని పక్కనే మా కాంప్ గ్రౌండ్ చేరుకున్నాము. ఇక్కడ అందరం కాబిన్లలో
దిగాము. వర్షానికి తడిచి చిరాకుగా ఉన్న అందరూ వేడి నీళ్ళతో స్నానాలు చేసి బడలికకి వీడ్కోలిచ్చాము.
ఈలోపల కేకే దగ్గరలో ఉన్న దేశీ హోటల్ నుండి బిరియాని, చైనీస్ హోటల్ నుండి ఫ్రైడ్ రైస్
తెచ్చాడు. వేడి, వేడిగా తినేసాము. కాసేపు వినయ్ కాబిన్లో, కాసేపు మా కాబిన్లో అందరం
ఆరోజుటి ప్రయాణం గురించి బాగా కబుర్లు చెప్పుకున్నాము. ఇంతకు ముందు టెంటులో విద్యుత్
సౌకర్యం లేదు. సెల్ ఫోన్ మాత్రం నా బైకులోనే చార్జ్ చేసుకుంటూ ఉన్నాను ఇన్ని రోజులూ.
కాబిన్లోకి రాగానే తెచ్చుకున్న సర్జ్ ప్రొటెక్టర్ కి కెమెరా, సెల్ ఫోన్, హెల్మెట్ బ్లూ
టూత్ చార్జింగ్ కి పెట్టేసా.
ప్రతి రోజూ రాత్రి పడుకోబోయే ముందు తరువాత రోజు కార్యక్రమం
ఒకసారి గుర్తు చేసుకునే వాళ్ళం. కేకే, ఫరూఖ్ అడ్వెంచర్ బైక్స్ మీద వచ్చారు, వాళ్ళకి
మట్టినేలపై వెళ్ళే పధకం ఉంది. అడ్వెంచర్ బైకులు రోడ్ మీద కాకుండా కింద కూడా నడుస్తాయి.
మోకాలు నీళ్ళలో కూడా నడపచ్చు. వాళ్ళిద్దరూ కాసేపు ఆ ముచ్చట తీర్చుకుని లంచులో కలుస్తామని
చెప్పారు. కేకే ఆవిడ మా వెనక ట్రక్కులో వస్తామని చెప్పారు.
ఈరాత్రి నేను,
ఫరూఖ్ ఒక కాబిన్. నేను పైనున్న బంక్ బెడ్ మీద పడుకున్నా. ఫరూఖ్ కిందనే ఉన్న బెడ్ మీద
పడుకున్నాడు.
ప్రయాణంలో నాలుగవరోజు విశేషాలతో రేపు కలుద్దాము.
4 comments:
నిజమే మే. అనుభవం పాఠాలు నేర్ఫుతుంది.
ధన్యవాదాలు అనిల్ గారు.
అమెరికాలో బైకువాళ్ళంటే టాట్టూలు, బనీనులు, పిల్లి గడ్డాలూ, మీసాలూ అనుకునే నాకు మన తెలుగువాళ్ళు కూడా ఈ అద్భుతమైన అడ్వెంచరులు అనుభవంలోకి తెచ్చుకోవచ్చని మాతో మీ అనుభవాలని పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఫోటోలు అద్భుతంగా వున్నాయి.
చాలా సంతోషం సత్యం గారు. అమెరికన్లలో కూడా మంచి బైకర్లు చాలా మంది ఉంటారు. మొగుడూ, పెళ్ళాం కలిసి చక్కగా బైకింగ్ చేస్తారు.
Post a Comment